top of page

ఓటు వేయడమే.. వేటు వేయలేం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 9
  • 2 min read
  • ఓటర్లకు ఆ హక్కు ఉండాలన్నది దీర్ఘకాల డిమాండ్

  • అది లేకపోవడం వల్లే ఎమ్మెల్యే, ఎంపీల్లో మితిమీరిన ధీమా

  • ప్రజాప్రతినిధి పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయాలి

  • దుర్వినియోగం కాకుండా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి

  •   సామాన్యుడే ‘శర’మెత్తితే- 5

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

మనది ఘనమైన ప్రజాస్వామ్యం. ప్రపంచం మురిసిపోయే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ. ప్రజలే ఓట్లు వేసి తమ ప్రతినిధులను చట్టసభలకు పంపడం, వారంతా కలిసి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమే. ప్రజల మెజారిటీ ఓటుతో గెలిచి ప్రజాప్రతినిధులైనవారు ఆ ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా?? ప్రజాక్షేమం చూస్తున్నారా???.. ఈ ప్రశ్నలకు సమాధానం సమాజం మొత్తానికి తెలుసు. అవేవీ నెరవేరడం లేదని, ఎన్నికైన నాయకులు మళ్లీ ఐదేళ్ల వరకు ప్రజలను పట్టించుకోవడం లేదన్నది వాస్తవం. ప్రజలు కూడా ఈ నాయకులు ఇంతే అని సరిపెట్టేసుకుంటున్నారు. పరిస్థితులతో రాజీపడి బతికేస్తున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో తప్ప నాయకులను నిలదీసే పరిస్థితి లేదు. దీనికి కారణం ఓటు వేసి నాయకులను గెలిపించే ఓటర్లకు.. అదే నాయకుడి పనితీరు బాగులేకపోయినా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అధికారం, హక్కు లేకపోవడమే. ఇదే లోపాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల రాజ్యసభలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఓటు హక్కు ఉన్న ప్రజలకు రైటు టు రీకాల్ హక్కు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.

పని చేయకపోయినా..

మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు లభిస్తుంది. అంటే తమ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో స్థానికం నుంచి నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అంటే సర్పంచ్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీలను ఓటు వేసి ఎన్నుకుంటున్నాం. వీరంతా తమను ఎన్నుకున్న ప్రజలకు ఆయా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తుంటారు. వారి సమస్యలను ఆయా సభల ద్వారా ప్రభుత్వాల దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల సందర్భంగా చాలా హామీలు ఇచ్చి తమను ఎన్నుకుంటే వాటిని అమలు చేస్తామని ప్రకటిస్తారు. తీరా ఎన్నికయ్యాక చాలా మంది ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజల ముఖం చూడటమే మానేస్తున్నారు. తమ నియోజకవర్గ సమస్యలను గానీ, తామిచ్చిన హామీలను గానీ పట్టించుకోని వారే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత వ్యాపకాలు, వ్యాపారాలు, పైరవీలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి ప్రజాప్రతినిధులపై నియోజకవర్గ ప్రజల్లో అసంతప్తి పెరగడం సహజం. కానీ ఏం చేయలేని పరిస్థితి. కారణం.. ఎన్నుకునే హక్కు ఉన్న ప్రజలకు నచ్చకపోతే తొలగించే(రీకాల్ చేసే) అధికారం మాత్రం లేకపోవడమే. అలా చేయాలంటే మళ్లీ ఐదేళ్ల వరకు.. అంటే ఎన్నికలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. ఒకసారి ఎన్నికైతే ఇక ఐదేళ్ల వరకు తమను ఎవరూ కదిలించలేరన్న ధీమా మెజారిటీ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తుంది. అదే అహంతో వారు ప్రజాసేవను విస్మరించి మిగతా అన్ని వ్యవహారాల్లోనూ తలదూరుస్తూ పెత్తనం చెలాయిస్తుంటారు. చాలామంది ఎన్నుకున్న ప్రజలనే తిరస్కారభావంతో చూస్తుంటారు.

ప్రత్యేక యంత్రాంగం ఉండాలి

ప్రజాప్రతినిధులను ఎన్నుకునే అధికారం ఉన్నట్లే.. నచ్చకపోతే అదే ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తప్పించి వెనక్కి పిలిచే హక్కు కూడా ఉండాలన్న సామాన్య ఓటర్ల దీర్ఘకాల డిమాండ్‌ను రాఘవ్ చద్దా ప్రభుత్వం ముందు ఉంచారు. రైట్ టు రీకాల్ హక్కును రాజకీయాలపైకి ఎక్కిపెట్టిన ఆయుధంగా భావించరాదని సూచించారు. అవిశ్వాస తీర్మానాలతో ప్రభుత్వాలను దించే, అభిశంసించే అవకాశం ఉంది. దేశంలోనే ఉన్నత రాజ్యాంగ పదవులైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను కూడా మెజారిటీ ఓటుతో అభిశంసించవచ్చు. అలాగే న్యాయమూర్తులను కూడా చట్టసభల ద్వారా అభిశంసించే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్యే, ఎంపీలకు మాత్రం ఎందుకు మినహాయింపు? తమ ప్రజాప్రతినిధి పనితీరు నచ్చనప్పుడు అతన్ని వెనక్కి పిలిపించే అవకాశం ఓటర్లకు ఎందుకు ఇవ్వరు? అని ఆయన ప్రశ్నించారు. అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ సహా 24 దేశాల్లో రైటు టు రీకాల్ వ్యవస్థ అమల్లో ఉంది. 2002లో కాలిఫోర్నియాలో పవర్ కట్లతో ఎనర్జీ క్రైసిస్ ఏర్పడితే ఎదుర్కోవడంలో విఫలమయ్యారన్న చిన్న కారనంతో అప్పటి మేయర్ క్రిస్ డేవిస్‌పై 1.3 మిలియన్ల ఓటర్లు రీకాల్ డిమాండ్‌తో ఓటు వేస్తే అతన్ని తొలగించారు. మనదేశంలోనూ ఆ తరహా వ్యవస్థ తీసుకురావాలని చద్దా సూచించారు. మనదేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో పంచాయతీ స్థాయిలో ఈ వ్యవస్థ ఇప్పటికే ఉందని, దీన్ని ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా వర్తింపజేయాలని కోరారు. అయితే రైట్ టు రీకాల్ అనేది దుర్వినియోగం కాకుండా చూడటం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం ఎన్నికల సంఘం పరిధిలోనే ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలి. ఒక ప్రజాప్రతినిధి పనితీరును అంచనా వేయడానికి ఎన్నికైన తర్వాత కనీసం 18 నెలల సమయం ఇవ్వాలి. ఆ తర్వాత నచ్చలేదంటూ ఓటర్ల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకుని రైట్ టు రీకాల్‌ను వినియోగించుకునే హక్కును ఉపయోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇచ్చి ఓటింగ్ నిర్వహించాలి. 50 శాతానికిపైగా ఓట్లు వస్తే సంబంధిత ప్రజాప్రతినిధిని పదవి నుంచి తప్పించి ఇంటికి పంపించే అవకాశం ఓటర్లకు కల్పిస్తే ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. అలవిమాలిన హామీలు ఇచ్చే దుస్సంప్రదాయం మాయమయ్యే అవకాశం ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page