top of page

ఓ గొప్ప ఆటగాడి దీనస్థితి..

Writer: ADMINADMIN


బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టులో మీకెవరు తెలుసు అని అడిగితే.. క్రికెట్‌ అంటే అంతంత మాత్రం తెలిసిన వాళ్లు కూడా చెప్పే పేరు షకీబుల్‌ హసన్‌. ఇండియాలో షకీబుల్‌ హసన్‌, ముస్తఫిజుర్‌ రెహ్మన్‌ తప్ప.. ఇతర ఆటగాళ్ల పేర్లు చాలా మందికి తెలియదు. షకీబుల్‌ హసన్‌ బంగ్లా క్రికెట్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన ఆటగాడు. 2006లో క్రికెట్‌ కెరీర్‌ స్టార్ట్‌ సిన షకీబ్‌ అల్‌ హసన్‌.. 66 టెస్టులు, 247 వన్డేలు, 125 ఇంటర్నేషనల్‌ టీ20లు, 102 ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాడు. షకీబ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 14 సెంచరీలు చేశాడు. మరోవైపు బౌలింగ్‌లో కూడారాణించాడు. టెస్టుల్లో 233 వికెట్లు, వన్డేల్లో 315 వికెట్లు, టీ20ల్లో 84 వికెట్లు తీసి బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నాడు. షకీబుల్‌ గొప్ప ఆటగాడే. కానీ అతడికి క్రమశిక్షణ విషయంలో మాత్రం సున్నా మార్కులు వేయొచ్చు. అనేక సార్లు మైదానంలోనే దురుసుగా ప్రవర్తించి ఐసీసీ వేటుకు గురయ్యాడు. అతనికి ఆటిట్యూడ్‌ ప్రాబ్లెం ఉందని స్వయంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డే వ్యాఖ్యానించింది. బోర్డుకు చెప్పకుండా సీపీఎల్‌లో ఆడటానికి వెళ్లాడని అతడిని దేశం తరపున ఆడకుండా నిషేధించింది. 2019లో యాంటీ కరప్షన్‌ కోడ్‌ 2.4.4 కింద ఐసీసీ అతడిని ఒక ఏడాది పాటు బ్యాన్‌ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే మైదనంలో, మైదానం బయట అనేక వివాదాస్పద సంఘటనలు షకీబుల్‌ హసన్‌ కెరీర్‌లో ఉన్నాయి. షకీబుల్‌ ప్రవర్తన ఎలా ఉన్నా.. ఎన్ని సార్లు సస్పెన్షన్లు, బ్యాన్లు విధించినా.. ఆతను ఆటలో మాత్రం గొప్పగా రాణించాడు. అందుకే ఆతనికి బంగ్లాలో ఫ్యాన్స్‌ ఎక్కువ. ఈ నేపథ్యంలో షకీబుల్‌ క్రికెట్‌ ఆడుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 2023లో ఆయన అవామీ లీగ్‌ పార్టీలో జాయిన్‌ అయ్యాడు. 2024 జనరల్‌ ఎలక్షన్స్‌లో మగురా-1 సీటు నుంచి గెలిచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. ఇక్కడి నుంచే అతడి లైఫ్‌ టర్న్‌ అయ్యింది. ఇటీవల బంగ్లాలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. షేక్‌ హసీనా ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆమెకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ నేతలను ఎవరినీ ప్రజలు వదిలిపెట్టలేదు. ఈ క్రమంలో హసీనాతో సహా అనేక మంది అవామీ లీగ్‌ నాయకులు దేశం వదిలి వెళ్లారు. షకీబుల్‌ హసన్‌ కూడా ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో లేడు. అయితే ఆయనపై ఒక హత్య కేసు మాత్రం నమోదయ్యింది. బయటి దేశాల్లో క్రికెట్‌ ఆడుతూ స్వదేశానికి వెళ్లని షకీబుల్‌ హసన్‌.. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నాడు. తన సొంత గడ్డపై చివరి టెస్టు ఆడే అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో మీర్పూర్‌లో జరగనున్న టెస్టులో చివరి సారిగా ఆడి రిటైర్‌ అవుతానని బంగ్లా క్రికెట్‌ బోర్డును, అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆ మ్యాచ్‌ ఆడిన తర్వాత అసలు దేశంలోనే ఉండనని.. తన కుటుంబంతో సహా అమెరికా వెళ్లిపోతానని వేడుకుంటున్నాడు. ఒక వేళ తాను చివరి టెస్టు అక్కడ ఆడటానికి అవకాశం కల్పించకపోతే ప్రస్తుతం కాన్పూర్‌లో ఇండియాతో జరుగుతున్నదే ఆఖరి టెస్టు అవుతుందని చెప్పాడు. అయితే షకీబుల్‌కు భద్రత కల్పించే బాధ్యత మాది కాదని బంగ్లా క్రికెట్‌ బోర్డు అంటోంది. ఆవామీ పార్టీ ఎంపీగా గెలిచిన అతడి భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలని చెబుతోంది. దీంతో ప్రస్తుతం షకీబుల్‌ హసన్‌ ఎటు వెళ్లాలో తెలియని ఇరకాటంలో పడ్డాడు. బంగ్లా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నాడు. అతని స్నేహితులు మాత్రం తిరిగి బంగ్లాదేశ్‌కు రావొద్దని.. కుటుంబంతో కలిసి అటు నుంచి అటే అమెరికా వెళ్లిపోవాలని సలహాలు ఇస్తున్నారు. ఒక క్రికెటర్‌ కెరీర్‌ ఇలా అర్థాంతరంగా ముగిసి.. దేశం నుంచి పారిపోయేలా చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇదంతా షకీబుల్‌ హసన్‌ స్వయంకృతాపరాధమే అని సన్నిహితులు చెబుతుంటారు.

భాయ్‌జాన్‌


 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page