top of page

కబళిస్తున్న కాలుష్యం

Writer: DV RAMANADV RAMANA



భారతదేశం క్రమంగా కాలుష్య కాసారంగా మారుతున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్విస్‌ ఎయిర్‌ టెక్నాలజీకి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ ‘ఐక్యూ ఎయిర్‌’ తాజాగా విడుదల చేసిన ‘ది వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌-2024’ ప్రకారం ప్రపంచంలోని ఇరవై అత్యంత కాలుష్య నగరాల్లో పదమూడు మన దేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా ఢల్లీి కొనసాగుతూనే ఉంది. మరోవైపు అసోం-మేఘాలయ సరిహద్దుల్లోని బైర్నిహట్‌ పట్టణం వాయు కాలుష్యంలో ఢల్లీిని మించిపోయి, అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో నిలవడం మరింత ఆందోళనకరం. మేఘాలయకు చెందిన ఈ చిన్న పట్టణంలో అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా పరిశ్రమలు ఏర్పాటు చేయడమే ఈ పరిస్థితికి కారణం. తాజా నివేదిక ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, బహమాస్‌, బార్బడోస్‌, గ్రెనడా, ఎస్టోనియా, ఐస్‌లాండ్‌ దేశాలు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వాయు కాలుష్యాన్ని నియంత్రించగలిగాయి. భారత్‌ 2023తో పోలిస్తే అత్యధిక కాలుష్య ర్యాంకుల్లో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరి కొంత మెరుగైన ఫలితాలు సాధించినట్టు నివేదిక పేర్కొంది. పి.ఎం 2.5 స్థాయిని ఏడు శాతానికి తగ్గించగలిగినట్లు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల సరసన డేంజర్‌ జోన్‌లోనే ఇప్పటికీ కొనసాగుతుండటం, దేశంలో కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతుండటం పొంచి ఉన్న ముప్పునకు నిదర్శనం. కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢల్లీి ప్రజానీకం తమ జీవిత కాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారంటూ చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ 2023లోనే హెచ్చరించింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు మించిన కాలుష్యంలో దేశంలోని మెజారిటీ జనాభా మగ్గిపోతోంది. ప్రతి క్యూబిక్‌ మీటర్‌కు నలభై మైక్రో గ్రాముల కాలుష్యానికి అనుమతి ఇస్తూ మన దేశం రూపొందించుకున్న సొంత నాణ్యత ప్రమాణాలు సైతం ఏ స్థాయిలోనూ అమలు కావడం లేదు. జాతీయ పరిమితి కన్నా అధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశంలోని 67.4 శాతం జనాభా జీవనం సాగిస్తోంది. 2023లోనే విడుదలైన ‘ది లాన్‌సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ నివేదిక ప్రకారం మన దేశంలోని మహానగరాలన్నీ వాయు కాలుష్యంతో అతలాకుతలమవుతున్నాయి. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం ద్వారా దేశం మొత్తం మీద ప్రజానీకం సగటున 5.2 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతున్నారు. మరోవైపు వాయు కాలుష్య సంబంధిత రోగాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 15 లక్షల మంది మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న అంశాల్లో వాయు కాలుష్యం ఐదో స్థానంలో నిలుస్తోంది. ఈ కారణంగానే ఢల్లీిలో 50 శాతం మంది చిన్నారుల ఊపిరితిత్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే 2019 నవంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం ‘నరకానికన్నా అధ్వానంగా ఢల్లీి నగరం తయారైంది’ అని వ్యాఖ్యానించింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరుణ్‌ మిశ్రా ‘పేలుడు పదార్ధాలు అమర్చి ప్రతి ఒక్కరినీ చంపేయడం మంచిది.’ అని అన్నారంటే అప్పటికే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. అయినా పాలకుల్లో స్పందన లోపించడంతో ఆ దుస్థితి దేశమంతటికీ విస్తరిస్తోంది. వాయు కాలుష్యానికి, వాతావరణ మార్పులకు దగ్గర సంబంధం ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ల పేరుతో కార్పొరేట్లకు ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు దేశవ్యాప్త వాయు కాలుష్యంలో యాభై ఒక్క శాతానికి పరిశ్రమలు వెదజల్లే విష వాయువులే కారణమని తేలినా దాని నియంత్రణకు, కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా స్పందన శూన్యం. కార్పొరేట్ల లాభాల కోసం సామాన్యుల ప్రాణాలను ఫణంగా పెట్టే ఈ తరహా విధానాలను ప్రభుత్వాలు ఇప్పటికైనా విడనాడాలి. తక్షణం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలి. అడవులను పరిరక్షించడంతో పాటు, వీలైన అన్ని ప్రాంతాల్లోనూ చెట్లను పెంచాలి. ఇటువంటి చర్యలే కాలుష్య కోరల నుండి ప్రజానీకాన్ని కాపాడుతాయి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page