బరిలో కొనసాగించేలా వైకాపా మంతనాలు

తద్వారా టీడీపీ ఓట్లలో చీలిక తేవాలన్నది లక్ష్యం
ఎన్నికల ఖర్చులన్నీ తామే భరిస్తామని భరోసా
సొంత పార్టీలో అసమ్మతిని చల్లార్చే యత్నాలు
అప్పు దొరక్క టీడీపీ అభ్యర్థి తిప్పలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రత్యర్థి పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని అవకాశంగా మలచుకుని పాతపట్నం నియోజకవర్గం ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఎదుర్కొంటున్న తమ అభ్యర్థిని గట్టెక్కించడానికి అధికార వైకాపా తెరవెనుక మంత్రాంగం నెరుపుతోంది. ఈ నియోజకవర్గంలో సిటింగ్ ఇన్‌ఛార్జి కలమణ రమణను కాదని మామిడి గోవిందరావుకు తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసింది. దాంతో అసమ్మతి గళం వినిపిస్తూ తనను అభ్యర్థి ప్రకటించకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని టీడీపీ అధిష్టానానికి కలమట అల్టిమేటమ్ కూడా ఇచ్చారు. అయితే అభ్యర్థి విషయంలో పునరాలోచన చేసే ఉద్దేశం టీడీపీ అధిష్టానానికి ఉన్నట్లు లేదు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా నేతలు రంగంలోకి దిగి పావులు కదుపుతున్నారు. టీడీపీ అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా తలొగ్గకుండా కలమట రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచేలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తద్వారా నియోజకవర్గంలో టీడీపీ ఓట్లను చీల్చి విజయం వైకాపా వైపు మొగ్గేలా చేసేలా వ్యూహం రచించి, ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు పార్టీ టికెట్ నిరాకరించిన తర్వాత పాతపట్నం వచ్చిన కలమట రమణ తన అనుచరులతో సమావేశం నిర్వహించి పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను గమనించిన వైకాపా ఎంపీ అభ్యర్థి, జిల్లాలో ఓ మంత్రి తరఫున కొందరు నేతలు కలమటతో రాజకీయ మంతనాలు సాగించారని సమాచారం. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కలమట రమణను ఇండిపెండెంట్‌గా బరిలో ఉంచాలని వైకాపా భావిస్తోంది. ఇప్పటికే మూడు మండలాల్లో కలమట ర్యాలీ నిర్వహించగా వాటికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ పరిస్థితుల్లో కలమటను ఇండిపెండెంట్‌గా బరిలో కొనసాగించడం ద్వారా టీడీపీ ఓట్లలో చీలిక తీసుకొచ్చి వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చాలన్న వ్యూహాన్ని వైకాపా అమలు చేస్తోంది.


ఈయన పోటీ.. ఖర్చు వారిది
ఇండిపెండెంట్‌గా రమణ నిలబడితే ఎన్నికలకు అయ్యే ఖర్చుతోపాటు ఓట్ల కొనుగోలుకు ఎంత మొత్తమైనా పెట్టుకోడానికి వైకాపా సిద్ధపడుతోంది. పాతపట్నంలో వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతిని వ్యతిరేకిస్తూ ఆ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఎంతమంది ఎన్నిసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా రెడ్డి శాంతిని మార్చడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంగీకరించలేదు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె గెలచేలా చూడాలని ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి, చిన్నశ్రీను, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌లకు జగన్ ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన ఆ ముగ్గురూ వైకాపాలో అసంతృప్తులను గత కొద్ది రోజులుగా బుజ్జగిస్తూ వస్తున్నారు. అసమ్మతి గ్రూపునకు ప్రధాన నాయకుడిగా ఉన్న లోతుగెడ్డ తులసీవరప్రసాద్‌ను కూడా వీరు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఆయన శిబిరంలో ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీ, సర్పంచ్‌లను బుజ్జగిస్తూ దారికి తెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే తులసీవరప్రసాద్ ఇప్పటి వరకు తన నిర్ణయాన్ని బయట పెట్టకపోవడంతో ఆయన గ్రూపు నాయకులు స్తబ్దుగా ఉన్నా రానున్న రోజుల్లో పార్టీ సింబల్‌తోనే వెళ్లిపోతారని తెలుస్తోంది. మొన్నటి వరకు రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ కూడా పాతపట్నం టికెట్ ఆశించి ఒక గ్రూపును నడిపించారు. తాజాగా వారిని పాలవలస కుటుంబానికి అటాచ్ చేసేశారు. ఇప్పుడు కలమట రమణను ఇండిపెండెంట్‌గా బరిలో నిలపడం ద్వారా తెలుగుదేశం ఓటును చీల్చి పరోక్షంగా వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టికెట్లు ప్రకటించకముందు జిల్లాలో వైకాపా మొట్టమొదట ఓడిపోయే స్థానం పాతపట్నమేనన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రెడ్డి శాంతి గెలుస్తారన్నట్లుగా మారడానికి కారణం ఇక్కడ టీడీపీ అభ్యర్థిత్వమే. మామిడి గోవిందరావుకు టికెటిస్తే ఖర్చుల కోసం టీడీపీ అధిష్టానం పైసా కూడా పంపక్కర్లేదన్న ప్రచారం నేపథ్యంలోనే ఆయన చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకోగలిగారు. అయితే ఇప్పుడు మామిడి గోవిందరావుకు డబ్బులు పుట్టడంలేదని భోగట్టా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించారన్న ప్రచారాన్ని తనకు తానే చేసుకున్న మామిడి గోవిందరావుకు ఇప్పుడు అప్పు ఇచ్చే నాధుడు కనిపించడంలేదట. ఎందుకంటే.. గతంలో రిజిస్ట్రేషన్ చేసిన భూములు, సొమ్ము చెల్లించినా కొందరికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయని ఘటనలతో పాటు ఇంతవరకు రాజకీయ నాయకుడిగా చెలామణీ కావడానికి ఆయన ఖర్చు చేసిన సొమ్మంతా అప్పేనని, ఇప్పుడు పాతవారికి వడ్డీలు చెల్లించడమే కష్టంగా ఉన్న సమయంలో కొత్త అప్పులు పుట్టడంలేదని తెలుస్తోంది.
ความคิดเห็น