ఒంటరిపోరు సలిపిన ధీశాలి
కుమార్తె మరణం, కొడుకు జైలుపాలు
అయినా వ్యవస్థపై ఆపని యుద్ధం
కొలిక్కి వచ్చిన గార కేసు పునఃవిచారణ
మహిళా దినోత్సవం రోజున ప్రస్తావించుకోవాల్సిన కథనం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

చిక్కుముడుల వెంట పరుగెత్తుతున్నప్పుడు సరళరేఖ సాక్షాత్కరిస్తుంది. కర్రపేడు కూడా ఒకప్పుడు వృక్షమే. దానికో పచ్చటి కల ఉంటుంది. కల ఉన్నప్పుడు దాన్ని నరికేసే గొడ్డలి కూడా ఉంటుంది. దానికి కూడా కర్రే ఆసరా. జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం. టిక్కెట్ అడగరు. ఎక్కడాపేస్తారో తెలియదు. నడిచినంత కాలం నడవాలి. శిఖరం ఉందనుకుంటే లోయ కనిపిస్తుంది. లోయల్లోకి జారిపోతున్నప్పుడు ఎక్కడి నుంచో చేయూత దొరుకుతుంది. ఇప్పుడు చదవబోయే కథనం సారాంశం నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ఇంతే. తమకు అన్యాయం జరిగిందని పోలీసుల వద్దకు వెళితే.. ఆ పోలీసులే నేరం మోపి జైలుకు పంపారు. మీ వద్ద పని చేస్తూ తన కుమార్తె ప్రాణాలు తీసుకుందంటూ బ్యాంకు అధికారులకు మొరపెట్టుకుంటే వారే ప్రాణాలు తోడేశారని తెలుసుకున్న తర్వాత ఆ మహిళ ఏం చేసింది? ఆమె పోరాటం బ్యాంకు చరిత్రలోనే ఎందుకు నిలిచిపోయింది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు ఉరిటి సరళ. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తను భగవంతుడు మధ్యలోనే తీసుకుపోయినా, తన ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేసింది. ఊరిలో ఉన్న పొలం పోరంబోకుగా మారకుండా గ్రామస్తులతో కౌలు చేయించుకుంది. ఒక ఒంటరి మహిళ ఒకవైపు తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం, మరోవైపు పిల్లలను ప్రయోజకులను చేయడం వల్ల మహిళా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న కథనం కాదు ఇది. వ్యవస్థ, రాజ్యం చేతులు కలిపి ఒక కుటుంబాన్ని పాతాళంలోకి తొక్కేసినా.. ధర్మం తమతో ఉంటే మొలకెత్తుతామని నమ్మి పోరాటం చేసిన ఓ ధీశాలి కథే ఇది. ఉద్యోగం చేస్తున్న కుమార్తె ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా తనువు చాలించినా, ఆ సమయంలో అండగా ఉండాల్సిన కుమారుడ్ని ఇక్కడి వ్యవస్థ దొంగగా ముద్రవేసి జైలుకు పంపినా తన కుటుంబం ఏ తప్పు చేయలేదని, తమకు న్యాయం చేయాలంటూ ఉరిటి సరళ చేస్తున్న పోరాటం మరికొందరిలో స్ఫూర్తి నింపుతుందన్న కోణంలోనే ఈ కథనాన్ని అందిస్తున్నాం.
జిల్లాలో గార ఎస్‌బీఐ బ్రాంచిలో జరిగిన తాకట్టు నగల మాయం కేసును జిల్లా ప్రజలకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ బ్రాంచిలో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారాన్ని అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న స్వప్నప్రియే దొంగిలించిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు ఎటువంటి ప్రాథమిక విచారణ చేయకుండా ఆమెను మొదటి ముద్దాయిగా చేర్చడం, స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసులో ప్రైవేటు బ్యాంకుల నుంచి తాకట్టులో ఉన్న ఎస్‌బీఐ బంగారాన్ని పోలీసులు విడిపించారు. వీటిని ఖాతాదారులకు అప్పగించాలంటూ గత నెల 27న కోర్టు ఆదేశాలిచ్చింది. ఎవరైతే తమ బంగారాలు విడిపించుకోవాలనుకుంటున్నారో వారందరికీ వీటిని ఇచ్చేస్తున్నారు. దీంతో గార బ్రాంచిలో తాకట్టు పెట్టిన బంగారం పోయిందని గగ్గోలుపెట్టిన ఖాతాదారులందరూ సేఫ్. ఇక గార ఎస్‌బీఐ లాకర్‌లో ఉండాల్సిన బంగారం జిల్లాలో పలు ప్రైవేటు బ్యాంకుల నుంచి పోలీసులు రికవరీ చేయడంతో ఈ ప్రైవేటు బ్యాంకులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నట్లు భోగట్టా. దీంతో ప్రైవేటు బ్యాంకులూ సేఫ్. కానీ బంగారం పోయిందని అప్పటి ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉరిటి సరళ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది. బంగారం కనపడకుండాపోయిన కేసులో తనను బలిపశువును చేస్తున్నారని, ఇందులో ఆర్‌ఎం దగ్గర్నుంచి అనేకమంది పాత్ర ఉన్నా, తనను ఇరికించాలని చూస్తున్నారన్న భావనతో స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుంది. గార బ్రాంచి నుంచి ప్రైవేటు బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారంలో రూ.కోటి విలువైన తాకట్టు నగలు స్వప్నప్రియ తరఫున విడిపించి ఇస్తే ఎటువంటి కేసూ లేకుండా సెటిల్ చేసుకోవచ్చని అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు ఇచ్చిన సూచన మేరకు స్వప్నప్రియ సోదరుడు కోటి రూపాయలు దొరికిన చోటల్లా అప్పుచేసి అప్పటి ఆర్‌ఎంకు ఇవ్వడం, ఆ మేరకు కొన్ని బంగారు బ్యాగులను విడిపించడంతో ఈ కేసులో ఆయనకు కూడా సంబంధం ఉందంటూ అప్పటి పోలీసులు ప్రాథమికంగా ఎలాంటి విచారణ జరపకుండానే రిమాండ్‌కు పంపారు. ఒకవైపు కూతురు భౌతికంగా లేకపోవడం, కొడుకు రిమాండ్‌లో ఉండటంతో ఉరిటి సరళమ్మకు ఒంటరిపోరాటం తప్పలేదు. ఒకవైపు మీడియాలోను, మరోవైపు సోషల్ మీడియాలోను సరళమ్మ పిల్లలిద్దరూ గార ఎస్‌బీఐ బ్రాంచ్‌ను కొల్లగొట్టేశారని ప్రచారం చేయడంతో బంధువులు, ఆమె సామాజికవర్గం కనీసం ముఖం చూపించడానికి కూడా ముందుకు రాలేదు. మద్దతిస్తే పోలీసులు తమను కూడా లోపలేస్తారేమోనన్న భావనతో మరికొందరు కనపడకుండాపోయారు. చివరకు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్న స్వప్నప్రియ బ్యాంకు సహచరులు కూడా అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని పరామర్శించడానికి కూడా రాలేదంటే అప్పట్లో పరిస్థితులు ఎలా భయపెట్టాయో అర్థం చేసుకోవచ్చు. స్వప్నప్రియ కేసులో అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు ప్రమేయం కూడా ఉందని బయటపడేవరకు కనీసం స్వప్నప్రియ దహన సంస్కార ఖర్చులు కూడా బ్యాంకు నుంచి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఇటువంటి సమయంలో రిమాండ్‌లో ఉన్న కొడుక్కు బెయిల్ పెట్టడం, కేసులో తమ ప్రమేయం లేదని నిరూపించుకోవడం, చనిపోయిన కుమార్తె దినకార్యాలు చేయడం, రిమాండ్‌లో ఉన్న కొడుకు భార్య, బిడ్డకు ధైర్యం చెప్పడం వంటి అష్టావధానమే చేసుకొచ్చింది సరళమ్మ. ఇప్పుడు ఖాతాదారుల బంగారం ఖాతాదారులకు చేరింది. ప్రైవేటు బ్యాంకులు నష్టపోయిన బంగారానికి ఇన్సూరెన్స్ క్లెయిమవుతుంది. అసలు ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ నిత్యం కెమెరా గొట్టాల ముందు కనిపించి నేరం మొత్తాన్ని ఒక్కరి మీదకే నెట్టేసిన గారలో ఉన్న రాజకీయ నాయకుడు ఆ తర్వాత టీడీపీని వీడి వైకాపాకు, ఇప్పుడు వైకాపా నుంచి గుండ వర్గానికి షిప్ట్ అవుతూ తప్పంతా టీఆర్‌ఎం రాజుదేనని మీడియాలో మైలేజ్ తెచ్చుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో నష్టపోయింది ఉరిటి సరళమ్మే. కుమారుడ్ని ఎలా విడిపించుకోవాలో, బెయిల్ కోసం ఎవర్ని సంప్రదించాలో, ఈ కేసు మూలాలు ఎక్కడున్నాయో, అసలు ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్టు అంటే ఏమిటో తెలియని ఒక సాధారణ గృహిణి అప్పట్నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తునే ఉంది. దాని ఫలితమే ఈ కేసులో అనేక కోణాలు, పోలీసుల కుట్రలు, బ్యాంకు అధికారుల చేతివాటాలు బయటపడ్డాయి. గార బ్రాంచిలో తన కుమార్తె ఉద్యోగం చేస్తుంటే, కుమారుడ్ని ఎందుకు జైలుకు పంపారో అర్థంకాని పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ క్షణంలోనైనా అప్పటి సూత్రధారులు, పాత్రధారులు జైలుకు వెళ్లక తప్పదనే స్థాయికి తీసుకువెళ్లిన ఆమె పోరాటపటిమ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పుకోవాల్సిందే. 2024లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే తమ వద్ద ఉన్న ఆధారాలన్నీ పట్టుకొని ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌కు ఉరిటి సరళమ్మ ఫిర్యాదు చేశారు. నేరుగా ప్రజాగ్రీవెన్స్‌లో మాజీ స్పీకర్ ప్రతిభాభారతిని కలిసి ఆధారాలు సమర్పించారు. ఈమేరకు ఈ కేసును పునర్విచారించాలని కావలి ప్రతిభాభారతి హోంమినిస్టర్ వంగలపూడి అనితను కోరారు. దీంతో కొత్త ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి మొత్తం డొంకను కదిలించారు. టౌన్ డీఎస్పీ వివేకానంద విడతల వారీగా ఈ కేసులో ప్రమేయం ఉన్న బ్రాంచి మేనేజర్‌ను, ఆడిటర్లను, సూత్రధారులను, అప్పటి ఆర్‌ఎం రాజుతో పాటు అప్పటి పోలీసు అధికారులను కూడా క్షుణ్ణంగా విచారించారు. చివరకు స్వప్నప్రియ మీద, ఆమె సోదరుడి మీద ఫిర్యాదు చేసిన బ్యాంకు లీగల్ ఆఫీసర్‌ను కూడా తెచ్చి డీఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తాను తయారుచేసింది కాదని, తాను పంపిన డ్రాఫ్టింగ్ ఇదేనంటూ ఈ`మెయిల్‌ను లీగల్ ఆఫీసర్ చూపించడంతో స్థానికంగా దాన్ని మార్చేసి ఎఫ్‌ఐఆర్ కట్టేశారని పోలీసులకు అర్థమైపోయింది. అయితే ఇందులో బంగారం మాయమవడంలో బ్యాంకు అధికారుల పాత్ర ఎంత ఉందో, స్వప్నప్రియ ఆత్మహత్యకు, ఆమె సోదరుడి రిమాండ్‌కు, సరళమ్మ కుటుంబం రోడ్డుపాలవడానికి కారణం అప్పటి పోలీసు అధికారులే. ఈ విషయం కూడా ఇప్పుడున్న ఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్న విచారణలో తేటతెల్లమైపోయింది. అయితే ఒకసారి పోలీసులు పెట్టిన కేసు తప్పని మళ్లీ అదే పోలీసులు చెప్పలేక, ఈ కేసులో పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించిందని నిర్ధారించలేక సతమతమవుతున్నారు. గార ఎస్‌బీఐ బ్రాంచిలో బంగారం మాయమైందని చెప్పడానికి కొద్ది రోజుల ముందు జరిగిన ఆడిట్, అందులో వచ్చిన క్లీన్‌చిట్, స్వప్నప్రియతో పాటు చెస్ట్‌కు జాయింట్ కస్టోడియన్‌గా ఉన్న ముంజు సురేష్ పేరు ఫిర్యాదులో లేకపోవడం, బంగారం మాయం కేసులో బ్యాంకు అంతర్గత విచారణ చేపట్టకపోవడం ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే ఈ కుంభకోణంలో పాత్ర ఉందని ఏడాదిపాటు మరో ఉద్యోగిని మూడో కంటికి తెలియకుండా సస్పెండ్ చేయడం, అదెక్కడా కేస్ డైరీలో పేర్కొనకపోవడం వంటి ఆధారాలు ఓ మామూలు మహిళ సంపాదించి పోరాడటం చిన్న విషయం కాదు. ఇప్పటికే అమరావతిలో ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌లో మూడుసార్లు ఆమె చీఫ్ గ్రీవెన్స్ ఆఫీసర్‌ను కలిసి పునర్విచారణ మందకొడిగా సాగుతుందనుకున్న ప్రతీసారి కదలిక తెచ్చి స్థానికంగా విచారణను మాత్రం పూర్తి చేయించుకోగలిగారు. కాలం గడిచినకొద్దీ పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ప్రభుత్వం మారినట్టే ఆమె సామాజికవర్గంవారు, బంధువులు కూడా ఇప్పుడిప్పుడే సత్యాన్ని గ్రహిస్తున్నారు. రాకపోకలు సాగిస్తున్నారు. అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. బంగారం పోయిన కేసులో బంగారం లాంటి బిడ్డను కోల్పోయిన, ఆత్మస్థైర్యాన్ని కోల్పోని ఉరిటి సరళమ్మ కోల్పోయిన కూతుర్ని ఇప్పుడెవరిస్తారు? ఆమె కుమారుడు ఈ కేసులో సూత్రధారి అని పడిన నిందను ఎవరు మాపుతారు? ఆయన అనుభవించిన జైలుజీవితానికి ఎవరు పరిహారం చెల్లిస్తారు?
లోకంలో విజేతల కథలను విరివిగా వినడం ద్వారా ఉత్తేజం కలిగితే అది స్వీయ ప్రేరణకు దారితీస్తుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకు ఆయుర్ధాయం తక్కువ.. అనే అవగాహన ఉంటే బుద్ధి మేలుకుంటుంది. ఇందులో మొదటిది తల్లి కథ అయితే, రెండవది ఆమె కుమార్తె వ్యథ. ఏది ఏమైనా మనిషి నిరాశ లోంచి తేరుకుంటాడు.
留言