కమిషనర్ పట్టువీడినా.. ఆగని సహాయ నిరాకరణ!
- Prasad Satyam
- May 28
- 3 min read
విధుల్లో చేరిన కూర్మారావు.. డివిజన్లలో పర్యటన
వాటర్ వర్క్‌లో లోపించిన జవాబుదారీతనం
అందుకే ఏఈని గతంలో సరెండర్ చేసిన మున్సిపల్ బాస్
ఆయనతోనే పనిచేయించుకోవాలన్న ఈఎన్‌సీ
మనస్తాపంతోనే సెలవు పెట్టిన కమిషనర్
మంత్రి, ఎమ్మెల్యే జోక్యంతో పట్టువీడిన వైనం
ఆయన తిరిగి రావడమూ వారికి కంటగింపే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరపాలక సంస్థలో ఎదురవుతున్న సహాయ నిరాకరణతో మనస్తాపానికి గురైన కమిషనర్ హనుమంతు కూర్మారావు చివరికి పట్టువీడి విధుల్లో చేరారు. జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు వరకు ఆయనకు మద్దతు పలికారు. కానీ కూర్మారావు బాస్‌గా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌లో చాలామంది ఉద్యోగులు మాత్రం సహాయ నిరాకరణను విడిచిపెట్టడంలేదు. ఏ కారణంతో కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్నట్లు ప్రకటించారో.. ఆ సమస్య పరిష్కారం కాకపోయినా ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ దినకర్ పుండ్కర్‌లు పట్టుబట్టి పునరాలోచించుకునేలా చేశారు. కానీ సిబ్బందితో ఇబ్బంది ఇంకా తీరలేదు. దీర్ఘకాలంగా కార్పొరేషన్‌కు ఎన్నికైన పాలకవర్గం లేకపోవడం, ప్రత్యేక అధికారులుగా కలెక్టర్లు వ్యవహరిస్తున్నా కార్పొరేషన్‌పై దృష్టి సారించే పరిస్థితి లేకపోవడాన్ని ఆసరా చేసుకుని ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు మున్సిపాలిటీని పాలించారు. 2010లో పాలకవర్గం గడువు ముగిసిన నాటినుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్, వైకాపా, టీడీపీలు నగరపాలక సంస్థపై పెత్తనం సాగించాయి. వారి మనుషులే కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు, అధికారుల బదిలీలు వంటివి చేయించుకున్నారు. పర్యవేక్షణ లేకుండా ఇష్టారాజ్యంగా సాగిన ఈ అడ్డగోలు అడ్మినిస్ట్రేషన్‌కు భిన్నంగా ప్రస్తుత కమిషనర్ కూర్మారావు పారదర్శకంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తుంటే.. సిబ్బంది మొండికేస్తున్నారు. గురువారం విధుల్లో చేరిన వెంటనే కమిషనర్ కూర్మారావు దమ్మలవీధి, గోల్కొండరేవు రోడ్డు, సరంగుడోల వీధి, గొడగలవీధి, దమ్మలవీధి రామమందిరం ప్రాంతాల్లో పర్యటించారు. శానిటేషన్ పనుల తీరును గమనించారు. ఆదివారంపేట పంప్‌హౌస్ వాటర్ ట్యాంక్‌లో క్లోరినేషన్ జరుగుతున్న విధానం, నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు.
రిపేర్లకు ఎక్కడికి పంపారో కూడా తెలియదట!
ఈ పరిశీలనల్లో ఎంతవరకు సిబ్బంది సహకారం ఉందో, ఎంత డొల్ల ఉందో గురువారమే బయటపడిపోయింది. ఆదివారంపేట పంప్‌హౌస్‌లో రెండు కేవీ జనరేటర్ పాడైపోయిందని రిపేరుకు పంపారు. రెండు నెలలైనా అది వెనక్కి రాలేదు. ఇదేమని అడిగితే సమాధానం చెప్పే ఇంజినీర్ అక్కడ లేరు. అలాగే 75 హెచ్‌పీ మోటార్లు మÖడు కాలిపోయాయంటూ రీవైండింగ్ కోసం మÖడింటిని మÖడుచోట్లకు పంపారు. కానీ మÖడు నెలలైనా అవి తిరిగి రాలేదు. కనీసం అవి ఎక్కడున్నాయి? ఏ స్థితిలో ఉన్నాయి? అన్న వివరాలు చెప్పడానికి సంబంధిత ఇంజినీర్ దగ్గర సబ్జెక్ట్ లేదు. కమిషనర్ పరిశీలనకు వచ్చేవరకు వాటర్ వర్క్స్‌లో అవి లేవన్న విషయం కూడా ఇంజినీర్లకు తెలియదు. ఇలాంటిచోట పని చేయలేకే మÖడు రోజుల క్రితం కమిషనర్ లాంగ్‌లీవ్‌లోకి వెళ్లిపోయారు. వాటర్ వర్క్స్‌లో ఇటువంటి నిర్లక్ష్యపు వ్యవహారాలు ఉన్నందునే ఏఈ సత్యనారాయణను నాలుగురోజుల క్రితం కూర్మారావు సరెండర్ చేశారు. ఆయన స్థానంలో కొత్త ఇంజినీర్‌ను పంపాలని ఈఎన్‌సీని కోరితే.. శ్రీకాకుళానికి ఎవరూ రారని, ఆయనతోనే పని చేయించుకోవాలని సూచించారట. ఒక ఇంజినీర్‌ను సరెండర్ చేసిన తర్వాత మళ్లీ ఆయన్ను అదే సీటులో కొనసాగించడమంటే తాను ముందు తీసుకున్న నిర్ణయానికి అర్ధం ఉండదన్న బాధతోనే కూర్మారావు సెలవు పెట్టేశారు. కానీ కమిషనర్ సెలవు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే గొండు శంకర్ నేరుగా ఈఎన్‌సీకి ఫోన్ చేసి కూర్మారావు మంచి అధికారి కాబట్టి ఏఈని సరెండర్‌తో సరిపెట్టారని.. వాస్తవానికి సస్పెండ్ చేయాలని ఈఎన్‌సీకి చెప్ప్పుకొచ్చారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలడానికి ఏఈగా సత్యనారాయణ నిర్లక్ష్యమే కారణమని, అప్ప్పుడే ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందని ఈఎన్‌సీకి స్పష్టం చేసినట్లు సమాచారం. వాటర్ వర్క్స్ ఏఈ సత్యనారాయణ ప్లేస్‌లో మరో ఏఈ రాకేష్‌ను ఇన్‌ఛార్జిగా కూర్మారావు నియమించారు. అయితే తనకు వాటర్ వర్క్స్ గురించి ఏమీ తెలియదని.. తాను సివిల్ ఇంజినీర్‌నంటూ ఆయన చేతులెత్తేశారు. వాస్తవానికి వాటర్ వర్క్స్ గురించి చదివే ఇంజినీరింగ్ కోర్సు అంటూ ఏమీ ఉండదు. సివిల్ ఇంజినీరే వాటర్ వర్క్స్‌లో ఉంటే, ఆ శాఖ మీద పట్టు సంపాదించుకోవాలి.
ఉదయం ఫీల్డ్ విజిట్‌కు రారట!
ఇక ఉదయం డివిజన్లలో పర్యటనలకు తాను వెళ్లినప్పుడు మున్సిపల్ ఇంజినీరు, మున్సిపల్ హెల్త్ అధికారి కూడా అక్కడ ఉండాలని కమిషనర్ కోరగా ఉదయాన్నే ఫీల్డ్ విజిట్‌కు రావడం కుదరదని ఎంఈ తేల్చి చెప్పేశారట. కమిషనర్ ఆదేశాన్ని ఎంఈయే పాటించకపోతే, ఇక ఎంఈ పని చేసే ఏఈలు ఎందుకు వింటారు?.. ఇలా మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది సహకారం లేకే కమిషనర్ మనస్తాపంతో సెలవు పెట్టేశారు. అయితే మహానాడు అయిపోయిన తర్వాత కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చుని సమీక్షిస్తానని, అన్ని లెక్కలూ అప్ప్పుడే తేలుస్తానంటూ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇవ్వడంతో కూర్మారావు తిరిగి విధుల్లో చేరారు. అయితే ఇంజినీరింగ్ సిబ్బందితో పాటు అనేకమంది ఈయన పునరాగమనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కార్పొరేషన్‌ను ఇన్నాళ్లూ పట్టించుకునేవాడు లేకపోవడంతో బినామీలను కాంట్రాక్టర్లుగా దిగుమతి చేసుకొని ఇష్టారాజ్యంగా కోట్లు తినేశారు. ఇప్ప్పుడు వాటికి బిల్లులు అడుగుతుంటే సెలవులు పెట్టేస్తున్నారు. ఇలాగే ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సృజన చైల్డ్‌కేర్ లీవ్‌లో వెళ్లిపోయారు. ఆమె ఖాతాలో చేసిన పనులు కోట్లలో ఉన్నా వాటికి లెక్కాపత్రం లేదు. ఇంజినీరింగ్ అధికారులు కూడా బినామీలను తీసుకువచ్చి ఇష్టం వచ్చినట్టు పనులు చేసినట్టు చూపించి బిల్లులు మింగేశారు. ఇప్ప్పుడివన్నీ బయటకు రాకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈలోగా కూర్మారావు తమ పాపాలు తవ్వితీస్తే కొన్నిటికి ఫిక్స్ అయిపోవాల్సి ఉంటుందని బెంగ పెట్టుకుంటున్నారు. అందుకే కూర్మారావు కార్యాలయ సిమ్‌ను హ్యాండోవర్ చేశారనగానే పండగ చేసుకున్నారు. అయితే ఇది కేవలం టీకప్ప్పులో తుపానేనని, ఏరికోరి తెచ్చుకున్న కూర్మారావు వెళ్లిపోతానంటే రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఊరుకోరని తెలియడం వల్లే ఆ కథ ముగిసేవరకు ‘సత్యం’ పాఠకుల ముందుకు రాలేదు.






Comments