కమలం యూజ్ అండ్ త్రో రాజకీయం!
- DV RAMANA

- 3 days ago
- 3 min read

లోకరీతి మారిపోతున్నది. న్యాయంగా చూస్తే.. ఎదుగుదలకు సహకరించినవారిని గౌరవించాలి.. వీలయితే మనతో సమానంగా చూడాలి. కానీ సమకాలీన రాజకీయాల్లో ఆ నీతి.. రీతి లుప్తమైపోయాయి. చేయి అందించి పైకి తీసుకొచ్చినవారినే కిందకి లాగేసే అడ్డగోలు రాజకీయమే ఇప్పుడు వర్థిల్లుతున్నది. అవసరం ఉన్నంతవరకు రాజకీయ మిత్రులంటూ తెగ వాడేసుకోవడం.. మన అవసరం తీరాక, ఇక మిత్రుడితో పనిలేదని తేలిపోయాక.. వదిలించుకోవడం నేటి రాజకీయ విజయసూత్రంగా మారింది. ప్రస్తుతం దేశంలో ఒక్కో రాష్ట్రాన్ని ఎన్నికల ద్వారా చేజిక్కించుకుంటూ వస్తున్న కమలనాథులు ఇదే రాజనీతితో అప్రతిహత విజయాలు సాధిస్తున్నారని.. వారి ఎదుగుదల క్రమం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి కమలం వికసించడం, అధికార పగ్గాలు చేపట్టనుండటం బీజేపీవారి ‘యూజ్ అండ్ త్రో’ సిద్ధాంతానికి తాజా ఉదాహరణ. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. వాస్తవానికి 2011కు ముందు.. అంటే 15 ఏళ్ల కిందట ఇదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మిత్రపక్షం ఉండేదని ఎంతమందికి తెలుసు. అప్పట్లో తన రాజకీయ ఉనికి కోసం పక్క పార్టీలపై ఆధారపడే స్థితిలో ఉన్న బీజేపీ ఇప్పుడు మహా వృక్షమైపోయింది. ఆ మహావృక్షంలో నీడలో దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలు నీరసించిపోయి ఓటమిబాట పడుతున్నాయి. తనకు అసవరం ఉన్నంత కాలం రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేసే బీజేపీ చిన్న అవకాశం లభిస్తే చాలు.. అండగా నిలుస్తున్న పార్టీనే పాతాళానికి తొక్కేసి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. పశ్చిమ బెంగాల్లో అదే జరిగింది. ఒకప్పుడు మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమల్ కాంగ్రెస్, బీజేపీ మంచి మిత్రపక్షాలుగా ఉండేవి. కేంద్రంలో అధికారం కూడా పంచుకున్నాయి. నాటి ఎన్డీయే ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా కూడా పనిచేశారు. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్లో రెండు పార్టీలు కలిసి దశాబ్దాల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడేశారు. మమతా బెనర్జీ అధికార పగ్గాలు అందుకున్నారు. తర్వాత కాలంలో బెంగాల్‌లో అధికారంపై బీజేపీ కన్ను వేసింది. అంతే అంతవరకు మైత్రి కొనసాగించిన మమత ప్రభుత్వాన్నే వ్యతిరేకించడం ప్రారంభించారు. తృణమÖల్ పార్టీలోనూ, ప్రభుత్వంలో మమత తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న సువేందు అధికారిని సీఎం పీఠం ఆశచూపి తమలో కలుపుకున్నారు. అతన్నే ముందుపెట్టి 2021 ఎన్నికల్లోనే మమతను టార్గెట్ చేసినా సీట్లు పెంచుకోగలిగారు తప్ప సింహాసనం దక్కించుకోలేకపోయారు. అయితే పట్టువదలని విక్రమార్కులా ఐదేళ్లూ మమత సర్కారును టార్గెట్ చేసి చివరికి విజయం సాధించారు. అంతకుముందు మహారాష్ట్రలోనూ ఇలాగే జరిగింది. ఒకప్పుడు బీజేపీకి మహారాష్ట్రలో పెద్దగా ప్రాతినిధ్యం లేదు. దాంతో రాష్ట్రంలో బలంగా వేళ్లూనుకున్న శివసేనతో చెలిమి చేసి నెమ్మదిగా పుంజుకుంది. తమ హిందూత్వ అజెండాకు కమలనాథులు దన్నుగా ఉంటారనుకుని స్నేహహస్తం అందించిన శివసేన తమ పాలిట దృతరాష్ట్ర కౌగిలిలా మారి పార్టీని చీలికలు పేలికలు చేస్తుందని ఊహించలేకపోయింది. కాలం మారుతున్న కొద్దీ బీజేపీ పెరిగి పెద్దదైంది. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. తొలినాళ్లలో ఉప ముఖ్యమంత్రి పదవిని, కొన్ని మంత్రి పదవులను దక్కించుకుంది. కానీ ఆ తర్వాత తనకు అండనిచ్చిన శివసేనలో చీలికను ప్రోత్సహించి ఏక్‌నాథ్ షిండే వర్గాన్ని వేరు చేసి ఆ వర్గంతోనే బీజేపీ అధినాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేయించారు. చివరికి తమను నమ్మి బయటకు వచ్చిన ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి దించేసి తామే పాలనపగ్గాలు చేపట్టారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఇదే రాజకీయ వ్యూహాన్ని అనుసరించి ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్నది. ఈశాన్య భారతంలో కీలకమైన అసోం రాష్ట్రంలో అసోం గణ పరిషత్ నాయకులను మచ్చిక చేసుకుని తన వైపు తిప్పుకొన్న కాషాయ పార్టీ ఇప్పుడు ఆ పార్టీని పక్కనపెట్టి తానే పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఇక దక్షిణాదిలోని తమిళనాడులో ఇలాంటి వ్యూహంతోనే నాడు జయలలిత మరణాంతరం బీజేపీలో అన్నాడీఎంకే విలీనానికి ప్రతిపాదించారు. కానీ ఆపార్టీ ఒప్పుకోకపోవడంతోనే శశికళను జైలుకు పంపించారన్న వాదన ఉంది. ఇప్పుడు అన్నాడీఎంకే చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేసినా ఆ కూటమి మÖడో స్థానంతోనే ఆగిపోయింది. బీహార్‌లోనూ ఇన్నాళ్లూ జేడీయÖ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పల్లకీ మోసిన కమలనాథులు.. మొన్నటి ఎన్నికల విజయం తర్వాత ఆయన్ను దించేసి తమ పార్టీ నేతను కుర్చీలో కూర్చోబెట్టారు. ప్రస్తుతానికి జేడీయÖతో కూటమిగా ఉన్నా.. భవిష్యత్తులో ఆ పార్టీని పక్కన పెట్టేసినా ఆశ్చర్యం లేదు. ఇక మన పక్కనే ఉన్న ఒడిశాలోనూ అదే మంత్రాంగం నెరిపారు. ఒకనాడు రాష్ట్రంలో పట్టుకోసం బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్‌తో జట్టు కట్టిన కమలనాధులు తొలినాళ్లలో ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా కూడా ఉన్నారు. కానీ చివరికొచ్చేసరికి రెండేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో అదే నవీన్ పార్టీకి ప్రత్యర్థిగా మారడమే కాకుండా అప్రతిహతంగా సాగుతున్న బీజేడీ ప్రభుత్వానికి ఇంటికి సాగనంపి అధికారం కైవసం చేసుకున్నారు. అదే వరుసలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో కలసి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్నది. వాస్తవానికి ఏపీలో బీజేపీకి ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేదు. కానీ టీడీపీతో చెలిమి చేసి 2024లో సుమారు పదిశాతం ఓట్లతోపాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల బలం సంపాదించింది. ఈ పార్టీల చెలిమి ఎంత ఎక్కువ కాలం కొనసాగితే బీజేపీ ఎక్కువగా వ్యూహాలను అమలు చేయగలుగుతందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది.






Comments