top of page

కమిన్స్‌కు కాళరాత్రి

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • May 28
  • 2 min read
15 ఏళ్ల కుర్రాడి బ్యాట్‌కి ఐపీఎల్ బౌలర్లు ‘నెట్ ప్రాక్టీస్’ ఫీలింగ్!

వైభవ్ ఆడిన తీరుకు... ఔటయినప్ప్పుడు బౌలర్, క్యాచ్ పట్టినవాడు, టీమ్ అంతా పిచ్చిపట్టినట్టు అరవచ్చు గానీ, దగ్గరుండి సన్‌రైజెస్ హైదరాబాద్ టీమ్ అభినందించడం కొసమెరుపు.


సూర్యవంశీని ఔట్ చేయడానికి మూడు  ప్లాన్లు వేశామన్నారు. ఆ బుడ్డోడు SRH టీమ్‌ను మూడు  చెరువుల నీళ్లు తాగించి, సెంచరీకి మూడ0టే మూడు  పరుగుల ముందు ఔటయ్యాడు.


ముల్లాన్‌పూర్‌లో బుధవారం రాత్రి జరిగినది మ్యాచ్ కాదు.. ‘పాట్ కమిన్స్‌పై వైభవ్ సూర్యవంశీ నిర్వహించిన ఓపెన్ బుక్ ఎగ్జామ్!’ అని చెప్పాలి. ప్రశ్నాపత్రం కమిన్స్‌దే.. కానీ సమాధానాలన్నీ ముందే చూసుకుని వచ్చినట్లు ఆడాడు ఈ 15 ఏళ్ల బాలుడు. కొద్ది రోజుల క్రితం ‘వావ్.. ఈ కుర్రాడు నా బౌలింగ్‌ను చీల్చేశాడు’ అని చెప్పిన కమిన్స్‌కు, ఈసారి ‘వావ్ ’ కూడా రాలేదు. ఎందుకంటే అప్పటికి సూర్యవంశీ అతని బౌలింగ్‌ను కేవలం బాదడం కాదు... ‘డీకోడ్ ’ చేసి, ‘డౌన్‌లోడ్ ’ చేసుకుని, ‘డిలీట్ ’ కూడా చేసేశాడు.

సాధారణంగా సూర్యవంశీ బ్యాటింగ్ గురించి మాట్లాడితే అందరూ ‘పవర్ హిట్టింగ’ అంటారు. కానీ ముల్లాన్‌పూర్‌లో కనిపించింది పవర్ కాదు.. ‘ప్లాన్‌తో కూడిన విధ్వంసం’. బంతి పడకముందే ఫీల్డింగ్ ఎక్కడుంటుందో, కమిన్స్ ఏం ఆలోచిస్తున్నాడో, తర్వాతి బాల్ ఏ లెంగ్త్‌లో వస్తుందో ముందే చదివేసినట్టు కనిపించాడు.

ఒక బాల్‌కు థర్డ్ మ్యాన్ వెనక్కి వెళ్తే.. ‘సరే, నేరుగా నీ తలపై నుంచి పంపిస్తా’ అన్నట్టు స్ట్రెయిట్ సిక్సర్. మళ్లీ ఫీల్డ్ మార్చి షార్ట్ బాల్ వేస్తే.. ‘అప్పర్ కట్ అనే సబ్జెక్ట్ చదవలేదా?’ అన్నట్టు మరో సిక్సర్. స్లోయర్ బాల్ వేస్తే.. ‘స్పీడ్ తగ్గించావ్ గానీ, నా బ్రెయిన్ స్పీడ్ ఎలా తగ్గిస్తావ్?’ అన్నట్టు మూడో సిక్సర్. అక్కడ కమిన్స్ బౌలింగ్ చేస్తున్నాడా? లేక చెస్ ఆడుతున్నాడా? అన్న సందేహం ప్రేక్షకులకు వచ్చేసింది. కానీ ఒక్క తేడా ఏమిటంటే.. చెస్‌లో కమిన్స్ కింగ్ అయితే, బోర్డు మొత్తం కదిలించింది మాత్రం సూర్యవంశీ బ్యాట్.

29 బంతుల్లో 97 పరుగులు.. 12 సిక్సర్లు

గేల్ రికార్డు కేవలం మూడు పరుగుల దూరంలో..

అక్కడ స్టేడియంలో ఉన్నవాళ్లు మ్యాచ్ చూస్తున్నారో... లేక భవిష్యత్తు ట్రైలర్ చూస్తున్నారో అర్థం కాలేదు. సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే.. ‘టీ20 క్రికెట్‌కు ఇకపై బౌలర్ల అవసరమే ఉందా?’ అనే అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు. చివరికి థర్డ్ మ్యాన్ వద్ద క్యాచ్ పడినప్పుడు స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. కానీ ఆ నిశ్శబ్దంలో కూడా ఒక నిజం గట్టిగా వినిపించింది.. ‘రికార్డు మిస్ అయింది.. కానీ కొత్త రాక్షసుడు వచ్చేశాడు!’ అవుటైన తర్వాత కూడా సూర్యవంశీ చెప్పిన మాటల్లో అదే కాన్ఫిడెన్స్ కనిపించింది. ‘నేను రాంప్ షాట్ ఆడాల్సింది..’ అన్నాడు. అంటే 97 వద్ద ఆగిపోయిన బాధ కంటే.. ‘అయ్యో, ఇంకో ప్లాన్ ట్రై చేయలేకపోయా!’ అన్న ఫీలింగ్ ఎక్కువగా కనిపించింది. ముల్లాన్‌పూర్‌లో జరిగినది కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు. అది ఐపీఎల్ బౌలర్లకు వచ్చిన ‘ఎమర్జెన్సీ అలర్ట’. 15 ఏళ్ల కుర్రాడు వచ్చి.. అంతర్జాతీయ స్టార్ బౌలర్లను ‘పార్ట్‌టైమ్ నెట్స్ బౌలర్లుగా’ మార్చిన రాత్రి. స్కోర్‌బోర్డ్ దాన్ని 97గా గుర్తుంచుకుంటుంది. కానీ అభిమానులు మాత్రం మరోలా గుర్తుంచుకుంటారు.. ‘ఆ రాత్రి... భవిష్యత్తు బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగింది!’

-సత్యం స్పోర్ట్స్ డెస్క్

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page