రెవెన్యూలో పోని పాత వాసనలు
ఉదయం ప్రారంభం కావాల్సిన సమీక్ష వాయిదా
సమగ్ర సమాచారంతో రాని అధికారులు
ఆగ్రహం వెలిబుచ్చిన కలెక్టర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం డివిజినల్ రెవెన్యూ అధికారుల తీరుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అలక బూనిన వైనం గురువారం చోటుచేసుకుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశానికి కలెక్టర్, జేసీ హాజరైనా రెవెన్యూ అధికారులెవరూ హాజరు కాలేదు. దీంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ మధ్యాహ్నం 2 గంటలకు వస్తానని, డివిజన్‌లో రెవెన్యూ అధికారులంతా హాజరైన తర్వాత మాత్రమే సమీక్ష నిర్వహిస్తానని చెప్పి వెళ్లిపోయారు. కలెక్టర్ వెళ్లిన గంట తర్వాత జేసీ ఫర్మాన్ ఆహ్మాద్ ఖాన్ వెళ్లిపోయారు. గడిచిన ఐదేళ్లలో ఇటువంటి సమావేశాలు లేకపోవడం, ఉన్నా తూతూ మంత్రంగా జరగడంతో రెవెన్యూ అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. కానీ పైనుంచి రెవెన్యూ క్లియరెన్స్‌ల కోసం కలెక్టర్ల మీద తీవ్ర ఒత్తిడి ఉంది. ఆమధ్య జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కూడా రెవెన్యూ సదస్సులపైనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేలో లోపాలున్నాయన్న ఫిర్యాదులతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్నింటి పరిష్కరించారు? కలెక్టర్, జేసీల పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలేమిటి? అన్నది చీఫ్ సెక్రటరీకి తెలియపర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సమీక్ష కోసం పిలుపునిస్తే దాన్ని లైట్‌గా తీసుకోవడం కలెక్టర్‌కు రుచించలేదు.
గురువారం ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, వీఆర్వోలతో సమీక్ష నిర్వహిస్తున్నట్టు బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి సమాచారం చేరవేశారు. బుధవారం విశాఖలో ప్రధాని మోడీ సమావేశానికి జన సమీకరణకు డివిజన్‌లోని వీఆర్వోలకే బాధ్యతలు అప్పగించారు. ఒక్కో వీఆర్వోకు వారి పరిధిలో ఒక బస్సును అప్పగించి అందులో మహిళలను మోడీ సభకు తరలించి తిరిగి ఇంటికి తీసుకువచ్చే వరకు వీఆర్వోలకే బాధ్యతలను అప్పగించారు. మోడీ విశాఖ సభ పూర్తయిన తర్వాత బస్సుల్లో తరలివెళ్లిన వారిని ఇంటికి తీసుకురావడానికి అర్ధరాత్రి 12 గంటలు దాటింది. వీరిని ఆయా మండల రెవెన్యూ అధికారులు మోనటరింగ్ చేసే బాధ్యతను ఉన్నతాధికారులు అప్పగించారు. దీంతో వీఆర్వోలు రెవెన్యూ సమీక్షకు సకాలంలో చేరుకోలేకపోయారు. ఇంతవరకు ఒక లెక్క. కానీ ఇప్పటి వరకు వచ్చిన గ్రీవెన్స్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని పరిష్కరించారన్న విషయాలు కలెక్టర్‌కు చెప్పేందుకు చాలామంది దగ్గర సమాధానాలు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహానికి ప్రధాన కారణం. దీంతో 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం నుంచి వెళ్లిపోయిన కలెక్టర్ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి రాత్రి 7.30 వరకు రెవెన్యూ సదస్సులు, అందులో వచ్చిన ప్రజాగ్రీవెన్స్‌లపై సమీక్షించారు.
సమీక్షలో రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, వీఆర్వోల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులు, సర్వే అంశాలకు సంబంధించి 24 అంశాలపై సమీక్షించాలని కలెక్టర్ భావించారు. కానీ వస్తున్న గ్రీవెన్స్ మీద రెవెన్యూ అధికారుల బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల కేవలం 8 అంశాలపైనే చర్చించారు. ఒక దశలో అందరినీ సస్పెండ్ చేస్తే మార్పు వస్తుందని, పనులు సక్రమంగా సాగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసర్వే జరిగిన గ్రామాల పరిధిలో అక్టోబర్‌లో రైతుల నుంచి తీసుకున్న గ్రీవెన్స్‌తో పాటు, డిసెంబర్ 6 నుంచి ఈ నెల 5 వరకు చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు ఆన్‌లైన్ చేయకపోవడంతో పాటు వాటికి పరిష్కారం చూపించడంలో మండల సర్వేయర్లు, వీఆర్వోల నిర్లక్ష్యంపై ఆగ్రహించారు. రెవెన్యూ సమీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డివిజన్ స్థాయిలో నిర్వహించడం రివాజు. అయితే గత కొన్నేళ్లుగా రెవెన్యూ సమీక్షలు జరగడం అరుదుగా మారిపోయింది. అందుకే కలెక్టర్ సమీక్షిస్తామన్నా ఆ సమావేశానికి సంబంధిత అధికారులు సకాలంలో హాజరుకాలేదు. వాస్తవానికి అజెండా ప్రకారం సమీక్షలో చర్చించాల్సిన అంశాలపై అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశిస్తారు. అలా ఆదేశించినా ఎవరూ పెద్దగా లెక్క చేయకుండా సకాలంలో సమీక్షకు హాజరు కాలేదు. కొందరు అధికారులు రెవెన్యూ సమీక్షకు పూర్తిస్థాయిలో సమాచారం తీసుకురాకుండా హాజరు కావడం అధికారుల బాధ్యాతారాహిత్యానికి నిదర్శనం. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై కలెక్టర్ మండిపడ్డారు.
` ఫొటో
Comments