`రెండు దశాబ్దాల తర్వాత అసలు కుట్ర వెలుగులోకి
`సీబీసీ తాజా ఛార్జిషీటులో బట్టబయలు
`మాల్దీవుల మహిళపై కన్నేసిన సీఐ విజయన్
`నిరాకరించిందన్న కక్షతో గూఢచర్యం కేసు బనాయింపు
`క్రయోజనిక్ ఇంజిన్ ప్రాజెక్టు చీఫ్ నంబి నారాయణన్ బలి
`ఆయనతోపాటు మరో ఆరుగురు జైలుపాలు
`సుదీర్ఘ న్యాయపోరాటంలో ఎట్టకేలకు విజయం
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఇస్రో గూఢచర్యం కేసు గురించి తెలుసా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది తెలియదని చెప్పవచ్చు. కానీ రాకెట్రీ సినిమా చూశారా? అంటే మాత్రం చూశామని చెబుతారు. ఇస్రో గూఢచర్యం కేసునే కథాంశంగా చేసుకుని తీసిన సినిమా అది. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందింది. భారత అంతరిక్ష పరిశోధనల రహస్యాలను విదేశాలకు చేరవేస్తున్నారనే అవాస్తవ ఆరోపణలతో ఇస్రోలో క్రయోజనికి ఇంజిన్ ప్రాజెక్టు చీఫ్‌గా ఉన్న శాస్త్రవేత నంబి నారాయణన్‌ను ఈ కేసులో ఇరికించి అన్యాయంగా జైలు పాల్జేసిన దారుణ ఉదంతమిది. దీనిపై ఆయన న్యాయపోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా న్యాయంతో పాటు పరిహారం పొందారు. తర్వాత ఆయనకు కేంద్రం పద్మవిభూషణ్‌తోనూ సత్కరించింది. ఈ కుట్ర కేసుల వెనుక అసలు కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. ఒక విదేశీ మహిళపై కన్నేసి, ఆమె నుంచి తిరస్కరణకు గురైన కేరళకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఆ కక్షతో సదరు మహిళకు సన్నిహితుడైన ఇస్రోకు చెందిన శశికుమారన్‌తో పాటు నంబి నారాయణన్‌ను గూఢచర్యం కేసులో ఇరికించారని తాజాగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొనడం విశేషం. ఈ కుట్రలో ఒకప్పటి కేరళ, గుజరాత్ మాజీ డీజీపీల నిర్లక్ష్యం, ప్రమేయం కూడా ఉన్నాయని కూడా ఛార్జిషీట్‌లో పొందుపర్చారు.
మహిళ అరెస్టుతో మొదలై..

రెండు దశాబ్దాల క్రితం 1994 అక్టోబర్ 20న కేరళ పోలీసులు మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళను ఫారినర్స్ యాక్ట్ కింద అరెస్టు చేశారు. మాల్దీవులకు వెళ్తుండగా విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం ఈ కేసును గూఢచర్యం కేసుగా మార్చారు. ఇస్రోకు చెందిన తుంబా రాకెట్ కేంద్రంగా మన దేశ క్రయోజనిక్ ఇంజిన్ ప్రాజెక్టు రహస్యాలు విదేశాలకు మరియం రషీదా ద్వారా తరలిపోతున్నాయని ఆరోపిస్తూ గూఢచర్యం కేసు నమోదు చేశారు. ఇందుకోసం ఆమె ఇస్త్రో శాస్త్రవేత్తలతో పరిచయాలు పెంచుకుని రహస్యాలు సేకరిస్తోందని అభియోగం మోపారు. ఆమెకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ఇస్రో శాస్త్రవేత్తలు నంబి నారాయణన్, డి.శశికుమారన్‌తో పాటు రష్యా స్పేస్ ఏజెన్సీ గ్లావ్‌కాస్మోస్ భారత ప్రతినిధి చంద్రశేఖర్, మాల్దీవులకు చెందిన మరో మహిళ ఫౌజియా హాసన్, బెంగళూరుకు చెందిన లేబర్ కాంట్రాక్టర్ ఎస్.కె.శర్మలను అరెస్టు చేశారు. ఈ కేసును తొలుత ఇన్‌స్పెక్టర్ ఎస్.విజయన్ దర్యాప్తు చేశారు. ఆ తర్వాత కేసును అప్పటి డీఐజీ సీబీ మేథ్యూ నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. ఇంటెలిజెన్స్ బ్యూరో అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆర్.బి.శ్రీకుమార్(గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి) ఆధ్వర్యంలోనూ మరో విచారణ జరిగింది. ఈ కేసులన్నింటిలోనూ నంబి నారాయణన్‌తో పాటు ఇతరు నిందితుల పాత్రపై సరైన విచారణ జరపకుండానే, ఆధారాలు లేకుండానే ఎఫ్‌ఐఆర్‌లో వారిపై అభియోగాలు మోపి 50 రోజులకు పైగా జైల్లో పెట్టారు.
న్యాయపోరాటంలో విజయం

భారత అంతరిక్ష కార్యకలాపాలకు కీలకమైన లిక్విడ్ ప్రొపెల్షన్ క్రయోజనిక్ ఇంజిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తూ ఎంతో పేరుప్రఖ్యాతులు పొందిన నంబి నారాయణన్ తనపై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు మోపిన గూఢచర్యం కేసుపై సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. అదే సమయంలో ఈ కేసును సీబీఐకి అప్పగించగా.. విచారణ అనంతరం 1996లో ఎర్నాకుళం చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్‌కు సమర్పించిన నివేదికలో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు నంబి నారాయణన్ బృందంపై మోపిన ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. దాంతో 1996 మే రెండో తేదీన కోర్టు నిందితులందరినీ విడుదల చేసింది. తర్వాత కూడా కేసు పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగింది. మరోవైపు జైలు నుంచి బయటకొచ్చిన నంబి నారాయణన్ తప్పుడు కేసుతో తన పరువు ప్రతిష్టలను దెబ్బతీయడంపై కేరళ హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు దర్యాప్తు సంస్థలను తీవ్రంగా మందలించినా కేసు దర్యాప్తును నిలిపివేసేందుకు మాత్రం అంగీకరించలేదు. దాంతో నంబి నారాయణన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 1998లో గూఢచర్యం కేసు విచారణకు కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ తర్వాత నంబి నారాయణన్ పోలీసుల నుంచి రూ.కోటి నష్టపరిహారం కోరుతూ జాతీయ మానవహక్కుల సంఘంలో పిటిషన్ వేయగా రూ.10 లక్షల తాత్కాలిక పరిహారం ఇవ్వాలని సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను తప్పుడు ఆరోపణలతో బదనాం చేసినందుకు నంబి నారాయణన్ 2015లో సీబీ మాథ్యూ నేతృత్వంలోని దర్యాప్తు బృందంపై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో నంబి నారాయణన్‌కు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, తప్పు చేసిన పోలీసు, విచారణ అధికారులపై చర్యలు సూచించేందుకు డీకేజైన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2021లో సమర్పించిన నివేదికలో ఈ కేసు చాలా తీవ్రమైనదని, మరింత లోతైన దర్యాప్తు అవసరమని సూచించింది. ఆ మేరకు దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
అసలు కుట్ర వెలుగులోకి..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ జరిపిన దర్యాప్తులో అసలు కుట్రకోణం బయటపడిరది. తన వాంఛ తీర్చుకోవడంలో విఫలమైన ఒక పోలీసు అధికారి కక్ష ఫలితంగానే ఇస్రో గూఢచర్యం కేసు పట్టుకొచ్చిందని సీబీఐ ఇటీవల సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో వెల్లడిరచింది. దీనికి కారకుడు, బాధ్యుడు తొలుత ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన ఇన్‌స్పెక్టర్ విజయన్ అని స్పష్టం చేసింది. మాల్దీవులకు చెందిన మరియం రషీదాపై ఇన్‌స్పెక్టర్ విజయన్ కన్నేశారు. అప్పటికే వీసా గడువు ముగిసినా భారత్ నుంచి వెళ్లనందుకు ఆమెపై కేసు ఉంది. దీన్ని ఆసరా చేసుకుని ఒక హోటల్లో తన కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించగా రషీదా తిరస్కరించింది. దాంతో కక్ష పెంచుకున్న ఇన్‌స్పెక్టర్ ఇస్రో శాస్త్రవేత్త శశికుమారన్‌తో ఆమెకు ఉన్న పరిచయాన్ని ఆసరా చేసుకుని ఆమెపై గూఢచర్యం కేసు బనాయించే కుట్రకు తెరతీశారు. రషీదా పాకిస్థాన్ గూఢచారి అని.. ఇస్రో శాస్త్రవేత్తలతో పరిచయాలు పెంచుకుని కీలకమైన క్రయోజనిక్ ఇంజన్ ప్రాజెక్టు రహస్యాలను పాక్ చేరవేస్తోందని ఆరోపిస్తూ రషీదాతోపాటు నంబి నారాయణన్, శశికుమార్ తదితరులపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును టేకప్ చేసిన ఇంటెలిజెన్స్, సీబీఐ బృందాలు కూడా సరైన విచారణ జరపకుండానే, తగిన ఆధారాలు సేకరించకుండానే కేసులు ఫైల్ చేశారని సీబీఐ తాజా ఛార్జిషీట్‌లో వెల్లడిరచింది. ఆ మేరకు ఇన్‌స్పెక్టర్ విజయన్‌తోపాటు ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్రధారులైన కేరళ, గుజరాత్ మాజీ డీజీపీలు సి.బి.మాథ్యూస్, ఆర్.బి శ్రీకుమార్, మరో ముగ్గురు మాజీ పోలీసులపై కేసులు పెట్టాలని సూచించారు. మొత్తానికి ఇస్రో గూఢచర్యం కేసు వ్యక్తిగత కక్షల ఫలితమని తేలినా.. దాని వల్ల ఒక ప్రముఖ శాస్త్రవేత్త జీవితాన్ని బలిగొనడం ఆవేదనకు గురిచేస్తోంది.
Comments