ఓట్ల లెక్క తప్పిందా.. తప్పించారా?!
- DV RAMANA
- Aug 9, 2024
- 3 min read
దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ తీరుపై అనుమానాలు
ఏకంగా 538 నియోజకవర్గాల్లో తేడాలున్నాయని ఆరోపణలు
362 చోట్ల పోలైన వాటికంటే తక్కువ లెక్కింపు
176 చోట్ల ఈవీఎంలో నమోదైన వాటికంటే ఎక్కువ లెక్కింపు
ఒంగోలు, బొబ్బిలి, విజయనగరం లెక్కింపుపై ఓడిన అభ్యర్థుల ఫిర్యాదు
వాటిలో రీ కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అనుమతి

ఇటీవలి ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వైకాపా అభ్యర్థి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. వాటిని మళ్లీ లెక్కించేందుకు కూడా ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇలా జరగలేదు. దేశవ్యాప్తంగా 538 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం కనిపించిందని కొన్ని స్వతంత్ర సంస్థలు నిర్వహించిన అధ్యయనం తేలిందంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటే.. మరికొన్నింటిలో తక్కువగా ఉండటాన్ని గణాంకాలతో సహా ఆ సంస్థలు బయటపెట్టాయి. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మన రాష్ట్రంలోని ఒంగోలు, మరో రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఓడిపోయిన అభ్యర్థుల ఫిర్యాదు మేరకు వారి ఫీజులు వసూలు చేసి మరోమారు మాక్ లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే తేడాలున్న మిగతా నియోజకవర్గాల సంగతేంటి? ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఫిర్యాదు చేయకపోతే ఈ అనుమానాలను అలాగే వదిలేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మనదేశ ఎన్నికల వ్యవస్థలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) ప్రవేశించిన నాటినుంచీ వాటిపై అనుమానాలు, ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈవీఎంలను అధికార పార్టీలు ట్యాంపర్ చేస్తున్నాయని ఓడిపోయిన పార్టీలతోపాటు పలు స్వతంత్ర సంస్థలు ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈవీఎంలో ఏ గుర్తుపై బటన్ నొక్కిన అధికార పార్టీ గుర్తుకే ఓటు నమోదవుతోందన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఎన్నికల సంఘం, ఈవీఎంలు తయారు చేసిన సంస్థలు, పలువురు ఎలక్ట్రానిక్ ఇంజినీర్లు ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. ఈవీఎంలను ఏవిధంగానూ ట్యాంపర్ చేయలేరని ప్రయోగాత్మకంగా చూపించి మరీ వారు ఢంకా బజాయించి చెబుతున్నా ఆరోపణలు, అనుమానాలు మాత్రం సమసిపోవడంలేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ వివాదం రేగడం కామన్ అయిపోయింది. అయితే దీనిపై ప్రభుత్వాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఓటమిని తట్టుకోలేక ఇటువంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని విమర్శిస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వచ్చాయి. అయితే దాంతోపాటు అదనంగా మరో తీవ్ర ఆరోపణ జతకూడిరది. ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగానో.. ఎక్కువగానో ఓట్లు లెక్కించారన్నది కొత్తగా వచ్చిన ఆరోపణ. ఇలా జరగడం నిజమే అయితే.. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన వారికి అన్యాయం జరిగినట్లే అంటున్నారు. అదే సమయంలో భారీ మెజారిటీలు వచ్చిన చోట గెలుపు ఓటములపై పెద్ద ప్రభావం ఉండకపోయినా మెజారిటీ లెక్కలు మారిపోతాయి. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), ఓట్ ఫర్ డెమొక్రసీ సంస్థలు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి లెక్కింపు అవకతవకలపై నియోజకవర్గాల వారీగా అంకెలతో సహా సమగ్ర నివేదికను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు కొద్దిరోజుల క్రితం అందజేశాయి. అయితే వాటిపై ఎంతవరకు ఎన్నికల సంఘం స్పందించలేదు.
నివేదికలో విస్తుపోయే అంశాలు
దేశంలో మొత్తం 542 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. ఏకంగా 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలున్నట్టు ఏడీఆర్ తన నివేదికలో వెల్లడిరచడం విస్తుపోయేలా చేస్తోంది. మీడియాకు అందజేసిన వివరాల ప్రకారం.. 362 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్ల కంటే 5,54,598 ఓట్లను తక్కువగా లెక్కించారట! మరో 176 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్ల కంటే 35,093 ఓట్లు ఎక్కువగా లెక్కించారు. మొత్తంగా చూస్తే లెక్కింపులో 5,89,691 ఓట్ల వ్యత్యాసం చోటుచేసుకుంది. ఏడీఆర్ తన నివేదిక పేర్కొన్న కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే.. కరీంగంజ్ (అస్సాం)లో మొత్తం 11,40,349 ఓట్లు పోలైతే 3811 ఓట్లు తగ్గించి 11,36,538 ఓట్లే లెక్కించారు. ఒంగోలు(ఏపీ)లో 14,01,174 ఓట్లు పోల్ కాగా 1467 తక్కువగా 13,99,707 ఓట్లనే లెక్కించారు. మాండ్లా (ఎంపీ)లో 15,31,950 ఓట్లు నమోదైతే 1089 తక్కువగా 15,30,861 ఓట్లే లెక్కించారు. మరోవైపు చూస్తే తిరువళ్లూరు(తమిళనాడు)లో 14,13,947 ఓట్లు నమోదైనట్లు ఈవీఎంలో రికార్డు కాగా లెక్కింపు సమయానికి 14,30,738 ఓట్లు ఉన్నట్లు తేలింది. అంటే 16,791 ఓట్లు ఎక్కువగా లెక్కించారన్న మాట. కోక్రారaార్(అసోం)లో 12,29,546 ఓట్లు పడితే వాటికంటే 10,760 అధికంగా 12,40,306 ఓట్లు లెక్కించారు. ఢెంకనాల్(ఒడిశా)లో 11,84,033 ఓట్లు పోలైతే 9,427 అధికంగా 11,93,460 ఓట్ల లెక్కించారు. ఇలా మొత్తం 538 నియోజకవర్గాల్లోనూ హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ అంశంపై యూపీలో చర్చ జరిగినప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ స్పందిస్తూ ఎన్నికల సంఘం వివిధ హ్యాండ్ బుక్స్, మాన్యువల్స్‌లో నిర్దేశించిన ప్రొటోకాల్స్ పాటించకపోవడం వల్ల ఇటువంటి తేడాలు రావచ్చని అన్నారు. వాస్తవ పోలింగ్‌కు ముందు నిర్వహించే మాక్‌పోలింగ్ డేటాను క్లియర్ చేయకపోయినా, వీవీ ప్యాట్లు తొలగించకపోయినా లేదా ఫాం 17లో తప్పుగా రికార్డు చేసినా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆయన పేర్కొనడం విశేషం. దీంతోపాటు పోలింగ్ అనంతరం పోలైన ఓట్ల వివరాల వెల్లడిలో జరిగిన అసాధారణ జాప్యం, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి కొంత డేటా తొలగించడం వంటివి మరిన్ని అనుమానాలకు ఆస్కారమిచ్చాయి.
ఏపీ ఓట్ల లెక్కింపులోనూ తేడాలు
ఏడీఆర్ సమర్పించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా విశేషంగా ప్రస్తావించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల వ్యత్యాసం చోటు చేసుకున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉందని వెల్లడిరచింది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం పోలైన వాటి కంటే 85,775 ఓట్లు తక్కువగా లెక్కించారని, అదే సమయంలో మరో నాలుగు నియోజకవర్గాల్లో 3225 ఓట్లు ఎక్కువగా లెక్కించారని ఏడీఆర్ పేర్కొంది. ఈ వ్యత్యాసాలపై ఎన్నికల్లో ఓడిపోయిన వైకాపా పెద్దగా స్పందించకపోయినా మూడు నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడమే కాకుండా పోలైన ఓట్లను తిరిగి లెక్కించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లను రీ కౌంటింగ్ చేయాలంటూ అక్కడి వైకాపా అభ్యర్ది బాలినేని శ్రీనివాసరావు ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు రూ.5,66,400 ఫీజు కూడా చెల్లించారు. నియోజకవర్గ పరిధిలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256.. మొత్తం 12 ఈవీఎంలను మళ్లీ లెక్కించాలని కోరారు. నియోజకవర్గంలో మొత్తం 2,40,242 ఓట్లు ఉండగా ఎన్నికల్లో 2,03,143 ఓట్లు పోలయ్యాయి. అయితే దానికంటే 1182 అధికంగా 2,04,325 ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించారు. రీ కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అనుమతించంతో ఈ నెల 19`24 తేదీల మధ్య దాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అలాగే బొబ్బిలి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి శంబంగి చినఅప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. కాగా మే 13న పోలింగ్, 21 రోజుల తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అయినా అధికశాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్టు విజయనగరం వైకాపా ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి, అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు కూడా చేశారు. విచారణకు జూన్ 10న రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలో ఓట్ల రీ కౌంటింగ్‌లో ఏం తేలుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
Comments