top of page

కరపత్రం సరే.. ‘ఆఫ్‌లైన్‌’ కహానీ ఏంటి?

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • కుర్చీ కోసం డీఈవో తాపత్రయం

  • కరపత్రంతో క్లీన్‌చిట్‌ ఇచ్చుకున్న చైతన్య

  • గత బదిలీలపై లేని ప్రస్తావన

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
  • ‘‘జబ్బు సాకు నిజం.. నన్ను ఎంపిక చేసుకున్న పెద్దలను రోడ్డెక్కించలేక, వారి ఆకాంక్షలకు అడ్డుగా నిలవడం ఇష్టంలేక, వాట్సాప్‌ బదిలీల కుంభకోణంలో ఇరుక్కోలేక ఆరోగ్యం సాకు చెప్పి తలవంచుకొని బయటకు వచ్చా.

  • నాయకత్వం అంటే హోదా కాదు.. బాధ్యత. ఏ నాయకత్వ నిర్వహణలో ఓడిపోయానో, వెన్నుచూపానో, అవినీతితో అంటకాగానో తేల్చండి. సమాజమో, ప్రజాప్రతినిధులో, ఉన్నతాధికారులో ఒక బాధ్యతను అప్పగిస్తే ప్రభుత్వ కూలీగా ప్రజాధనానికి కాపలా కాయడమే తప్ప మ్యాచ్‌ఫిక్సింగ్‌, సిగ్గుమాలిన పనులు చేయడం జాతకంలోనే లేదు.

  • ప్రజాప్రతినిధులకు నేను ఇచ్చే గౌరవం వారిని ఒక్కసారి అడగండి. వారితో నా ప్రవర్తన తీరు గూర్చి తీర్పు ఇవ్వడానికి ఈ ముఠా ఎవరు? మోసం చేసి, మాయ చేసి, మోచేతి నీరు తాగి ఉద్యోగాలు తెచ్చుకోడానికి నేను నిరుద్యోగిని కాదు.

  • తినడం చేతకాకనే ఒక ప్రైవేటు స్కూల్‌ రికగ్నిషన్‌ రెన్యువల్‌కు ఆమోదం తెలపకపోవడం వల్ల గత నవంబర్‌లో శ్రీకాకుళం డిప్యూటీ డీఈవోగా తొలగించబడిన నిజం మీకు తెలుసుకదా!

  • కొందరు పెద్దమనుషుల్లా తన కోసం, తన స్వార్థం కోసం ఒక సంస్థను, వ్యవస్థను బలి తీసుకుని ఎదిగే వ్యక్తిని కాదు. దేశం గర్వించదగ్గ స్థాయిలో నిలిచిన నా తల్లి డైట్‌ వమరవల్లిని సందర్శించండి. ఏ క్షణానైనా ఆ తల్లి ఒడిలో చేరడానికి ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాను.’’

.. ఇదీ జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య తనపై వస్తున్న ఆరోపణలకు వాట్సాప్‌లో ఇస్తున్న సమాధానం. ‘సత్యం’లో వచ్చిన కథనం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, బదిలీల్లో పారదర్శకంగా వ్యవహరించానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. సాకు నిజమే.. షోకు ఎక్కడ.. అంటూ ఒక కరపత్రాన్ని ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో ఆదివారం షేర్‌ చేశారు. అయితే, కొన్ని కీలకమైన అంశాలను ఆయన దాటవేశారు.

  • అప్పటి వైకాపా నాయకులు వాట్సాప్‌లలో పంపిన ఉపాధ్యాయుల బదిలీ జాబితాను ఆమోదించలేక ఆరోగ్యం బాగులేదని తప్పుకున్నానని తిరుమలచైతన్య తన కరపత్రంలో ఒప్పుకున్నారు. కానీ అప్పటికే ఆయన బదిలీల ప్రక్రియ పూర్తిచేశారన్న విషయాన్ని తొక్కిపెట్టేశారు. ఆఫ్‌లైన్‌లో ఏడుగురికి కౌన్సిలింగ్‌ చేసి కోరుకున్న చోటకు బదిలీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించివుంటే బాగుండేది. ఇక్కడ సొమ్ములు చేతులు మారాయా? లేదూ అంటే రాజకీయ నాయకుల ప్రాపకం కోసం చేశారా? అనే విషయం చెబితే మరింత నిఖార్సుగా ఉండేది.

  • 2023 జూన్‌ 8 నాటికి బదిలీ ప్రక్రియ పూర్తయితే జూన్‌ 11న ఆఫ్‌లైన్‌లో ఏడుగురు ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌ ఎలా నిర్వహించారు? రాష్ట్రవ్యాప్తంగా వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో ఆఫ్‌లైన్‌లో కౌన్సిలింగ్‌ ఎందుకు చేసారు? 2023 జూన్‌ 2న ఉపాధ్యాయుల బదిలీకి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత రోజు నుంచి డీఈవో కార్యాలయంలో విద్యుత్‌ సరఫరా ఎందుకు నిలిచిపోయింది? ఒకవేళ షార్ట్‌ సర్క్యూట్‌ అయిందే నిజమైతే, బదిలీ ప్రక్రియ పూర్తి అయిన మరుసటి రోజు విద్యుత్‌ పునరుద్ధరణ కావడం కాకతాళీయమా? ప్రీప్లానా? ఇది కూడా చెబితే బాగుండేది.

  • డీఈవో తిరుమల చైతన్య కనుసన్నల్లో ఏపీవో తేజ ఇంటి నుంచి సీనియారిటీ జాబితాను తీసుకువచ్చి వారం రోజులు కథ నడిపించారన్న ఆరోపణలకు ఏం సమాధానం చెప్పారు? సీనియార్టీ లిస్టులను ప్రదర్శించకుండా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణం చూపించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఉపాధ్యాయ సంఘాల వాదనకు మీ దగ్గర ఉన్న సమాధానమేమిటి? రోస్టర్‌ పాయింట్స్‌, కమ్యూనిటీ రోస్టర్‌ పాయింట్‌ ఎక్కడ ఎగ్జాష్టర్‌ అవుతుందన్న అంశం బహిర్గతం చేయకుండా డేటాను ఫాబ్రికేట్‌ చేయించినట్టు తిరుమల చైతన్యపై ఆరోపణలు ఉన్నాయి. మాస్టర్‌ డేటాను ఏపీవో చేతిలో ఉంచి టీచర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టంను డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా మార్పులు చేసి కొందరు టీచర్ల డేటాను హైడ్‌ చేసినట్టు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేసాయి. సందర్భాన్ని బట్టి మాస్టర్‌ డేటాలో తేదీలు మార్పు చేసి కొందరిని తప్పించి, అనుకూలమైన వారిని కంపల్సరీ చేసినట్టు కొందరు ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి ఏం సమాధానమిచ్చారు?

  • స్పౌజ్‌ పాయింట్లు ఎనిమిదేళ్లు, హెచ్‌ఎంలకు ఐదేళ్లుగా బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎనిమిదేళ్లు పూర్తి అయినా మాస్టర్‌ డేటా బేస్‌లో బదిలీలకు సంబంధించిన స్పౌజ్‌ పాయింట్ల ఆధారాలను మార్చేశారన్న ఆరోపణల సంగతేమిటి?

  • తిరుమల చైతన్య ఆధ్వర్యంలో తయారుచేసిన సీనియార్టీ జాబితాను కౌన్సిలింగ్‌ చివరి క్షణం వరకు బయట పెట్టకుండా అక్రమాలకు పాల్పడ్డారని, ఒక ప్రైవేట్‌ వ్యక్తి గుట్టుగా ఈ వ్యవహారం నడిపించారని ఆరోపణలు ఉన్నాయి.

  • 20 శాతం ఖాళీలను ఇక్కడ బ్లాక్‌ చేయడం వెనుక స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ అనుమతులు ఉన్నాయా? బ్లాక్‌ చేసిన ఖాళీల్లోనే మాన్యువల్‌గా కౌన్సిలింగ్‌ చేసి కొందరికి ఫేవర్‌ చేసిన అంశంపై మాట్లాడితే బాగున్ను.

  • జూనియర్ల కంటే ఎక్కువ పాయింట్లు కలిగివున్న సీనియర్లను వెబ్‌ కౌన్సిలింగ్‌లో దూర ప్రాంతాలకు సాగనంపలేదా? దీనిపై బాధితులు ఆర్‌జేడీకి అప్పీల్‌ చేస్తే, జేడీ మువ్వా రామలింగం, ఆర్జేడీ జ్యోతికుమారిని అడ్డం పెట్టుకొని అప్పీలు చేసిన బాధిత ఉపాధ్యాయులకు అన్యాయం చేశారా? లేదా?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page