తెల్లవారుజామున 4 నుంచి సన్నాహాలు
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
దానికి సమాంతరంగా 8.30 నుంచి ఈవీఎంల కౌంటింగ్
పోలైన ఓట్ల శాతాన్ని బట్టి రౌండ్ల నిర్ణయం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. అధికార యంత్రాంగం దీనికి ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తోంది. అసలు ఓట్ల లెక్కింపు ఎలా నిర్వహిస్తారు. ఇందులో అనుసరించే విధానాలు, తీసుకునే జాగ్రత్తలు ఏమిటన్న ఆసక్తి సహజంగానే అందరిలో నెలకొంది. పోలింగ్ నిర్వహిణలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో, కౌంటింగ్ విషయంలోనే అంతకంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, ఈసీ పరిశీలకుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. కానీ దానికి కొన్ని గంటల ముందే సన్నాహాలు ప్రారంభిస్తారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ముందే అధికారులు, సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని తమ పనుల్లో నిమగ్నమవుతారు. తెల్లవారుజామున ఐదు గంటలకు సిబ్బందిని వారికి కేటాయించిన టేబుల్స్ చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, సిబ్బందితో లెక్కింపులో గోప్యత పాటిస్తామంటూ ప్రమాణం కూడా చేయిస్తారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో అసలు లెక్కింపు ప్రారంభవుతుంది. 8.30 గంటల వరకు అది కొనసాగుతుంది. నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్లు గెలుస్తారని అంచనా. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉండి చాలా సమయం తీసుకునే పరిస్థితి ఉంటే దాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
ఓట్ల సంఖ్య ఆధారంగా రౌండ్లు
నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలు, వాటి పరిధిలో పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా ఎన్ని రౌండ్లలో లెక్కింపు నిర్వహించాలన్నది అధికారులు నిర్ణయిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి సగటున 30 నిమిషాలు పడుతుంది. సగటున ప్రతి నియోజకవర్గ ఓట్లను 14-15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయితే.. దాన్ని ఒక రౌండ్ పూర్తయినట్టుగా పరిగణిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నెంబర్లను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఏయే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలో ఈ లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఒట్లు వీవీ ప్యాట్ల స్లిప్‌ల సంఖ్యను సరిపోలుస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్పులను రెండోసారి లెక్కపెడతారు. ఇలా మూడుసార్లు చేస్తారు. అప్పటికీ తేడా కనిపిస్తే స్లిప్పుల్లోని అంకే పరిగణనలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించరు.
అందరి ఆమోదంతోనే ఫలితాల ప్రకటన
ఏ రౌండుకు ఆ రౌండు లెక్కింపు పూర్తి అయిన వెంటనే ఆ రౌండు ఎన్నికల వివరాలు ప్రకటిస్తారు. అయితే దానికి ముందు పోటీలో ఉన్న అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల ఆమోదం, సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. మైక్రో అబ్జర్వర్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు లెక్కింపు వివరాలను అంగీకరిస్తున్నట్లు సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత ఆర్వో రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరాలు వ్యక్తమైతే లెక్కింపు ఆలస్యమవుతుంది. ఒక్కో ఈవీఎంలో వెయ్యి నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఒక రౌండుకు 14 నుంచి 15 టేబుల్స్ వేసి ఒక్కో టేబుల్ మీద ఒక్కో ఈవీఎం పెట్టి లెక్కిస్తారు. అంటే ప్రతి రౌండుకు 14వేల నుంచి 15వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ లెక్కన రెండు లక్షల ఓట్లు పోలైన నియోజకవర్గాల లెక్కింపు 16 నుంచి 20 రౌండ్లలోనూ, అంతకుమించి ఎక్కువ ఓట్లు ఉన్న భీమిలి, గాజువాక వంటి పెద్ద నియోజకవర్గాల్లో 24 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇలా..
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గార మండలంతో మొదలై శ్రీకాకుళం రూరల్ మండలంతో పూర్తి అవుతుంది. గార మండలం బలరాంపురం పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంతో నియోజవర్గ ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. తర్వాత శ్రీకాకుళం నగర పరిధికి చెందిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆ క్రమంలో శ్రీకూర్మం, గుజరాతీపేట, అరసవల్లి, పెదపాడు కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. చివరికి శ్రీకాకుళం రూరల్ పరిధిలోని భైరి గ్రామ ఓట్లు లెక్కించడంతో మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుంది.
Comments