top of page

కన్ను పోయిందా.. సెటిల్మెంట్‌ చేస్కో!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

రణస్థలం మండలం పైడిభీమవరం జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సిహెచ్‌ అరుణ్‌కుమారుకు క్లాస్‌ టీచర్‌ కుమార్‌ కొట్టడం వల్ల ఒక కన్ను కోల్పోయాడు. అయ్యా మీరు కొట్టిన దెబ్బలకు నా కుమారుడు కుడికన్ను తొలగించాల్సి వచ్చిందని తల్లిదండ్రులు బోరుమంటే పాఠశాలలో పట్టించుకొనే నాధుడే లేడు. ఈ నెల 7న జెఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. డీఈవో తిరుమల చైతన్యను ఆశ్రయిస్తే సెటిల్‌ చేసుకుందాం రండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ఉన్నతాధికారులను గ్రీవెన్స్‌లో కలిసి ఫిర్యాదు చేస్తే విద్యాశాఖ అధికారుల నుంచి నివేదిక కోరి చర్యలు తీసుకుంటామని చెప్పి మూడు వారాలు గడిచింది. ఈ ఘటనపై డీఈవో తిరుమల చైతన్య, డిప్యూటీ డీఈవో విజయకుమారి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించే విధంగా నివేదిక ఇచ్చారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్ల కంటికి గాయం కాలేదని, విద్యార్ధులను క్యూలైన్‌లో ఉండాలని వారించే క్రమంలో కంటికి గాయమైనట్టు నివేదిక ఇచ్చారని తెలిసింది. దీనిపై సోమవారం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ను గీవెన్స్‌లో కలిసి తమ కుమారుడికి న్యాయం చేయాలని విన్నవించారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీ వద్ద నిరసన తెలిపారు.


వివరాల్లోకి వెళితే.. ఈ నెల ఒకటిన సాయంత్రం తరగతి గదిలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా క్యూలో విద్యార్ధులు ఒకిరిని ఒకరు నెట్టుకున్నారు. దీన్ని గమనించిన ఉపాధ్యాయుడు అరుణ్‌కుమార్‌ విద్యార్ధులందరినీ కర్రతో దండిరచాడు. ఆ సమయంలో విద్యార్థి కుమార్‌ కంటిలో కర్ర గుచ్చుకొని రక్తం కారసాగింది. విద్యార్ధి ఏడుస్తునే నేలకొరిగిపోయాడు. అక్కడి నుంచి ఉపాధ్యాయుడు అరుణ్‌కుమార్‌ మెల్లగా జారుకొని హెచ్‌ఎం ఛాంబర్‌కు వెళ్లిపోయాడు. కంటి నుంచి రక్తం కారుతుండడంతో పీడీ రాము విద్యార్ధిని సమీపంలో ఉన్న మూర్తిరాజు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. విషయం తెలిసిన విద్యార్ధి తండ్రి నాగరాజు అక్కడకు చేరుకున్నాడు. కర్రతో కొట్టిన అరుణ్‌కుమార్‌, హెచ్‌ఎం శోభారాణి కంటికి ఏమీ కాలేదంటూ వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి కారులో వెళ్లిపోయారు. తర్వాత రోజు బాధిత విద్యార్ధిని విజయనగరంలోని కంటి ఆస్పత్రికి తీసుకునివెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి తక్షణం ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలని రిఫర్‌ చేశారు. విశాఖలోని ఎల్‌వీ కంటి ఆసుపత్రిని సంప్రదించిన తర్వాత పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేసి కంటిలో ఉన్న కర్రపుల్లను బయటకు తీశారు. అయితే కంటిలో కర్రపుల్ల ఉండడంతో కన్ను చీము పట్టి 90 శాతం కంటి చూపు కోల్పోయినట్టు ఎల్‌వీ ప్రసాద్‌ వైద్యులు నిర్ధారించినట్టు విద్యార్ధి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమకు నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని బాధితులు విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే రాజీకి పిలుస్తున్నారు. ఇప్పటి వరకు అసలు తాము కొట్టలేదని, కొట్టడం వల్ల కంటికి దెబ్బ తగలలేదని చెప్పిన విద్యాశాఖ అధికారులు సెటిల్మెంట్‌కు రావాలని ఎలా పిలస్తున్నారని విద్యార్ధి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని, అన్ని వ్యవస్థలను విద్యాశాఖ అధికారులే మేనేజ్‌ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యార్థికి జరిగిన అన్యాయంపై బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page