సొంత సామాజికవర్గాన్ని బీసీల్లో చేర్చేందుకు పోరాటాలు
కోటబొమ్మాళిని టీడీపీ కంచుకోటగా మార్చడంలో కీలకపాత్ర
రాజకీయాల్లోనూ తనదైన విలక్షణ ముద్ర
రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నిక
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్ర కళింగవైశ్య సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన బోయిన గోవిందరాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నగరంలోని కళింగవైశ్య కల్యాణ మండపంలో కోణార్క్ శ్రీను అధ్యక్షతన జరిగిన కళింగకోమటి సంఘం విస్తృతస్థాయి సమావేశంలో నూతన అధ్యక్షుడిగా బోయినను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఇంతకాలం రెండు సంఘాలుగా ఉన్న కళింగవైశ్యులు ఆదివారం ఒక్కటిగా కలిసివచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళంతో పాటు విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మంది మండల, ప్రాంతీయ, జిల్లా సంఘాల ప్రతినిధులు గోవిందరాజులు అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. ఈ పదవికి పోటీ ఏర్పడినా గోవిందరాజులు సమర్ధత, సీనియారిటీ, నిబద్ధతను దృష్టిలో పెట్టుకొని ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కళింగకోమటి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన రాజకీయ జీవితం మొత్తం పోరాటమే. హరిశ్చంద్రపురం నియోజకవర్గం ఉన్నప్పుడు కేఏఎన్ భుక్త ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజుల్లో కోటబొమ్మాళి పీఏసీఎస్ అధ్యక్షుడిగా గోవిందరాజులు రాజకీయ రంగప్రవేశం చేశారు. తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేరాఫ్ అడ్రస్ అంటే బోయిన గోవిందరాజులు పేరే వినిపించేది. ఎర్రన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోటబొమ్మాళి మండల కేంద్రంలో పట్టు సాధించాలంటే బోయిన సోదరుల బలం పార్టీకి కలసిరావాలని భావించి గోవిందరాజులును టీడీపీలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత కోటబొమ్మాళి మేజర్ పంచాయతీకి గోవిందరాజులు ఒకసారి, ఆయన భార్య మరోసారి సర్పంచ్‌గా పని చేశారు. అంతక్రితం సర్పంచ్‌ల సంఘం జిల్లా కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు. టంకాల బాబ్జీ లాంటి ఉద్ధండుడు జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్న రోజుల్లో అదే సామాజికవర్గానికి చెందిన గోవిందరాజులుకు కార్యదర్శి పదవి ఇచ్చారంటే ఆయన సమర్ధతను అర్థం చేసుకోవచ్చు.

టీడీపీకి ఆయువుపట్టుగా..
మాజీ మున్సిపల్ చైర్మన్ అంధవరపు వరహానరసింహం సోదరిని గోవిందరాజులు వివాహం చేసుకున్న తర్వాత జిల్లాలోని రెండు డివిజన్లలో బావబావమరుదులు తెలుగుదేశం పార్టీకి మెరుగులు దిద్దారు. ఎర్రన్నాయుడుతో మొదలైన బంధం అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. అందులో భాగంగానే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన గోవిందరాజులుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి వరించింది. మొన్నటి ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. బోయిన గోవిందరాజులు జిల్లా కళింగకోమటి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కళింగకోమట్లను బీసీల్లో చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడితో సాన్నిహిత్యం ఉండటం వల్ల ఈసారి కళింగకోమట్లను ఓబీసీల్లో చేరుస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గతసారే బోయిన గోవిందరాజులుకు ఈ పదవి దక్కాల్సి ఉంది. వరం మరణించిన తర్వాత, ఆ స్థానంలో గోవిందరాజులు ఉంటే హుందాగా ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా కళింగకోమట్లు భావించారు. కానీ వైకాపా అధికారంలో ఉండటం వల్ల కోణార్క్ శ్రీనుకు ఆ పదవి కట్టబెట్టారు. కోటబొమ్మాళిలో టీడీపీకి మినిమమ్ ఓట్లు రాని రోజుల నుంచి బోయిన బ్రదర్స్ చేరిన తర్వాత ఇప్పుడు అత్యధిక మెజార్టీ సాధించగలిగే స్థాయి రావడానికి ప్రధాన కారకుడు బోయిన గోవిందరాజులే.
Comments