డీసీసీబీ అడుగుతున్న బాబ్జీ
తూర్పుకాపు కార్పొరేషన్‌కు 56 దరఖాస్తులు
సుడా కావాలని పట్టుపడుతున్న బీజేపీ
నియోజకవర్గానికి రెండు చొప్పున డైరెక్టర్ పోస్టుల భర్తీ
మంగళవారం నాటికి టీటీడీ చైర్మన్ ఖరారు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆమదాలవలసకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు మొదలవలస రమేష్ పేరును ఖరారు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. రాష్ట్రంలో 20 ప్రధాన కార్పొరేషన్లకు కొద్ది రోజుల క్రితం చైర్మన్లను, కొందరు డైరెక్టర్లను నియమించిన విషయం విదితమే. ఇది కాకుండా 72 కుల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇందులో భాగంగానే కళింగ కార్పొరేషన్‌ను మొదలవలస రమేష్‌కు ఇస్తున్నట్టు భోగట్టా. మొన్నటికి మొన్న నియమించిన రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ శుక్రవారం అమరావతిలో బాధ్యతలు స్వీకరించారు. వీటిని తాత్కాలికంగా జిల్లాకు ఇద్దరు చొప్పున డైరెక్టర్లను నియమించారు. కార్పొరేషన్ సైజ్‌ను బట్టి 10 మంది, గరిష్టంగా 14 మంది డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది. ఇప్పుడు నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున డైరెక్టర్లను నియమించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ఓ శిష్టకరణ సంఘ నాయకుడికి గురువారం ఫోనొచ్చింది. ఈ కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా నియమించడానికి ఎమ్మెల్యే నుంచి సిఫార్సు లేఖ వచ్చిందంటూ ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా మాదిరిగా కుల కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వదిలేయకుండా వాటికి విధి విధానాలను ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌కు కూడా గౌరవ వేతనం ఇచ్చే విధంగా నిబంధలను తయారుచేసినట్టు భోగట్టా. ఉత్తరాంధ్రలో మాత్రమే ఉండే బీసీ తూర్పుకాపు కార్పొరేషన్ కోసం జిల్లా నుంచి విపరీతమైన పోటీ ఉంది. మరే కార్పొరేషన్‌కూ లేని విధంగా ఇక్కడ ఒక్క టీడీపీ నుంచే 56 దరఖాస్తులు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లాయి. ఇదే సమయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కాపులకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆయన పార్టీకి చెందినవారికే ఈ పదవి ఇవ్వాలన్న డిమాండ్ కూడా జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. ఇక్కడ కాళింగులు, వెలమలతో సమానంగా కాపులు ఉండటం వల్ల గతంలో తూర్పుకాపు, వెలమ, కాళింగ కార్పొరేషన్ చైర్మన్లను వైకాపా ఈ జిల్లాకే ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇక్కడే ఇస్తారని తెలుస్తుంది. ఇకపోతే జిల్లా సెంట్రల్ బ్యాంకు చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించాలని జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కోరుతున్నారు. ఎర్రన్నాయుడు రాజకీయాలు చేసిన కాలం నుంచి ఆ కుటుంబంతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్న చౌదరి బాబ్జీ ఈ పదవిపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈమేరకు రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అయితే కుల సమీకరణాల రీత్యా ఇచ్ఛాపురంలో ఉన్న మేజర్ సామాజికవర్గానికి ఈ పోస్టు వెళ్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. చౌదరి బాబ్జీకి ఈ పదవి దక్కకపోతే ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి ఇస్తారని చెబుతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని గత ఎన్నికల్లో నిలిపారు. అయితే బాబ్జీ మాత్రం కేబినెట్ హోదా కలిగిన జిల్లాపరిషత్ చైర్మన్ పోస్టు చేసినందున డీసీసీబీ తనకు సబబుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. కాకపోతే బాబ్జీ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందడం వల్ల శ్రీకాకుళం ఎంపీ సెగ్మెంట్‌లో అది లేకపోవడం పార్టీ వర్గాలు కొంత ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఎన్నికల ముందు పలాస నియోజకవర్గంలో టీడీపీ పిలుపు మేరకు టీడీపీలోకి వచ్చిన కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్‌ను కూడా ఈ పోస్టుల్లో అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. తన సోదరుడు వైకాపా ఎమ్మెల్సీగా ఉంటూ టెక్కలి అసెంబ్లీ బరిలో నిల్చున్నప్పటికీ ఆయన పలాసలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష గెలుపు కోసం పని చేశారు. అచ్చెన్నాయుడు సమక్షంలో పార్టీలో చేరినప్పుడే ఆయనకు నామినేటెడ్ పోస్టు ఇస్తారన్న అభయం వచ్చిందని పలాసలో అప్పట్లో చెప్పుకున్నారు. దువ్వాడ శ్రీకాంత్ పార్టీ వీడకుండా చూడాలని జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ శ్రీనుకు సూచించినప్పుడు కూడా ఆయన ఇదే మాట జగన్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే పలాస నగరానికి చెందిన వజ్జ బాబూరావుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడంతో దువ్వాడ శ్రీకాంత్‌ను ఎక్కడ కూర్చోబెడతారన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు డీసీఎంఎస్ కూడా కీలకమైన పోస్టే. దీనిని శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన నేతతో భర్తీ చేస్తారని భోగట్టా. మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులు పొత్తు ధర్మాన్ని ఏ మేరకు పాటించారో తెలియదు గానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో మాత్రం వైకాపా నుంచి బీజేపీలోకి వచ్చిన పైడి రాజారావు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ కోసం శక్తివంచన లేకుండా పని చేశారు. ధర్మాన ప్రసాదరావుకు అత్యంత దగ్గర కోటరీలో ఉంటూ కూడా దాన్ని కాదనుకొని వైకాపా మీద విరుచుకుపడ్డారు. అప్పటి వరకు తలో దిక్కుగా ఉన్న బీజేపీ నేతలంతా రాజారావు దూకుడుతో టీడీపీ కోసం గట్టిగా పని చేశారు. ఇప్పుడు అదే రాజారావుకు సుడా చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును కూడా ఆ పార్టీ నేతలు కలిశారు. ఆయన సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు. అయితే ఇదే పోస్టు కోసం టీడీపీలో ఉన్న జామి భీమశంకర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే.. వైకాపా హయాంలో సుడా చైర్మన్‌గా ఆయన సామాజికవర్గానికే చెందిన కోరాడ చంద్రభూషణ గుప్త భార్య పని చేయడంతో ఈసారి తనకూ కావాలని ఆయన కోరుతున్నారు. అయితే జామి భీమశంకర్‌కు సుడా చైర్మన్ పోస్టు కాకపోతే వర్సిటీ పాలకమండలి సభ్యుడిగా కూడా నియమించే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈయన విద్యాసంస్థలను నడుపుతున్నారు, గతంలో ఏయూ సిండికేట్ మెంబర్‌గా పని చేశారు. గడిచిన ఎన్నికల్లో అనేక మంది టీడీపీ నాయకులతో పోల్చుకుంటే బీజేపీ నాయకుడు పైడి రాజారావు పడిన కష్టమే ఎక్కువ. అయితే బీజేపీది జాతీయ విధానం కాబట్టి జిల్లాలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసినప్పుడు తమకు ఫలానా పోస్టు ఇవ్వాలి అని డిమాండ్ చేసే రాష్ట్రస్థాయి నాయకులు లేకపోవడమే ఇక్కడ మైనస్. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చాలామంది సుడా పీవో దగ్గర్నుంచి చైర్మన్ దగ్గర వరకు తమ మనుషుల్ని నియమించాలంటూ స్థానిక ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో గతంలో వైకాపాకు పని చేసిన రియల్టర్లు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుత నిబంధనల ప్రకారం సుడా అప్రూవల్ లేని లేఅవుట్లలో ప్లాట్లను విక్రయించడానికి ప్రభుత్వం అనుమతించడంలేదు. అటువంటి లేఅవుట్లు ఉంటే అక్కడ బోర్డులు పెట్టి మరీ కొనుగోలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. కానీ ఇంతకు క్రితమే అనేకమంది పంచాయతీ అప్రూవల్‌తో లేఅవుట్లు వేసి అడ్వాన్సులు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు వాటన్నింటికి క్లియరెన్స్ రావాలంటే సుడా చైర్మన్‌గా తమవాడు ఉండాలని పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. టీటీడీ చైర్మన్‌గా ఎవర్ని నియమించాలన్న దానిపై శుక్రవారం సాయంత్రానికి ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా నాలుగు కులాలను పరిగణలోకి తీసుకున్నారు. క్షత్రియులకు ఇవ్వాలంటే రఘురామ కృష్ణంరాజుకు, రెడ్లకు ఇవ్వాలంటే అమర్నాథ్‌రెడ్డికి, కమ్మవారికి ఇవ్వాలంటే విజయవాడకు చెందిన మరో వ్యక్తి పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఆధ్యాత్మిక భావన కలిగి, అవసరమైతే టీటీడీ కోసం తన సొంత సొమ్మును ఖర్చుపెట్టే ఆధ్యాత్మికవేత్త ఉండాలని కోరుకుంటున్నారట. ఇదే ఖరారైతే చిత్తూరుకు చెందిన మరో నేతకు టీటీడీ చైర్మన్ పదవి దక్కవచ్చు. టీటీడీ బోర్డు మెంబరుగా కూన రవిని నియమిస్తామన్న సంకేతాలు పంపినా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు భోగట్టా. ఆమదాలవలసలో ఉంటూ బోర్డుకు న్యాయం చేయలేనని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మరో మూడు రోజుల్లో జిల్లాలో ప్రధాన పదవులు భర్తీ కానున్నాయి.
Comments