top of page

ఓం ‘భూమి’ బుస్‌!

Writer: ADMINADMIN
  • `శమళ్ల విజయలక్ష్మి మోసాల వలలో మరో ఇద్దరు

  • `రిజిస్ట్రేషన్‌ పేరుతో డాక్యుమెంట్‌ రైటర్‌కు ఛీటింగ్‌

  • `దఫదఫాలుగా రూ.1.26 కోట్లకు టోపీ

  • `దాన్ని కప్పిపుచ్చేందుకు మరో వ్యక్తి నెత్తిన శఠగోపం

  • `భూమి అమ్మకం, రిజిస్ట్రేషన్‌ పేరుతో సొమ్ము వసూలు

  • `అతనికి తెలియకుండానే దాన్ని రద్దు చేయించిన ఘనురాలు

కిలాడీ లేడీ శమళ్ల విజయలక్ష్మి బాగోతాల గురించి ఎన్ని రాసినా తరగడంలేదు. రాసేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టి న ఆమె తనను నమ్మి డబ్బులిచ్చినవారందరినీ రోడ్డున పడేసింది. ముఖ్యంగా యువతకు వల వేసి వారి నుంచి భారీ మొత్తాలు లాగేసిందంటే.. ఆమె దేన్ని ఎరవేసి ఉంటుందో వేరేగా చెప్పనక్కర్లేదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసిన వారిపై పోలీసుల సహకారంతో పోక్సో కేసులు పెట్టడం ఈమెకు ఆనవాయితీగా మారింది. ఈ మోసాల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన రూ.12 కోట్లను తన సమీప బంధువులకు చెందిన 14 ఖాతాల్లో జమ చేయించుకొని, ఆ తర్వాత బాధితులు మనీ లాండరింగ్‌ కేసు పెడితే పోలీసులకు పెద్దమొత్తంలో ముట్టజెప్పి అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకునే వరకు మేనేజ్‌ చేసుకుంది. ఆమె వలలో పడి ఒక డాక్యుమెంట్‌ రైటర్‌, మరో వ్యక్తి కూడా మోసపోయిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్వయంగా అధికార పార్టీ నాయకులు పూనుకున్నా విజయలక్ష్మిని ఏమీ చేయలేకపోయారన్న మెసేజ్‌ సమాజంలోకి వెళ్లడంతో చాలామంది బాధితులు ఆమెకు వ్యతిరేకంగా బయటకు రావడానికే భయపడుతున్నారు. తన ఆస్తులకు బినామీలుగా ఉంటున్న చెల్లి, మరిది అరెస్టు కాకుండా మనీ లాండరింగ్‌ కేసులో కోటబొమ్మాళి పోలీసులను మేనేజ్‌ చేసిన ఆమె.. కాస్త దూరమనుకున్న వారందర్నీ మాత్రం పోలీసులకు పట్టించేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఐల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఎంవో అధికారులు ఫిర్యాదులో పేర్కొన్న 14 మందిని అరెస్టు చేయాలని ఆదేశించినా విజయలక్ష్మి నుంచి పెద్దమొత్తంలో డబ్బు అందడంతో కోటబొమ్మాళి పోలీసులు ఆ 14 మందిలో 11 మంది పరారీలో ఉన్నట్టు చూపించి ముగ్గుర్ని మాత్రమే అరెస్టు చేశారు. విచిత్రమేమిటంటే.. వీరు ముగ్గురూ విజయలక్ష్మి బాధితులే. ఇప్పటికీ మనీ లాండరింగ్‌ కేసు విచారణలోనే ఉన్నట్టు చూపిస్తూ కోటబొమ్మళి పోలీసులు విజయలక్ష్మికి సహకరిస్తున్నారు. టీడీపీకి చెందినవారితో ఆమెకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆ పార్టీ మద్దతుదారులే ఎక్కువగా ఆమె బారిన పడటం విశేషం. సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర నాయకుడి సోదరుడు కూడా విజయలక్ష్మి బాధితుడేనని స్థానికంగా చెబుతున్నారు. మూడేళ్ల క్రితం అతని వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్న ఆమె ఇప్పటికీ ఆ మొత్తం చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతోందని భోగట్టా. అలాగే కోటబొమ్మాళికి చెందిన ఒక న్యాయవాదికి రూ.8 లక్షలకు టోకరా వేసిందని తెలిసింది. అతని వద్ద మొదట రూ.3 లక్షలు తీసుకొని 15 రోజుల వ్యవధిలో వడ్డీ పేరుతో రూ.30వేలు కలిపి రూ.3.30 లక్షలు ఇచ్చేసింది. అయితే మళ్లీ కొన్ని రోజులకే రూ.8లక్షలు ఇవ్వాలని, నెల రోజుల్లో రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.10లక్షలు ఇస్తానని నమ్మబలికింది. అంతకు ముందే రూ.3 లక్షలకు రూ.30వేలు కలిపి ఇచ్చిందన్న నమ్మకంతో ఆ న్యాయవాది రూ.8లక్షలు ఆమె చేతిలో పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఆ సొమ్ముకు ఆతీగతీ లేదు.

నిండా మునిగిన డాక్యుమెంట్‌ రైటర్‌

ఖరీదైన కారులో తిరుగుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో కోటబొమ్మాళి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ హడావుడిగా తిరిగిన విజయలక్ష్మి అక్కడే డాక్యుమెంట్‌ రైటర్‌గా ఉన్న బోయిన నాగరాజు అనే వ్యక్తిని 2021 సెప్టెంబర్‌ నుంచి 2022 మే ఒకటి వరకు దఫదఫాలుగా మొత్తం రూ.1.26 కోట్లకు టోకరా వేసింది. విజయలక్ష్మి మాయలో పడిన ఆయన తమ ఇంట్లో ఉన్న బంగారంతో పాటు సమీప బంధువుల నుంచి 57 తులాల బంగారం తెచ్చి కుదువపెట్టి ఆ డబ్బును ఆమె చేతిలో పోశాడు. అక్కడితో ఆగకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద అప్పు చేసి మరికొంత నగదు సమర్పించాడు. అయితే నాలుగేళ్లు కావస్తున్నా అసలూ లేదు, కొసరూ లేదు. రియల్‌ లావాదేవీలు నిర్వహించిన ఆమె రెండు మూడుసార్లు నాగరాజు వద్ద డాక్యుమెంట్లు తయారు చేయించి రూ.వెయ్యి ఇవ్వాల్సిన చోట రూ.2వేలు ఇచ్చేది. ఇలా డబ్బులంటే తనకు లెక్క లేనట్లు వ్యవహరించి నాగరాజును బుట్టలో వేసుకుంది. అలా పూర్తి నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత ఒక రోజు సడన్‌గా వచ్చి రిజిస్ట్రేషన్‌ కోసం అర్జెంట్‌గా రూ.25 లక్షలు కావాలని నాగరాజుపై వల వేసింది. తనకు రావాల్సిన డబ్బులు నెల రోజుల్లో అందుతాయని, ఆ వెంటనే ఆసలుకు రూ.15లక్షలు కలిపి మొత్తం రూ.40 లక్షలు ఇస్తానని ఆశ పెట్టింది. అకౌంట్‌లో జమ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మొత్తం క్యాష్‌ రూపంలోనే ఇవ్వాలని సూచించింది. ఆమె మాయమాటలను నమ్మేసిన నాగరాజు వెనకాముందు చూడకుండా తన వద్ద ఉన్న నగదుతో పాటు సన్నిహితుల నుంచి చేబదులుగా మరికొంత తీసుకుని మొత్తం రూ.25లక్షలు విజయలక్ష్మి చేతిలో పెట్టాడు. సీన్‌ కట్‌చేస్తే.. నెల రోజుల తర్వాత నాగరాజు వద్దకు వచ్చిన ఆమె బేలముఖం పెట్టి తాను మోసపోయానని మొసలికన్నీరు కార్చింది. దాంతో అసలు విషయం గ్రహించిన నాగరాజు ‘మోసపోయింది మీరు కాదు నేను’ అంటూ నోరెళ్లబెట్టి మంచం పట్టాడు. దీని నుంచి బయటపడటానికి విజయలక్ష్మి మరో కథ అల్లింది.

భూమి విక్రయం పేరుతో మరో దందా

సంతబొమ్మాళి మండలం మలగాం వద్ద ఉన్న భూమిని విక్రయించి డబ్బులు ఇచ్చేస్తానని నమ్మబలికి ఆ భూమి వేరొకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయడానికి నాగరాజు నుంచి మరికొంత మొత్తం లాగేసింది. మలగాం వద్ద బోరుభద్ర టీడీపీ మాజీ ఎంపీటీసీకి చెందిన 1.80 ఎకరాల భూమిని విజయలక్ష్మి అవసరాల కోసం తనఖా పెట్టడానికి వీలుగా పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చినట్టు తెలిసింది. దీన్ని జలుమూరు మండలం చిన్నయ్యవలసకు చెందిన కె.హరిబాబుకు చూపించి రిజిస్ట్రేషన్‌ చేయకుండానే రూ.30 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే భూమిగా నమ్మించి హరిబాబు నుంచి రూ.30లక్షలు తీసుకొని నాగరాజు ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించింది. హరిబాబు, నాగరాజు ముఖాముఖి కలవకుండానే కోటబొమ్మాళి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మేనేజ్‌ చేసి మలగాం భూవ్యవహారం నడిపింది. విజయలక్ష్మితో కుదిరిన డీల్‌ ప్రకారం హరిబాబు డబ్బులు మట్టుజెప్పినా ఇవ్వలేదనే నాగరాజుకు చెబుతూ వచ్చింది. ఆయన డబ్బులు ఇచ్చిన వెంటనే తన వద్ద తీసుకున్న రూ.60 లక్షలు ఇచ్చేస్తానని నమ్మబలికింది. అయితే ఎందుకో సందేహించిన నాగరాజు ఫోనులో హరిబాబును సంప్రదించగా రిజిస్ట్రేషన్‌ రోజే విజయలక్ష్మికి మొత్తం డబ్బులు చెల్లించేశానని ఆయన చెప్పాడు. దీంతో మరోమారు మోసపోయానని గ్రహించిన నాగరాజు బెంగతో అనారోగ్యం పాలై మంచం పట్టాడు. కోలుకున్న తర్వాత నాగరాజు విజయలక్ష్మికి ఫోన్‌ చేసి రూ.60 లక్షల కోసం మళ్లీ ఒత్తిడి ప్రారంభించాడు. దీంతో మలగాంలోని 1.80 ఎకరాల భూమిని నాగరాజు పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని విజయలక్ష్మి చెప్పింది. హరిబాబుకు విక్రయించిన భూమి తన పేరుతో ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారని ప్రశ్నించగా హరిబాబు పేరుతో చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్టు చెప్పుకొచ్చింది. ఆమె మాటలపై నమ్మకం కుదరని నాగరాజు మళ్లీ హరిబాబును సంప్రదించేందుకు పలుమార్లు ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో సదరు భూమికి సంబంధించిన ఈసీలు తీయించగా, రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినట్టు తేలింది. నాగరాజు మంచం పట్టిన సమయంలో హరిబాబుకు విక్రయించిన రూ.1.80 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో కోటబొమ్మాళి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో హరిబాబు వేసిన బయోమెట్రిక్‌ను హోల్డ్‌లో పెట్టి 15 రోజుల వ్యవధిలో కొనుగోలుదారుడికి తెలియకుండా రిజిస్ట్రేషన్‌ రద్దు చేయించింది. ఈ వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం సిబ్బందిని మేనేజ్‌ చేసినట్లు తెలిసింది.

నోట్‌:తనకు టీడీపీ నాయకుల అండ ఉందని చెప్పుకొంటూ విజయలక్ష్మి ఇలా అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. వాటికి సంబంధించి మరో కథనం రేపటి సంచికలో..

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page