top of page

కలెక్టర్‌కే కహానీలు!

Writer: ADMINADMIN
  • కోర్టు ధిక్కరణ కేసులో ఇరికించే కుట్ర

  • సొమ్ములతో నింపేసిన పోస్టులు

  • స.హ. చట్టానికీ ఇవ్వని పత్రాలు

  • వైద్య ఆరోగ్యశాఖ సూపరింటెండెంట్‌ సిత్రాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సొమ్ములివ్వకపోతే సొంత సోదరుడ్ని కూడా క్షమించని అధికారులు వారు. డబ్బుల కోసం స్వయంగా కోర్టును సైతం తప్పుదోవ పట్టించగల నేర్పరులు. ఈ కేసులో స్వయంగా జిల్లా కలెక్టర్‌ కూడా ఒక పార్టీ అని తెలిసి కూడా ఆయన్ను ఇందులో ఇరికించేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తమకు సొమ్ములిచ్చినవారికి ఉద్యోగాలిచ్చి, మిగిలినవారిని గాలిలో పెట్టేసి కోర్టు ముందు కలెక్టర్‌ను దోషిగా నిలబెట్టడానికి చేస్తున్న కుట్ర ఇది. కేవలం సొమ్ముల కోసమే జరుగుతున్న ఈ నాటకంలో ఏ రెండు స్టేట్‌మెంట్లకూ పొంతన ఉండటంలేదు. స్వయంగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఈ ఫైల్‌ను తెప్పించుకొని స్టడీ చేస్తున్నా అర్థంకాని మెటీరియల్‌ అందించి కోర్టు ధిక్కరణకు ఆయన్ను బాధ్యుడ్ని చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో సేవలందించడానికి 2020 మే 20న నిహాల్‌ అనే ఔట్‌సోర్సింగ్‌ సంస్థ ద్వారా 71 మంది మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్‌ (ఎంఎన్‌వో), ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్‌ (ఎఫ్‌ఎన్‌వో), స్వీపర్‌ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబరు 26న ఇదే నిహాల్‌ సంస్థ నుంచి పర్మినెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో మరో 31 మంది ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలను నియమించారు. ఇందులో తాత్కాలిక పద్ధతిలో నియమితులైనవారిని కోవిడ్‌ ముగిసిన తర్వాత విధుల నుంచి తప్పించేశారు. కానీ పర్మినెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో వచ్చిన 31 మందికి జిల్లాలో ఉన్న వివిధ పీహెచ్‌సీల్లో పోస్టింగ్‌ చూపిస్తూ కోవిడ్‌ కష్టకాలంలో జెమ్స్‌లో కొందరికి, గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో కొందరికి, పీహెచ్‌సీల్లో మరికొందర్ని కొనసాగించారు. ఎందుకంటే.. వీరు పర్మినెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది. వీరికి ఆప్కాస్‌ ద్వారా జీతాలు అందించాల్సి ఉంది. కానీ వీరి సేవలు 20 నెలలు వాడుకొని ఇప్పుడు గాలిలో పెట్టేశారు. తమను కొనసాగించాలని అప్పటి జిల్లా కలెక్టర్‌కు వీరు మొరపెట్టుకుంటే, వీరి నోటిఫికేషన్‌, అపాయింట్‌మెంట్‌ పద్ధతిని పరిశీలించిన కలెక్టర్‌ వీరిని ఏం చేయాలంటూ అప్పటి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. పీహెచ్‌సీల్లో ఉన్న ఖాళీల మేరకు వీరిని కొనసాగించవచ్చని కమిషనర్‌ సమాధానమిచ్చారు. కానీ ఈ లేఖ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి చేరక ముందే వీరి స్థానంలో సొమ్ములు ముట్టజెప్పినవారికి ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలుగా నియమించేశారు. దీంతో చేసేది లేక బాధితులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తే, వీరి వినతి మేరకు ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, ఆ తర్వాత ఇందుకు సంబంధించిన లోటుపాట్లు ఉంటే రిమార్కులు కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ ఈ ఆదేశాలను అమలుచేయకుండా రూ.2 లక్షలకు ఒక పోస్టును ఫిల్‌ చేసేశారు. ఇది అన్యాయమని, కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించాలని చూశారు. కానీ కంటెప్ట్‌కు వెళ్లకుండా ఉద్యోగాలిస్తామని ఆశ చూపించి, ఇన్నాళ్లూ వారి వెనుక తిప్పి, ఇప్పుడు ఉద్యోగాలు లేవని, అసలు ఈ 31 మందిని నియమించిన నోటిఫికేషనే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. వాస్తవానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇది కోర్టుకు సమర్పించి వీరు కంటెప్ట్‌ కేసు వేశారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ కూడా ఒక పార్టీగా ఉన్నారు.

అసలేం జరిగింది?

వీరికి ఉద్యోగాలిచ్చి నాలుగు వారాల్లో రిమార్క్‌లు సమర్పించాలని కోర్టు కోరితే, ఎటువంటి వివరాలు కోర్టుకు ఇవ్వలేదు సరికదా, జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫైల్‌లో వీరు నోటిఫికేషన్‌ ప్రకారం రాలేదని అబద్ధాలు చెప్పారు. కోవిడ్‌ సమయంలో మొదట ఇచ్చిన నోటిఫికేషన్‌లో 71 మందిని తీసుకున్నారు. ఆ తర్వాత 31 మందిని తీసుకున్నారు. ఇందులో 71 మందికి కోవిడ్‌ నిధుల నుంచి జీతాలు ఇవ్వాల్సి ఉండగా, 31 మందికి ఆప్కాస్‌ ద్వారా 010 సీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్‌ నుంచి జీతాలు రావాల్సి ఉంది. కానీ అప్పట్లో ఏవోగా పని చేసిన పక్కి చిట్టిబాబు, సూపరింటెండెంట్‌గా ప్రస్తుతం చేస్తున్న భాస్కర్‌ కుమార్‌కు మధ్య నిహాల్‌ ఔట్‌సోర్సింగ్‌ సంస్థ ఇచ్చిన సొమ్ముల పంపకంలో తేడా రావడంతో అందరికీ కోవిడ్‌ నిధుల నుంచే జీతాలు ఇచ్చారు. ఇప్పుడు కోవిడ్‌ లేదు, ఆ నిధులూ లేవు కాబట్టి వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టేనని సూపరింటెండెంట్‌ భాస్కర్‌ కుమార్‌ భావించారు. వాస్తవానికి వీరిది పర్మినెంట్‌ ఔట్‌సోర్సింగ్‌ నోటిఫికేషన్‌. ఇటీవల ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో రీ`డిప్లాయ్‌మెంట్‌ కోసం 143 జీవోను తీసుకువచ్చింది. దీని ప్రకారం ఒక పీహెచ్‌సీలో ఏయే కేడర్లలో ఎంతమంది సిబ్బంది ఉండాలనేది పేర్కొంది. అందులో ఒక పీహెచ్‌సీకి గరిష్టంగా 12 మంది ఉద్యోగులు ఉండాలి. ఇందులో ఎక్కడైతే తక్కువున్నారో, అటువంటి చోట్ల డబ్బులు తీసుకొని ఎంఎన్‌వోలను, ఎఫ్‌ఎన్‌వోలను నియమించేశారు. వాస్తవానికి రెండో నోటిఫికేషన్‌ ద్వారా వచ్చిన 31 మందినీ రీ`డిప్లాయ్‌మెంట్‌లో పీహెచ్‌సీలకు సర్దాలి. అలా కాకుండా సూపరింటెండెంట్‌కు సొమ్ములిచ్చనవారికి ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలుగా పీహెచ్‌లకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రెండో నోటిఫికేషన్‌ ద్వారా వచ్చిన ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు ఇప్పటికీ పని చేస్తున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం భాస్కర్‌కుమార్‌ వీరిని హోల్డ్‌లో పడేశారు. వాస్తవానికి వీరు కోవిడ్‌ వర్కర్లు కాదు. పీహెచ్‌సీల్లో తక్కువ స్టాఫ్‌ ఉండటం వల్ల ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకున్నవారు. కోవిడ్‌ వచ్చింది కాబట్టి వేర్వేరు చోట్ల సేవలందించారంతే. ఎప్పుడైతే బాధితులు కోర్టు కంటెంప్ట్‌కు వెళ్లారో, అసలు రెండోసారి నోటిఫికేషనే ఇవ్వలేదని దబాయించేస్తున్నారు. మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషనే వేలిడ్‌ అని, అందులో ఉన్నవారినందర్నీ కోవిడ్‌ తర్వాత తొలగించేశామని, వీరూ అందులో భాగమని చెబుతున్నారు. కానీ ఏం జరిగిందనేది అప్పుడు జిల్లా కలెక్టర్‌గా, ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌గా పని చేసిన నివాస్‌కు తెలుసు. వైద్య ఆరోగ్య శాఖలో వీరికి సంబంధించి ఏ ఒక్క ఫైలూ సరిగ్గా లేదు. ఉన్నవాటిని మాయం చేశారు. ఇప్పుడు కలెక్టర్‌ అడిగితే కొత్త కాగితాలు చూపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం సంబంధిత పత్రాలు అడిగితే, ఇవ్వడంలేదు. కానీ బాధితుల వద్ద ఇందుకు సంబంధించిన ప్రతీ పత్రం ఉందని, ఇప్పుడు ఫ్యాబ్రికేట్‌ చేసిన కాగితాలు కలెక్టర్‌కు చూపించి ఆయన్ను ఇందులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రయత్నాన్ని భాస్కర్‌ కుమార్‌ గుర్తించడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page