కళా.. కలిశెట్టి.. ఇక కలిసికట్టు!
- ADMIN
- Mar 29, 2024
- 2 min read

ఎచ్చెర్ల బీజేపీకి పోయినా న్యాయం చేసిన బాబు
`కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ సీటు
`అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ సీటు
`కష్టపడేవారిని గుర్తిస్తామన్న సంకేతాలు
`ఈ ఎంపికతో మారనున్న సమీకరణాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఒకే వరలో రెండు కత్తులు ఇమడవంటారు. కానీ ఎచ్చెర్ల అనే ఒక వరలో చోటు కోసం ఒకే పార్టీకి చెందిన రెండు కత్తుల్లాంటి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఇంతకాలం పోటీ పడ్డారు. చివరికి పొత్తుల్లో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్ బీజేపీకి వెళ్లిపోవడంతో నిరాశకు గురైన ఆ ఇద్దరు నేతలకు టీడీపీ అధిష్టానం సమన్యాయం చేసింది. ఆ ఇద్దరు నేతలకు రెండు వరలు చూపించింది. తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కలిసి పనిచేసే వాతావరణం కల్పించింది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు, చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి కళా వెంకట్రావు పేర్లను ఖరారు చేస్తూ టీడీపీ శుక్రవారం తుది జాబితా విడుదల చేసింది. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం బీజేపీకిచ్చి జిల్లాలో టీడీపీ తప్పు చేసిందని భావించిన 24 గంటల్లోనే చంద్రబాబునాయుడు తన చతురత చూపించారు. పార్టీ కోసం ఎప్పట్నుంచో కష్టపడుతున్న అప్పలనాయుడును విజయనగరం పార్లమెంట్ స్థానానికి పంపడం ద్వారా బ్యాలెన్స్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణపై వ్యతిరేకత ఉన్నా అక్కడ టీడీపీకి ఇన్‌ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు సోదరుడి కుటుంబం దాన్ని క్యాష్ చేసుకోలేకపోతుందని భావించి నేరుగా కళా వెంకట్రావునే అక్కడకు పంపారు. కళా తన రాజకీయ అనుభవానికి పదును పెట్టి గ్రూపులు విడనాడి శక్తివంచన లేకుండా పని చేయగలిగితే చీపురుపల్లిలో ఆయన, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడు గెలవడం పెద్ద కష్టం కాదు. ఈ ఇద్దరు తూర్పుకాపు నేతలు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం కోసం గత కొంత కాలంగా ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు ఇద్దరికీ విజయనగరం జిల్లాతో ముడిపడి ఉన్న స్థానాలు కేటాయించడంతో ఒకరి కోసం మరొకరు పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.

సామాన్యుడికి సముచిత గుర్తింపు
కొన్ని స్థానాలు బీజేపీకీ, మరికొన్ని స్థానాలు జనసేనకు త్యాగం చేయాల్సి వచ్చినా పార్టీని నమ్ముకున్నవారిని, పార్టీ కోసం కష్టపడుతున్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమన్న ఆ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాటను మరోసారి నిలుపుకున్నారు. శ్రీకాకుళంలో గొండు శంకర్‌కు అసెంబ్లీ సీటు కేటాయించడం ఇందుకు మొదటి నిదర్శనమైతే, విజయనగరం ఎంపీ సీటును అప్పలనాయుడుకు కేటాయించడం మరో ఉదాహరణ. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి నడికుదిటి ఈశ్వరరావుకు ఇవ్వడం ద్వారా గొర్లె కిరణ్‌కుమార్‌కు టీ ఖర్చు కూడా లేకుండానే గెలుపు లభిస్తుందన్న వాదనపై ఇప్పుడు విమర్శకులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఎందుకంటే.. ఎచ్చెర్ల అసెంబ్లీ సీటుకు పోటీలో ఉంటానని మొదటి నుంచి భావిస్తున్న కలిశెట్టి ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. ఇప్పుడు ఎన్‌ఈఆర్ ఎవరు? ఆయన గుర్తేమిటి? అన్నది పక్కనపెట్టి అప్పలనాయుడు కోసం పనిచేసే క్యాడర్ సహజంగానే కూటమిలో అసెంబ్లీ అభ్యర్థికి కూడా మద్దతు తెలపాల్సిన పరిస్థితి. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శ్రీకాకుళం జిల్లా పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం, జి.సిగడాం, రణస్థలం మండలాలు ఉన్నాయి. ఇందులో జిల్లా విభజనలో రెండు మండలాలు అటు ఉన్నా, ఉమ్మడి జిల్లానే ఇప్పటికీ రాజకీయ సరిహద్దు కావడం, ఇక్కడ తూర్పుకాపు ఓటర్లు ఎక్కువగా ఉండటం అప్పలనాయుడుకు కలిసొచ్చే అంశం. సుదీర్ఘ కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి ఒక్క ఛాన్స్ అంటూ ఆస్తులమ్ముకొని పార్టీ కోసం తిరుగుతున్న అప్పలనాయుడును గుర్తించడం ద్వారా పార్టీ బలమైన సంకేతాలే ఇవ్వగలిగింది. ఇంతవరకు వైకాపా మాత్రమే సాధారణ మనుషులను నేతలుగా గుర్తించి టిక్కెట్లిచ్చిందని ప్రచారం జరుగుతున్న చోట రణస్థలంలో ఈనాడు విలేకరిగా పని చేసిన అప్పలనాయుడును టీడీపీ గుర్తించి ఏకంగా ఎంపీ టికెట్ ఇవ్వడం విశేషం. మరోవైపు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తాను కోరుకున్నట్టే భీమిలి నుంచి సీటు తెచ్చుకున్నారు.
Comments