top of page

కనీసం సిగ్గుపడండి..!

Writer: DV RAMANADV RAMANA

పూర్వ కాలంలో మన దేశంలో చాలా దురాచారాలు జరుగుతుండేవి. ఎక్కడైనా ఓ పదిమంది చనిపోగానే, అది కొన్ని రోజులపాటు మీడియాకు ఏకైక న్యూస్‌, ఫ్లాష్‌ న్యూస్‌ అయ్యేది. మీడియా ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేది. రాజకీయ విశ్లేషకులు దానిని ప్రభుత్వ వైఫల్యంగా డిక్లేర్‌ చేసేవారు. ప్రభుత్వ డై-హార్డ్‌ ఫ్యాన్స్‌కి ఇదంతా నచ్చకున్నా, ‘ఈ విషాద సమయంలో ప్రభు త్వాన్ని వెనకేసుకురావడం ఎందుకులెమ్మని’ - సైలెంట్‌గా ఉండేవారు. ఫలితంగా, ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చి సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆ శాఖామంత్రి రాజీనామా చేయడం లాంటివి జరిగేవి. ప్రభుత్వ పెద్దలు, ఆ బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చడం, గాయపడ్డవారిని ఆస్పత్రి లో కలిసి మెరుగైన వైద్యసేవలు చేయిస్తామని హామీ ఇవ్వడం లాంటివి జరుగుతుండేవి. ఇప్పుడు దేశంలో అమృత ఘడియలు మొదలవడంతో, ఆ దురాచారాలు సమసిపోయాయి. ఏటీఎం క్యూలైన్ల లో కుప్పకూలి సచ్చిపోయినా, వందల కిలోమీటర్లు రోడ్లపై నడుస్తూ రాలిపోయినా, పట్టాల వెంట నడిచి, నడిచి, రైలు చక్రాల కింద నలిగిపోయినా, వంతెనలు కూలిపోయి నీటిలో మునిగిపోయినా, ఆక్సిజన్‌ కోసం అలమటిస్తూ అసువులుబాసినా, తొక్కిసలాటల్లో విగతజీవులుగా మిగిలినా, ఇప్పుడు మీడియాకు అదేమంత పెద్ద విషయం కాదు. ‘ప్రభుత్వానికేం సంబంధం, ప్రాణాలు పోతాయనే ధ్యాస జనాలకు లేకుంటే, ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది’ - అని కొందరు లౌడ్‌స్పీకర్లు పెట్టి అరుస్తు న్నారు. సంజాయిషీలు, రాజీనామాలు లేవు. దీనిగురించి రాజకీయాలు చేయకూడదు అని తటస్థ విశ్లేషకులు సుద్దులు చెప్తున్నారు. ఎంతైనా మంది పెజాసోమ్యం, పెజలకు ఏం కావాలో అది చేయ డమే ప్రబుత్వం బాధ్యత కదా. ఏటీఎంల ముందు నించోబెట్టి చంపేస్తారు. కోవిడ్‌ వైరస్‌కి ఎరేసి చంపేస్తారు.. కుంభమేళాలకి పిలిచి చంపేస్తారు. మూర్ఖులో, అమాయకులో కానీ, ఈ జనం నిర్లజ్జగా సచ్చిపోతూనే వుంటారు, ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారో ఏమో కొట్టుకుపోతున్న శవాల మధ్య మునుగుతో దానిని పుణ్యస్నానం అనగల సత్తా మనకే వుంది. రైలు ప్రమాదం జరిగిన ఘటనకు లాల్‌బహదూర్‌ శాస్త్రి రాజీనామా చేశారని చదువుకున్నాం. అటువంటి నేతలను ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా చూడలేం. రద్దీ నియంత్రణలో యంత్రాంగం వైఫల్యం, రైళ్లు రావడంలో జరిగిన జాప్యం, వాటి పేర్లు సృష్టించిన గందరగోళం అన్నీ కలగలిపి మహాకుంభమేళా యాత్రికులను పొట్టన పెట్టుకున్నాయి. భారతీయ రైల్వే సేవల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన వ్యవస్థాగత లోపాలను పట్టి చూపించాయి. మొన్న జరిగిన ప్రమాదం కూడా అటువంటిదే. హైదరాబాద్‌లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైళ్లు ఒకే సమయంలో ఒకే స్టేషన్‌లో ఆగుతాయి. సరిగ్గా ఇటువంటి ప్రమాదమే మొన్న ఢల్లీిలో కుంభమేళా యాత్రీకులకు ఎదురైంది. 1989లో న్యూఢల్లీి రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట మొదలైంది. అందులో నలుగురు చనిపోయారు. 2004లో ఛాత్‌ పండగ కోసం మరోసారి న్యూఢల్లీి స్టేషన్‌ కిక్కిరిసింది. అందులో ఐదుగురు చనిపోయారు. వాస్తవానికి ఇటువంటి సందర్భాల్లో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపాల్సివుంది. అలాగే మౌలిక వసతులు, భద్రతా చర్యలు పెంచాల్సివుంది. కోట్లాది మంది వచ్చే కుంభమేళాకు నది ఒడ్డున ఏర్పాట్లు చేస్తేమాత్రమే సరిపోదు కదా..! 2010లో ఇదే న్యూఢల్లీి రైల్వేస్టేషన్‌లో మరో ప్రాణాంతక తొక్కిసలాట జరిగింది. 2007లో ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌ సరాయ్‌ స్టేషన్‌ తొక్కిసలాటలో 15 మంది పోతే, 2013 కుంభమేళా సందర్భంగా ప్రయోగరాజ్‌ స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 37 మంది మరణించారు. ఇవన్నీ రైల్వే మరణాలే. ఇవి కాకుండా రైల్వే ట్రాక్‌ మీదే ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనడం, ప్రాణాలు పోవడం ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ప్రతీదాన్ని విద్రోహ కోణంలో చూడటం మానుకుంటే తప్ప నాణ్యమైన ప్రమా ణాలను అందించలేం. ఇప్పటికీ కాలం చెల్లిన ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ సమస్యలు, కవచ్‌ ప్రాజెక్ట్‌ పూర్తి కాకపోవడం వంటివి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రైల్వేలు సేవ అనే భావం నుంచి వ్యాపారం అనే కోణంలోకి మారిన తర్వాతనైనా తొక్కిసలాట, ఇతర ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీసీ టీవీలతో పాటు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ బలగాలను అన్ని స్టేషన్లలో ఎక్కువగా మోహరిస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. కనీసం ఆ పని చేసినా ఢల్లీి రైల్వేస్టేషన్‌లో ఈ మృత్యుఘోష ఉండేదికాదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page