కళ్లముందే ఉన్నా కనిపించని ప్రాణం
- Prasad Satyam
- Jul 17
- 2 min read
లిఫ్ట్‌పై ఆరుగంటలు మృత్యుపోరాటం
రక్తం చూసి గ్రీజ్ అనుకున్నారు
కట్ట బాబు మరణంలో విషాద కోణం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
లిఫ్ట్ వచ్చిందనుకొని షట్టర్ తెరిచి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌రూమ్ టాప్ మీద పడి మరణించిన కట్ట బాబు ఘటన జరిగిన ఆరు గంట వరకు ప్రాణాలతోనే ఉన్నారని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. తన భర్త వ్యాపార లావాదేవీలు చూసుకొని ఏదో ఒక సమయంలో వచ్చి టిఫిన్ చేస్తారని డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసిన కట్ట బాబు భార్య గురువారం ఉదయం 5 గంటలకు లేచి చూసేసరికి గదిలో కట్ట బాబు లేకపోవడంతో ఆయన ఫోన్‌కు ప్రయత్నించారు. అయితే పైనుంచి కిందకు పడటం వల్ల ఆయన జేబులో ఉన్న రెండు ఫోన్లు కూడా పగిలిపోయి స్విఛాఫ్ అయిపోయాయి. దీంతో ఎక్కడికో వెళ్లారనుకున్నారు.
వాస్తవానికి కట్ట బాబు ఆయన మిత్రులతో కలిసి శనివారం బాలీకి పయనమయ్యారు. అక్కడ రూపాయి మారకం కుదరదు కాబట్టి ఆయన మిత్రుడు శిమ్మ రాజశేఖర్ డ్రైవర్‌తో డాలర్లను కట్ట బాబు ఇంటికి పంపించారు. అప్పటికే దిగువున ప్రహరీకి ఆనుకొని ఉన్న కట్ట బాబు ఆఫీసు గదిలో ఆయన మిత్రుడు ఆడిటర్ ఒకరు కట్ట బాబు కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన్ను కలవడానికి కట్ట బాబు రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంటి నుంచి లిఫ్ట్ కోసం బటన్ నొక్కారు. అది రాకపోవడంతో తాళం చెవితో తెరిచే ప్రయత్నం చేశారు. అందులో షట్టర్ మాత్రమే ఓపెనైంది కానీ, లిఫ్ట్ రూమ్ మాత్రం పైకి రాలేదు. అది గమనించని కట్ట బాబు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్ పైభాగంలో పడి అపస్మారకంలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలియని కుటుంబ సభ్యులు, పనివారు ఆయన ఎక్కడికో వెళ్లుంటారని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఉదయం కట్టబాబు ఇంటికి వచ్చిన డ్రైవర్ రెండుసార్లు లిఫ్ట్‌ను వాడారు కానీ దానిపైన కట్ట బాబు మరణించి ఉండటాన్ని గమనించలేకపోయారు. కట్టబాబు ఎంతకీ రాకపోవడంతో ఆయన సోదరుడికి కుమారుడు భవాని ఆరా తీస్తున్న సమయంలోనే లిఫ్ట్ పైనుంచి నల్లగా గ్రీజ్ కారుతుందని తుడుస్తున్న పనివాడ్ని గమనించిన భవాని అక్కడ కట్ట బాబు మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. ఆయన ఒంటినుంచి కారుతున్న రక్తం లిఫ్ట్‌పైకి రావడంతో దాన్ని గ్రీజుగా భావించినట్టు అర్థమవుతుంది. బుధవారం సాయంత్రం పైఅంతస్తు నుంచి లిఫ్ట్ మీద పడినప్ప్పుడు పెద్ద చప్ప్పుడు కావడాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న వారణాశి మాధవ గమనించడం సీసీ ఫుటేజ్‌లో రికార్డయింది. అయితే ఏ లిఫ్ట్ వైపు నుంచి సౌండ్ వచ్చిందో ఆ లిఫ్ట్‌లో ఎవరూ లేకపోవడంతో మరేదో అనుకొని విడిచిపెట్టేశారు. అలాగే కట్ట బాబు కోసం ఆయన ఆఫీసులో వెయిట్ చేసిన ఆడిటర్ ఆయన ఎంతకీ రాకపోవడంతో ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ లేదా నాట్ రీచబుల్ అని చెప్పడంతో వెనక్కు వెళ్లిపోయారు. వీరిలో ఏ ఒక్కరు ముందుగా చూసినా కట్ట బాబు బతికే ఛాన్స్ ఉందని డాక్టర్లు పేర్కొన్నట్లు సమాచారం. ఒకసారి బైపాస్ సర్జరీ, మరోసారి స్టంట్లు వేయించుకున్న కట్ట బాబు ఈ విధంగా ఇంటిలోనే మరణించడాన్ని నగరంలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.






Comments