top of page

కశ్మీర్‌లో పెరిగిన పోలింగ్‌

Writer: DUPPALA RAVIKUMARDUPPALA RAVIKUMAR
  • మూడు దశల్లో జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు.. మొదటి దశ పూర్తి

  • బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ

  • మొదటి దశ పోలింగ్‌ పూర్తయ్యాక మాటల దూకుడు పెంచిన ప్రధాని

ఈ బుధవారం కశ్మీర్‌లోయలో జరిగిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా తొలగిన తర్వాత, దాదాపు దశాబ్ద కాలానికి ఈ లోయలో జరుగుతున్న ఎన్నికలపై కేవలం మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతటా ఆసక్తి నెలకొంది. మొత్తం 23 లక్షల మంది ఓటర్లు, 90 అసెంబ్లీ స్థానాలకు పోటీపడుతోన్న 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 90 మంది ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నవారే కావడం విశేషం. 2013లో జరిగిన ఎన్నికలలో ఈ రాష్ట్ర శాసనసభలో 83 అసెంబ్లీ నియోజక వర్గాలుండేవి. అయితే రాజ్యాంగంలో ప్రతిపాదించిన ఆర్టికల్‌ 370 స్వయంప్రతిపత్తి హోదా ఉపసంహరించుకున్నాక, కేంద్ర ప్రభుత్వం నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరిపింది. దాంతో జమ్ములో 43 స్థానాలు, కశ్మీర్‌లో 47 స్థానాలు కలిపి మొత్తం 90 స్థానాలు ఖరారు చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ 90 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరపడానికి భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. షెడ్యూల్‌ ప్రకారం మొదటి దశ పోలింగ్‌ సెప్టెంబర్‌ 18న జరిగింది. మిగిలిన రెండు దశలు సెప్టెంబరు 25, అక్టోబరు 1న జరగనున్నాయి. అయితే మొదటి దశ పోలింగ్‌లో ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారని ఎవరూ ఊహించలేదు.

హెచ్చరికలు బేఖాతరు - తరలివచ్చిన ప్రజలు

అనేక అతివాద సంస్థలు అక్కడ ఎన్నికలకు వ్యతిరేకంగా మాట్లాడాయి. ఓటింగ్‌లో పాల్గొనవద్దని తమ ప్రజలను నిరుత్సాహపరిచాయి. వాటిని బేఖాతరు చేస్తూ మొదటి దశ పోలింగ్‌లో చెనాబ్‌ లోయ ప్రాంతంలో దోడా, కిస్త్‌వార్‌, రంబానా జిల్లాలలో పాటు, దక్షిణ కశ్మీరంలో అనంతనాగ్‌, పుల్వామా, కుల్గామ్‌, సోపియన్‌ జిల్లాల్లో మొత్తం 24 శాసనసభ నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరిగింది. రెండవ దశలో 26 స్థానాలకు, మూడవ దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా కనిపించినప్పటికీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కాంగ్రెస్‌తో జట్టు కట్టడం ద్వారా ఈసారి ఎన్నికలలో ముందంజలో ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఇదివరలో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో మద్దతుగా నిలబడిన యువతరం కూడా ఈసారి పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారు ఎవరికి ఓటు వేస్తారన్న దానిబట్టి గెలుపోటములు నిర్ణయమవుతాయి. ఈసారి ఓటర్లు కరెంటు, రోడ్లు, మంచినీటి (బిజ్లీ, సడక్‌ ఔర్‌ పానీ)కే ప్రాధాన్యం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమస్యలు పరిష్కరించగల పార్టీలకే తాము ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఎన్నికల ముందు జరిపిన సర్వేలలో తేల్చిచెప్పారు. వీటితో పాటు వారికి లోయలో నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తోందని, కొన్ని సంస్థలు దుర్మార్గంగా మత్తుమందుకు అలవాటు చేసి, యువతరాన్ని బలి తీసుకుంటున్నాయని సీనియర్‌ ఓటర్లు ఆవేదన చెందుతున్నారు.

2019 నుంచి ఆ రాష్ట్ర శాసనసభలో ఎలాంటి చర్చలు జరగలేదనే చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికారంలోకి రానున్న నూతన ప్రభుత్వం, కశ్మీర్‌ శాసనసభలో ప్రజల సమస్యలను చర్చకు తెస్తుందని, ఆ విధంగా తమ మనోభావాలు ప్రపంచానికి తెలియజేయవచ్చని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆశతోనే తాము ఓటుహక్కును వినియోగించుకున్నట్టు టీవీల ముందు పెద్ద ఎత్తున ఓటర్లు చెప్పడం విశేషం. అనేక భయాలను, ఆందోళనలను పక్కనపెట్టి ఇంత భారీ సంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకోవడానికి ప్రజలు బారులు తీరి నిలబడడానికి మరొక ముఖ్య కారణం జమ్ము కశ్మీర్‌లపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల తమ అభిప్రాయాలను చెప్పడానికేనంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ అంగీకారాన్ని లేదా నిరసనను చట్టబద్దంగా తెలియజేయడానికి ఓటింగ్‌ తోడ్పడుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో 58.46 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఇప్పుడు జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో 59 శాతం ఓటింగ్‌ జరగడం మనం గమనించాలి.

కలగాపులగంగా ఎన్నికల పొత్తులు

ఇక ఎన్నికల బరిలోకి దిగిన రాజకీయ పార్టీలను పరిశీలిస్తే, అనుకూలతకూ వ్యతిరేకతకూ కేంద్రంగా భారతీయ జనతా పార్టీయే ఉండడం విశేషం. జమ్ములో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉండడం బీజేపీకి ప్లస్‌ పాయింట్‌ కాగా, కశ్మీర్‌ లోయలో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత సహజం. ఎన్నికల్లో పోటీచేసిన అనేక పార్టీలు తమ మేనిఫెస్టోలను ఇటు బీజేపీ విధానాలను అనుసరించడమో, అటు వాటిని వ్యతిరేకించడమో చేయడం వల్లన బీజేపీ సెంటర్‌ స్టేజిని ఆక్రమించింది. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే సరళి కనిపించింది. బీజేపీని నెత్తికెత్తికోవడమో లేదా నేలదోయడమో అన్ని పార్టీలకు తప్పనిసరైంది. దీనినుంచి చివరకు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ కూడా అతీతం కాలేకపోయింది. కాంగ్రెస్‌ పార్టీ ఈసారి నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పొత్తు కుదుర్చుకోవడం, భారత్‌ జోడో యాత్ర తర్వాత లోయలో రాహుల్‌ గాంధీ ఇమేజ్‌ పెరగడం, మొన్నటి ఎన్నికలతో కాంగ్రెస్‌ పార్టీ పట్ల బీజేపీ వ్యతిరేకులలో కొత్త ఆశలు చిగురించడం మొదలైనవి కాంగ్రెస్‌ పార్టీకి కలిసివచ్చే అంశాలు.

ఈసారి ఎన్నికల్లో కొన్ని నిషేధిత సంస్థల ప్రతినిధులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం విశేషం. వేర్పాటువాదాన్ని తలకెత్తుకుని ప్రచారం చేసిన జమాత్‌`ఎ`ఇస్లామి స్వతంత్ర అభ్యర్థులను చాలా నియోజకవర్గాల్లో నిలబెట్టింది. ఈ సంస్థ 2019లో నిషేధానికి గురైంది. ఈ సంస్థ నుంచే హురియత్‌ కాన్ఫరెన్స్‌ లాంటి వేర్పాటువాద గ్రూపులు, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ లాంటి మిలిటెంట్‌ విభాగాలు ఏర్పడుతున్నాయని అప్పటి ప్రభుత్వం ఆరోపించింది. అయితే జమాతె ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆ సంస్థ ప్రధాన ప్రచారకర్త సయ్యద్‌ అలీ షా జీలాని మరణించక ముందు ఎన్నికల్లో నిలబడ్డాడు. బారాముల్లా నియోజకవర్గ ఎంపీ ఇంజనీర్‌ రషీద్‌ చివరి నిమిషంలో గందరగోళ పొత్తులు ఏర్పరచుకున్నాడు. రషీద్‌ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ నేత ఒమర్‌ అబ్దుల్లాను ఓడిరచాడు. దాంతో ఈ ఎన్నికల్లో రషీద్‌పై బీజేపీ తొత్తు అన్న ముద్ర పడిరది. అందువల్ల జమ్ములో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమాక్రటిక్‌ పార్టీలపై దీని ప్రభావం పడనుంది. ఏది ఏమైనా 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, ఎన్‌సి`కాంగ్రెస్‌ పార్టీల నడుమ మాత్రమే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • - దుప్పల రవికుమార్‌


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page