top of page

కలమట ‘రాజీ’కీయంలో.. క్యాడర్‌ బలి!

  • Writer: ADMIN
    ADMIN
  • Apr 25, 2024
  • 2 min read
  • `అలకపాన్పు ఎక్కినందుకు ప్రతిఫలం అందుకున్న నేత

  • `ఆయన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన టీడీపీ

  • `రమణనే నమ్ముకున్న పాపానికి నట్టేట మునిగిన అనుచరులు

  • `సోషల్‌ మీడియా ద్వారా వెల్లడవుతున్న వారి ఆవేదన

(సత్యంన్యూస్‌, పాతపట్నం)

మాటల రూపంలోనైనా.. చేతల రూపంలోనైనా కాస్త అటూఇటుగా వ్యవహరిస్తే ‘రాజకీయం చేయకు’ అనే స్థాయికి.. ఇంకా చెప్పాలంటే బూతు పదంగా పరిగణించే స్థితికి రాజకీయం అనే పదం దిగజారిపోయింది. రాజకీయం ఓ పవిత్ర వ్యాసంగం అని ఎవరైనా చెబితే నమ్మే పరిస్థితి ఎందుకుండటంలేదో చెప్పడానికి ఈ దేశంలో జరిగిన సంఘటనలు కోకొల్లలు. ఒక నాయకుడ్ని నమ్ముకొని పార్టీ అంటే ఆయనేనని.. ఆయనే ఇక్కడ నాయకుడని గుడ్డిగా నమ్మే శ్రేణులు ఉన్నంత వరకు రాజకీయాలు ఇలానే ఉంటాయా? అనిపిస్తుంది. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో నాయకుల జంపింగులు, సిద్ధాంతాలకు నీళ్లొదలడం వంటివి చూసి ఏమాత్రం రాజకీయం వంటపట్టని కొందరు నేతలు గుండెలు బాదుకుంటున్నారు.

పాతపట్నం నియోజకవర్గ టీడీపీ టికెటివ్వలేదని అలిగి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన కలమట వెంకటరమణ చివరకు ఆ గూటిలోనే ఉండిపోయారు. అలకపాన్పు ఎక్కినందుకు ప్రతిఫలంగా జిల్లా టీడీపీ అధ్యక్ష పగ్గాలు అందుకున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం ఖర్చుతో కూడుకున్న పనే.. కాదనడంలేదు. గెలవడం దాదాపు అసాధ్యం. దాన్నీ ఎవరూ కాదనడంలేదు. కానీ ‘మా రమణకు అన్యాయం జరిగింది.. ఇండిపెండెంట్‌గా నిలబడితే ఎలాగైనా గెలిపించుకుంటాం.. ఇక్కడ పార్టీ అంటే రమణ, రమణే తెలుగుదేశం పార్టీ’ అని నిరూపిస్తామని టికెట్‌ దక్కని రోజు నుంచి ఆయన్ను తమ భుజాల మీద మోస్తున్నవారంతా కలమట రమణ తీసుకున్న నిర్ణయంతో హతాశులయ్యారు. సాధారణంగా నాయకులు పార్టీ మారినంత సులభంగా వారి అభిమానులు జెండాలు మార్చలేరు. కలమట రమణ ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయరని, అనవసరంగా మిమ్మల్ని వాడుకుంటున్నారని కొందరు పాతపట్నం ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించినప్పుడు తమ నాయకుడ్ని నమ్మి కొందరు ఏకంగా ఆయన నామినేషన్‌ మీద బెట్టింగులు కూడా కాశారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. కచ్చితంగా టీడీపీ రెబల్‌గా రమణ బరిలో ఉంటారని భావించిన చాలామంది ఆయన పిలిచినప్పుడల్లా ర్యాలీకి వెళ్లారు. బలప్రదర్శనకు రమణ దిగిన ప్రతిసారీ డబ్బులిచ్చి జనాల్ని తరలించారు. (ఏ పార్టీకైనా ఇది సహజం). తీరా మంగళవారం రాత్రి పాతపట్నం వచ్చిన చంద్రబాబు సమక్షంలో కలమట రమణ స్వరం మారిపోయింది. ఎప్పుడైతే రమణకు టీడీపీ టికెట్‌ ఇవ్వలేదో ఆ నియోజకవర్గంలో ఉన్న బలమైన నాయకులకు టీడీపీ టికెట్‌ దక్కించుకున్న మామిడి గోవిందరావు ఆఫర్లిచ్చారు. అలాగే సిటింగ్‌ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కూడా తమ పార్టీలోకి వస్తే అన్ని విధాలుగా అందలమెక్కిస్తామని హామీ ఇచ్చారు. అయినా కలమటనే నమ్ముకున్న వీరెవరూ ఏ పార్టీవైపూ వెళ్లలేదు. కానీ కలమట రమణ మాత్రం మళ్లీ తన సొంత గూటికి వెళ్లారు. ఈయన కోసం అధ్యక్ష కుర్చీని కూన రవి ఖాళీ చేయడం, అక్కడికి కొద్ది గంటల వ్యవధిలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కలమట రమణను జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులివ్వడం చకచకా జరిగిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది. వైకాపా ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీకి వలస పోయిన కలమట రమణకు ఇప్పుడు టీడీపీ సింబల్‌కు మించిన దిక్కు, ధైర్యం లేదు. కానీ కిందిస్థాయి నాయకులకు కూడా ఆ ధైర్యం ఇవ్వాల్సిన రమణ లాంటి నేతలు తమ స్వలాభం కోసం పార్టీ మారేముందు కనీసం కొన్ని సమావేశాలు పెట్టి క్యాడర్‌ అభిప్రాయాలు తీసుకోవడం, వారికి నచ్చజెప్పడం వంటి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు క్యాడర్‌ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. కలమట రమణ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని పాతపట్నం దగ్గర కల్లట గ్రామానికి చెందిన ఓ నాయకుడు పందెం కూడా కాశారు. చివరకు ఆయన టీడీపీలోనే ఒదిగిపోవడంతో విరక్తి చెంది ఆయన వెనుకే టీడీపీకి వెళ్లలేక ఇప్పుడు వైకాపా గూటికి చేరిపోయారు. వాస్తవానికి ఆయన పక్కా టీడీపీ. కానీ కలమట మాత్రమే టీడీపీ అనుకొని ఇన్నాళ్లూ నడిచిన ఆయన తాను మోసపోయానంటూ సోషల్‌ మీడియాలో తన బాధను వ్యక్తం చేశారు. అలాగే ఇండిపెండెంట్‌గా వేస్తారని టీడీపీ గుర్తుతో వెళ్లకుండా నమ్ముకుని ఉన్నందుకు తమను గోతిలో దించారని మరికొందరు సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కూన రవిని, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడను బూతులు తిట్టి, ఇప్పుడు అదే పార్టీ అధ్యక్ష పదవిని తీసుకున్న కలమటను నమ్మి మోసపోయామని పాతపట్నం సోషల్‌ మీడియా గ్రూపుల్లో మెసేజ్‌లు విపరీతంగా ట్రోల్‌ అవుతున్నాయి. తాజాగా మామిడి గోవిందరావు కలమట రమణ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి గురువారం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page