గర్భం దాల్చిన బీసీ హాస్టల్ విదార్థిని
అసలు హాస్టల్‌లోనే లేదని బుకాయించిన వార్డెన్
తల్లిదండ్రులను, పోలీసులను మేనేజ్ చేసిన వైనం
జిల్లాలో వెలుగుచూసిన మరో విద్యార్థిని ఉదంతం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇంట్లో తినడానికి తిండివున్నా.. నాలుగక్షరాలు నేర్చుకుంటే తమ పిల్లలు ప్రయోజకులవుతారని నమ్మి ప్రభుత్వ వసతి గృహాలకు పంపుతున్న తల్లిదండ్రులకు ఇటీవల జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విద్యార్థినులు ఉండే హాస్టల్‌లో మహిళా వార్డెన్లే ఉంటే వారి కష్టసుఖాలు, శారీరక రుగ్మతలు తెలుసుకొని తల్లిలా ఆదరిస్తారని భావించినవారికి ఈ వ్యవస్థలో మరి మార్పు రాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వార్డెన్ అంటేనే సంరక్షకులు అని అర్థం. హాస్టల్‌లో విద్యార్థినులు ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఎటు తిరుగుతున్నారన్నవి పరిశీలించాల్సిన వార్డెన్లు కేవలం వసతి గృహాలను కాసులు కురిపించే కేంద్రాలుగానే పరిగణించడం వల్ల హాస్టళ్లు గతి తప్పుతున్నాయి. ఇంటర్మీడియట్ అంటేనే ఎటుకీ చెందని వయసు. ప్రౌఢ దశలోకి అడుగుపెడుతున్న యువతకు వయసు నుంచి వచ్చిన పిలుపులు ఒకవైపు, సమాజంలో మారుతున్న నాగరికత మరోవైపు లాగేస్తున్నప్పుడు మంచీచెడు చెప్పాల్సిన వార్డెన్లు, అధ్యాపకులు వీరిని గాలికొదిలేస్తున్నారు. దాని ఫలితమే ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల కళాశాల హాస్టల్‌లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తప్పులు ఎక్కడైనా జరుగుతాయి. దాన్ని సరిదిద్దుకోడానికి సక్రమ మార్గంలో వెళ్లాల్సినవారే కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నించడమే ఇక్కడ దురదృష్టకరం. వివరాల్లోకి వెళితే..
బీసీ వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థినులకు భద్రత లేదన్న విషయం మరోమారు వెలుగుచూసింది. గత నెల 30న శ్రీకాకుళం మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో ఉన్న బీసీ బాలికల కాలేజీ వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్ధినికి ఒక యువకుడు చావబాది ఆసుపత్రిపాలు చేసిన ఘటన మరువకముందే టెక్కలిలో మరో ఘటన వెలుగు చూసింది. టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న బీసీ బాలికల కాలేజీ వసతి గృహంలో ఉంటున్న ఇంటర్ రెండో ఏడాది విద్యార్ధిని గర్భం దాల్చింది. రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చినా.. బయటకు పొక్కకుండా వార్డెన్ విశ్వప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న నందిగాంకు చెందిన విద్యార్ధిని కడుపులో నొప్పి అని చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులకు కబురు పంపించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి శ్రీకాకుళం రిమ్స్‌కు సిఫార్సు చేశారు. రిమ్స్‌కు వచ్చిన బాలికను వైద్యులు పరీక్షించి గర్భం దాల్చినట్టు నిర్ధారించి స్కానింగ్, మిగతా పరీక్షలు చేయించుకోవాలని చెప్పి ప్రైవేట్ అసుపత్రికి తీసుకుని వెళ్లిపోవాలని బాలిక తల్లిదండ్రులకు సూచించారు. ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాలికను చేర్చారు. అయితే బీసీ సంక్షేమశాఖ అధికారులు, వసతి గృహం వార్డెన్ తమకు సంబంధం లేదని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి వార్డెన్ సదరు బాలిక బీసీ బాలిక వసతి గృహంలో లేదని దబాయించే ప్రయత్నం ప్రారంభించినట్టు తెలిసింది. కలెక్టరేట్ అధికారులకు, స్థానిక రెవెన్యూ అధికారులకు మహిళా వార్డెన్ తప్పుడు సమాచారం ఇచ్చి బాధిత విద్యార్ధిని వసతి గృహంలో ఉండటం లేదని చెప్పినట్టు తెలిసింది. మరోవైపు స్థానిక పోలీసులతో వార్డెన్ మంత్రాంగం నడిపినట్టు తెలిసింది. బాలిక తల్లిదండ్రులకూ డబ్బులు ఆశ చూపించి వ్యవహారం వెలుగులోకి రాకుండా నోరు మూయించినట్టు భోగట్టా. మరోవైపు కూతురు వ్యవహారం వెలుగులోకి వస్తే పరువుపోతుందని విద్యార్థిని తల్లిదండ్రులకు భయపెట్టినట్టు తెలిసింది. వార్డెన్‌తో పాటు, బాలిక తల్లిదండ్రులు, పోలీసులు అంతా ఒకే మాటపై నిలబడి వ్యవహారం గుట్టుగా నడిపినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం వరకు టెక్కలి బీసీ బాలికల కాలేజీ వసతి గృహం విద్యార్ధిని కాదని చెప్పినవారంతా మంగళవారం ఉదయం బీసీ వసతి గృహ విద్యార్థేనని నిర్ధారించి అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు.
ఇటీవల మహిళా డిగ్రీ కాలేజీ ఆవరణలో ఉన్న బీసీ బాలికల కాలేజీ వసతి గృహంలో విద్యార్ధిని ఒక యువకుడు చితకబాది వసతి గృహం పక్కనే చెత్త కుప్పలో పడేసి వెళ్లిపోతే.. దీన్ని ఫిట్స్ వచ్చి పడిపోయిందని అందర్నీ నమ్మించేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులతో పాటు, వార్డెన్ ప్రయత్నించారు. శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఫిట్స్‌తో పడిపోయిందని రిమ్స్‌లో చికిత్స చేయించిన ఘనత బీసీ సంక్షేమశాఖ అధికారులకే దక్కింది. ఇప్పుడూ అదే మాదిరిగా సదరు విద్యార్ధిని ప్రభుత్వ బీసీ బాలికల కాలేజీ వసతి గృహానికి చెందినది కాదని ప్రచారం ప్రారంభించారు. విద్యార్ధిని గర్భం దాల్చినట్టు వెలుగులోకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినా, సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నట్టు తెలిసింది. అయితే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ బీసీ బాలికల కాలేజీ వసతి గృహం విద్యార్థేనని రూఢీ చేస్తున్నారు.
విద్యార్ధిని గర్భం దాల్చినట్టు వసతి గృహంలో తోటి విద్యార్ధులకు తెలిసిన తర్వాత వార్డెన్‌కు సమాచారం ఇచ్చారని తెలిసింది. బాలిక తల్లిదండ్రులకు వార్డెన్ కబురు పంపి వారి కుమార్తెను తీసుకొని వెళ్లిపోవాలని సూచించినట్టు తెలిసింది. వారు అందుకు నిరాకరించడంతో మధ్యేమార్గంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అబార్షన్ చేయించాలని, అందుకయ్యే ఖర్చు భరిస్తానని వార్డెన్ చెప్పినట్టు తెలిసింది. దీంతో వారు బాలిక కడుపునొప్పితో బాధ పడుతుందని చెప్పి తీసుకువెళ్లిన తర్వాత ఐదు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మైనర్ బాలిక కావడంతో అక్కడ నుంచి రిమ్స్‌కు సిఫార్సు చేస్తామని, అక్కడ వైద్యం చేసుకోవాలని సూచించారు. బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు రిమ్స్‌కు వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యులు గత నెల 30న ఇక్కడ ఉమెన్స్ కాలేజీ ఆవరణలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ వైద్యం చేయడం కుదరదని వెళ్లగొట్టారని తెలిసింది. దీంతో మహిళా వార్డెన్ ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి బాలికను చేర్చుకోవాలని కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం బాలికల వసతి గృహంలో ఉందా, ఆసుపత్రిలో ఉందా అన్న విషయంపై బీసీ సంక్షేమశాఖ అధికారులు నోరు విప్పడం లేదు. వసతి గృహంలో జరిగిన సంఘటన విషయం బయటకు తెలియనీయొద్దని వసతి గృహంలో సిబ్బంది, విద్యార్ధులకు వార్డెన్ హుకుం జారీ చేసిందని విశ్వసనీయ సమాచారం.
תגובות