top of page

కప్పం కట్టేద్దాం.. కండువా మార్చేద్దాం!

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • `అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న రాజకీయ బేహారులు

  • `ఆక్రమిత ఆస్తులు కాపాడుకునేందుకు వైకాపా నేతల పక్కచూపులు

  • `టీడీపీలో అవకాశం లేక జనసేనతో మంతనాలు

  • `ఎదురు డబ్బులిచ్చి ఆ పార్టీలో చేరేందుకు యత్నాలు

  • `ఇందుకు రూ.30 లక్షలు సిద్ధం చేసిన కొందరు కౌన్సిలర్లు


రాజకీయాలు ఎందుకు చేస్తారు? అనే ప్రశ్న ఏదైనా ఇంటర్వ్యూలో ఎదురైతే.. ఠక్కున ‘ప్రజాసేవ కోసం’ అని చెప్తే.. యు ఆర్‌ నాట్‌ సెలెక్టెడ్‌ అని బోర్డు సభ్యులు తిరస్కరించే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచాక కోట్లు రాబట్టుకునే వ్యాపారంగా రాజకీయాన్ని చూస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. అధికారంలో ఉంటేనే రాజకీయ వ్యాపారం జరుగుతుంది. అటువంటి వ్యాపారస్తుడి వద్దే బెల్లం ఉంటుంది.. అతని చుట్టూనే ఈగలు ముసురుతుంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రధాన వ్యాపారం ప్రభుత్వ భూములను తెగనమ్మడమే. ఏ ప్రయోజనాలను కాపాడతామని ప్రమాణం చేస్తారో సరిగ్గా వాటినే అమ్మడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి మెట్రో సిటీల్లో లేని ధరలు పలాస`కాశీబుగ్గ భూములకు ఉండటంతో రాజకీయ నాయకుడి చుట్టూ చేరే ఈగలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాజకీయాలు చేస్తున్న పలాస నియోజకవర్గ నాయకులందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే కావడంతో భూవివాదాలకు అంతులేకుండా పోయింది. తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చెంతకు చేరిపోవడం వీరికి ఆనవాయితీ. ఇప్పుడు అదే జరుగుతోంది. పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కొందరు వైకాపా కౌన్సిలర్లు జనసేన వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికోసం కొందరు కౌన్సిలర్లు కలిసి రూ.30 లక్షలు ఎదురివ్వడానికి ఒప్పందం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. నేరుగా టీడీపీలోకి కాకుండా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో చేరితే స్వామికార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతాయన్న ఆలోచనతో రూ.30 లక్షల కప్పం చెల్లించడానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారని పట్టణంలో చర్చ జరుగుతోంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీని టీడీపీ అభ్యర్ధులు చెమటలు పట్టించారు. ఫలితంగా కొన్ని స్థానాల్లో వైకాపా అభ్యర్ధులు బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కారు. దీన్ని ఎన్డీయే నాయకులు ప్రస్తుతం గుర్తు చేస్తున్నారు.

తెరుచుకోని టీడీపీ గేట్లు

సీదిరి అప్పలరాజు మంత్రి అయిన తర్వాత పలువురు వైకాపా కౌన్సిలర్లు ప్రభుత్వ భూములను అక్రమించేశారు. తమ ప్రభుత్వం ఉండటంతో టీడీపీ తరఫున పని చేసినవారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో తమ భూముల వ్యవహారం బయటకొస్తుందని వీరంతా భయపడుతున్నారు. అయితే టీడీపీలో వారికి గేట్లు తెరవకపోవడంతో జనసేన ద్వారా అధికారం ముసుగు కప్పుకోవాలని చూస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జెండా మోసినవారు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పలరాజు చెంత చేరి రెండు చేతులా సంపాదించారు. ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి డబ్బులు ఎదురిచ్చి మరీ పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలన్నింటినీ ఏకగ్రీవంగా చేజిక్కించుకోవడంలో సఫలీకృతమైంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా స్థానిక సంస్థల ఎన్నికలకు మరో రెండేళ్ల వ్యవధి ఉండటంతో అంతవరకు ఆగకుండా వైకాపా పాలకవర్గాలను దించేయాలని తెలుగుదేశం యోచిస్తోంది. ఇది జరగాలంటే తమ పార్టీ కౌన్సిలర్లకు అదనంగా మరికొందరి మద్దతు అవసరం. అలాగే ఎన్నికైన నాలుగేళ్ల వరకు పాలకవర్గాలపై అభిసంశన, అవిశ్వాస తీర్మానాలు పెట్టకూడదంటూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఆ జీవో రద్దయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు వైకాపా అధికారంలో ఉన్న స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో పలాస లాంటి మున్సిపాలిటీల్లో సిటింగ్‌ కౌన్సిలర్లు వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడితే పార్టీలో చేర్చుకోడానికి అధికార కూటమి భాగస్వామ్య పార్టీలు సై అంటున్నాయి. అధికారంలో లేని ఐదేళ్లు తనను, టీడీపీ కార్యకర్తలను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించిన బ్యాచ్‌ను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడానికి పలాస ఎమ్మెల్యే శిరీష ఇష్టపడటంలేదు. దాంతో పలువురు వైకాపా కౌన్సిలర్లు జనసేన వైపు చూస్తున్నారు.

ఎక్కడికక్కడ రెడ్‌బుక్‌ రాజ్యాంగం

మరోవైపు భూ లావాదేవీలతో సంబంధం లేని వైకాపా నేతలు గత ప్రభుత్వ హయాంలో చిన్నాచితకా కాంట్రాక్టులు చేశారు. కానీ వీరికి పూర్తిస్థాయిలో బిల్లులు అందలేదు. ఇప్పుడు అదే పార్టీలో కొనసాగితే అందుతాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే 2014`19 మధ్య పనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లు ఇబ్బంది పెట్టింది. ఇప్పుడూ టీడీపీ ప్రభుత్వం కూడా అదే రీతిలో వ్యవహరించడం ఖాయం. దాంతో బిల్లులు రాబట్టుకోవాలంటే పార్టీ మారాల్సిన అగత్యం ఏర్పడిరది. రాష్ట్ర స్థాయిలో లోకేష్‌ రెడ్‌బుక్‌ రాసినట్లే జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు కూడా తమ స్థాయిలో చిట్టాలు తయారుచేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు పార్టీ మారడం తప్ప వీరికి మరో గత్యంతరం కనిపించడంలేదు. ఈమేరకు జనసేన అగ్రనాయకులతో చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. అవిశ్వాసానికి సంబంధించిన నిబంధనలు మారితే ఒక్క పలాసలోనే కాకుండా ఇచ్ఛాపురం మున్సిపాలిటీతో పాటు పలు మండల పరిషత్తుల్లో కూడా అధికారం మారిపోనుంది. ఈమేరకు సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ హోంవర్క్‌ చేస్తున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ప్రస్తుత చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మిపై వైకాపా కౌన్సిలర్లు ఎప్పటినుంచో అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో పలువురు వైకాపా కౌన్సిలర్లు జనసేనలో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. వైకాపాలోని మెజార్టీ జెడ్పీటీసీలంతా టీడీపీలో చేరడానికి.. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారు. దానికి అనుగుణంగా ఇప్పట్నుంచే వైకాపాకు దూరం జరుగుతున్నారు.

మండలాల్లోనూ అధికార మార్పు!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఘనంగా జరపాలని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కొన్ని మండలాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొన్నా మరికొన్నిచోట్ల ముఖం చాటేశారు. తద్వారా పార్టీ మార్పు తప్పదన్న సంకేతాలు పంపించారని చర్చ జరుగుతోంది. ముందుగా పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని జనసేన నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది జనసేన నాయకులతో టచ్‌లో ఉన్నారు. పలాస, టెక్కలి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో వైకాపా పాలకవర్గాలు అవిశ్వాసం ఎదుర్కోక తప్పదన్న సంకేతాలను టీడీపీ నాయకులు ఇప్పటికే పంపించారు. ఎందుకంటే.. గత ప్రభుత్వ హయాంలో పలాసలో సీదిరి అప్పలరాజు, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ టీడీపీ శ్రేణులను పార్టీ మారేవరకు వేధించారు. వీటితో పాటు శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, లావేరు, ఆమదాలవలస, పొందూరు, హిరమండలం, కొత్తూరు, మెళియాపుట్టి, కంచిలి, సొంపేట, ఇచ్ఛాపురం, సారవకోట, నరసన్నపేట మండలాల్లో అధికారం చేజిక్కించుకోడానికి కసరత్తు చేస్తోంది. అయితే కొందరు సీనియర్‌ వైకాపా నాయకులు మాత్రం బీజేపీ వైపు అడుగులు వేయడానికి సిద్ధపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నాయకులు జనసేన, బీజేపీలోకి వెళ్లడానికి 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉండడం ప్రధాన కారణంగా చెబుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page