top of page

‘కమిటీ కుర్రాళ్ళు’ మూవీ రివ్యూ

Writer: ADMINADMIN

కథానాయికగా అదృష్టాన్ని పరీక్షించుకున్న మెగా ఫ్యామిలీ అమ్మాయి నిహారిక కొణిదెల ఇప్పుడు నిర్మాతగా మారి తీసిన సినిమా.. కమిటీ కుర్రాళ్ళు. కొత్త దర్శకుడు యదు వంశీ రూపొందించిన ఈ చిత్రం.. ఆహ్లాదకరమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: గోదావరి ప్రాంతంలోని పురుషోత్తమపల్లి అనే ఊరిలో చిన్నప్పట్నుంచి ఏ తారతమ్యాలు లేకుండా సంతోషంగా పెరిగిన పిల్లలంతా కలిసి పెద్దోళ్లవుతారు. యుక్త వయసు వచ్చాక కూడా ఆడుతూ పాడుతూ వారి జీవితం సాగిపోతుంటుంది. ఐతే ఈ బృందంలో ఓ కుర్రాడు ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించినప్పటికీ.. రిజర్వేషన్‌ లేకపోవడం వల్ల యూనివర్శిటీలో ఫ్రీ సీట్‌ రాదు. ఈ విషయమై మిత్రుల మధ్య మొదలైన ఒక చర్చ.. పెద్ద గొడవగా మారుతుంది. దీంతో అన్నేళ్లు సంతోషంగా సాగిపోయిన కుర్రాళ్ల మధ్య కులం గొడవ మొదలై రెండు వర్గాలుగా విడిపోతారు. ఆ ఊరి జాతర సందర్భంగా గొడవ ఇంకా ముదిరి తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ జాతరలో ఏం జరిగింది.. ఆ తర్వాత ఆ కుర్రాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి.. చివరికి మిత్ర బృందం అంతా ఒక్కటైందా లేదా.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘‘ఆ రోజులే వేరు’’.. తమ చిన్ననాటి రోజుల్ని.. అలాగే యుక్త వయసులో అనుభవాలను గుర్తు చేసుకుని ఇలా అనుకోని వ్యక్తులు అరుదు. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే.. స్వచ్ఛంగా చేసిన స్నేహాలు.. స్వేచ్ఛగా తిరిగిన రోజులు గుర్తు చేసుకుంటే ఎవ్వరికైనా నోస్టాల్జిక్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. భావోద్వేగాలు తన్నుకొస్తాయి. సినిమాలకు కూడా ఇదొక మంచి సెల్లింగ్‌ పాయింట్‌. ముఖ్యంగా యవ్వనంలో స్నేహితులతో కలిసి పంచుకున్న ముచ్చట్లు.. వేసిన చిలిపి వేషాలు.. అల్లరి చిల్లరి పనులు.. గొడవల్ని గుర్తు చేస్తూ ఓ కథను అందంగా తెరపై ప్రెజెంట్‌ చేస్తే ఎంత మంచి ఫలితం వస్తుందో ‘హ్యాపీ డేస్‌’ సహా ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. ఇప్పుడు ‘కమిటీ కుర్రాళ్ళు’ కూడా ఇదే బాటలో సాగింది. కాకపోతే ఇందులో మనం చూసేది కుర్రాళ్ల కాలేజీ జీవితాన్ని కాదు. ఒక సగటు పల్లెటూరిలో నడిచే సోషల్‌- పొలిటికల్‌ స్టోరీ. ఓ 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి.. గోదావరి ప్రాంతంలోని ఓ పల్లెటూరి వాతావరణంలో ఓ మిత్ర బృందాన్ని పరిచయం చేసి.. వారి సరదాలు.. అల్లర్లు.. గొడవలు.. రాజకీయాలు.. వీటన్నింటి మధ్య అందంగా.. సహజంగా ఓ కథను ప్రెజెంట్‌ చేయడానికి ప్రయత్నించాడు కొత్త దర్శకుడు యదు వంశీ. ఓ దశ దాటాక కథలో బలం లేకపోవడం.. సాగతీతగా అనిపించే కొన్ని సీన్లు ఇబ్బంది పెట్టినా.. చాలా వరకు ఎంగేజింగ్‌ గా అనిపించే కథనం ప్రేక్షకులకు అంతిమంగా మంచి అనుభూతినే మిగులుస్తుంది.

‘‘ఆ రోజులు.. మళ్లీ రావు’’ అంటూ సాగే పాటతో మొదలువుతుంది ‘కమిటీ కుర్రాళ్ళు’. ఐతే అందులో చూపించే అంశాలన్నీ రొటీన్‌ గా.. కొంచెం డ్రమటిగ్గా అనిపించడంతో ఇదంతా ఎన్నోసార్లు చూసిందే కదా అనే ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ దర్శకుడు నిజాయితీగా ఈ కథను చెబుతున్నాడని కొంచెం ముందుకు వెళ్లాక అర్థమవుతుంది. ఎంతో సహజంగా అనిపించే పాత్రలు.. అందులో చక్కగా ఒదిగిపోయిన నటులు.. ఆహ్లాదం పంచేలా సాగే సన్నివేశాలు.. ‘కమిటీ కుర్రాళ్ళు’ను లవబుల్‌ గా మారుస్తాయి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్నట్లు కాకుండా మిత్ర బృందంలో ప్రతి పాత్రకూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా వాటిని తీర్చిదిద్దిన తీరు ‘కమిటీ కుర్రాళ్ళు’లో మేజర్‌ హైలైట్‌. ఒకట్రెండు డైలాగులు చెప్పే పాత్ర సైతం తన ప్రత్యేకతను చాటుకుంటుంది. పేరుకు ఇందులో ఒక హీరో కనిపిస్తాడు కానీ.. మిగతా పాత్రలు దానికి దీటుగా.. ఇంకా చెప్పాలంటే దాన్ని మించి ఉంటాయి. సూర్య.. విలియం.. సుబ్బు లాంటి పాత్రలను దర్శకుడు భలేగా డిజైన్‌ చేశాడు. సూర్య.. విలియం పాత్రలకు పెట్టిన లవ్‌ స్టోరీలు సింపుల్‌ గా ఉంటూనే భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. ఆహ్లాదభరితంగా సాగే ఈ లవ్‌ ట్రాక్స్‌.. స్నేహితుల మధ్య సరదా సన్నివేశాలతో ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి వేగంతో నడుస్తుంది. కథ సీరియస్‌ రూట్‌ తీసుకోవడానికి దారి తీసే మలుపు కూడా చాలా బాగుంది.

అప్పటిదాకా ఏ అంతరాలు లేకుండా సాగిపోయిన మిత్ర బృందంలో కులం అంశం ఎలా విభేదాలకు దారి తీస్తుందో దర్శకుడు చాలా ఆసక్తికరంగా చూపించాడు. సున్నితమైన రిజర్వేషన్ల అంశాన్ని తీసుకుని ఇంటెన్స్‌ గా డ్రామాను నడిపించాడు. కథలో కాన్ఫ్లిక్ట్‌ కోసం ఇలాంటి పాయింట్‌ ఎంచుకున్న దర్శకుడి గట్స్‌ ను అభినందించాల్సిందే. ఒక స్టాండ్‌ అంటూ తీసుకోకుండానే స్ట్రైకింగ్‌ డైలాగ్స్‌ తో స్నేహితుల మధ్య గొడవ ఎపిసోడ్‌ ను రసవత్తరంగా నడిపించాడు. దీన్ని అనుసరించి వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వవు. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ సినిమాకు మేజర్‌ హైలైట్‌. విరామ సమయానికి ‘కమిటీ కుర్రాళ్ళు’ పతాక స్థాయిని అందుకుంటుంది. కానీ ఇంత మంచి మలుపు తర్వాత మాత్రం కథనాన్ని దర్శకుడు ఆశించినంత ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. స్నేహితుల రీయూనియన్‌.. జాతర.. ఎన్నికలు.. ఈ వ్యవహారాలన్నీ కొంచెం రొటీన్‌ గానే నడిచిపోతాయి. మిత్రుడి మరణానికి సంబంధించిన ఎమోషన్‌ రక్తి కట్టినా.. సదరు సన్నివేశాలను మరీ లాగినట్లు అనిపిస్తుంది. మెలోడ్రామా ఒక దశలో శ్రుతి మించింది. ప్రథమార్ధంలో అంత ఆహ్లాదంగా కనిపించిన సినిమా.. రెండో అర్ధంలో సెంటిమెంట్‌ డ్రామాగా మారిపోవడం యువ ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. ఎన్నికల ఎపిసోడ్‌ సైతం అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. సెకండాఫ్‌ లో పెద్దగా కథ.. కొత్తదనం లేకుండానే మామూలుగా లాగించేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. కాకపోతే రెండో అర్ధంలో కూడా సినిమా బోర్‌ అయితే కొట్టించదు. ఏదో అలా అలా నడిచిపోతుంది. విరామ సమయానికి ఇచ్చిన హై సెకండాఫ్‌ లో కూడా కొనసాగి ఉంటే మాత్రం ‘కమిటీ కుర్రాళ్ళు’ స్పెషల్‌ ఫిలిం అయ్యేది. కొన్ని లోపాలున్నప్పటికీ ఒకసారి చూసేందుకు మాత్రం ఢోకా లేని సినిమానే ఇది.

నటీనటులు: ‘కమిటీ కుర్రాళ్ళు’లో సాయికుమార్‌.. గోపరాజు లాంటి ఇద్దరు ముగ్గురు తప్పితే అందరూ కొత్త వాళ్లు.. పెద్దగా పేరు లేని ఆర్టిస్టులనే చూడొచ్చు. కానీ వీళ్లందరిలో ఎవ్వరూ బాగా చేయలేదు అనడానికి లేదు. చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు కూడా తమ ప్రత్యేకతను చాటుకున్నారు. హీరో కాని హీరోలా అనిపించే శివ పాత్రలో చేసిన సందీప్‌ సరోజ్‌.. సుబ్బుగా త్రినాథ్‌ వర్మ.. సూర్యగా యశ్వంత్‌ పెండ్యాల.. విలియంగా ఈశ్వర్‌ రచిరాజు.. ఎవరికి వాళ్లే అదరగొట్టేశారు. అందరిలోకి త్రినాథ్‌ మరింత ప్రత్యేకంగా కనిపిస్తాడు. యూట్యూబర్‌ గా ఫేమస్‌ అయిన ప్రసాద్‌ బెహరా పెద్దోడు అనే పాత్రలో కట్టి పడేశాడు. అతణ్ని సరిగా ఉపయోగించుకుంటే కమెడియన్‌ గా మంచి పేరు సంపాదించే అవకాశముంది. సాయికుమార్‌.. గోపరాజు రమణ తమ పాత్రలను బాగా పండిరచారు. కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ కిషోర్‌ మరోసారి కన్నీళ్లు పెట్టించేశాడు. మాధురి పాత్రలో చేసిన రాధ్యతో పాటు తేజస్వి.. టీనా శ్రావ్య కూడా బాగా చేశారు. ఇడ్లీ బామ్మ పాత్రలో సీనియర్‌ నటి శ్రీ లక్ష్మి కూడా మెప్పించింది. మిగతా ఆర్టిస్టులందరూ కూడా ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: ‘కమిటీ కుర్రాళ్ళు’కు సాంకేతిక నిపుణుల సహకారం కూడా బాగానే కుదిరింది. అందరూ మనసు పెట్టి చేస్తే ఔట్‌ పుట్‌ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. అనుదీప్‌ దేవ్‌ తన సంగీతంతో బలమైన ముద్ర వేశాడు. సినిమా చూసిన వాళ్లందరూ సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. ఫీల్‌ గుడ్‌ పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతం కూడా అందించాడు అనుదీప్‌. ముఖ్యంగా ఇంటర్వెల్‌ కు ముందు ఓ అరగంట అతడి నేపథ్య సంగీతం అదిరిపోయింది. క్రమ క్రమంగా సన్నివేశాల్లో పెరిగే ఇంటెన్సిటీని తన నేపథ్య సంగీతం ద్వారా ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలో అతడిది కీలక పాత్ర. రాజు ఎదురోలు ఛాయాగ్రహణం కూడా చాలా బాగా సాగింది. గోదావరి ప్రాంతంలోని పల్లెటూరిని సహజంగా.. అందంగా చూపించాడు. విజువల్స్‌ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి కథకు మద్దతుగా నిలిచిన నిహారిక అభినందనీయురాలు. రైటర్‌-డైరెక్టర్‌ యదు వంశీ.. రాతలో తీతలో తన అభిరుచిని చూపించాడు. తన అనుభవాల నుంచే అతనీ కథను రాసుకున్నాడనిపిస్తుంది. అందుకే సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. సరదా సన్నివేశాలతో పాటు సీరియస్‌ సీన్లను కూడా అతను బాగా డీల్‌ చేశాడు. కాకపోతే ద్వితీయార్ధంలో కథ మీద అతను ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ కథను నడిపించి.. మెలోడ్రామాను ఇంకొంచెం తగ్గించి ఉంటే దర్శకుడి ముద్ర ఇంకా బలంగా ఉండేది.

చివరగా: కమిటీ కుర్రాళ్ళు.. విషయం ఉన్నోళ్ళే

Opmerkingen


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page