
టెక్కలిని హోల్డ్‌లో పెట్టిన కాంగ్రెస్
కిల్లి విక్రాంత్ పోటీపై సంప్రదింపులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోతున్నారు. దీనిపై ఆమె అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయకపోయినా మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినా, టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానాన్ని కృపారాణి కుటుంబ సభ్యులకు ఇస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. గత కొంతకాలంగా వైకాపాలో ఎటువంటి గుర్తింపునకు నోచుకోని కిల్లి కృపారాణి ఈ ఎన్నికల్లోనైనా వైకాపా తన సేవలను వినియోగించుకుంటుందని భావించారు. కానీ ఆ పార్టీ నుంచి ఎటువంటి సంకేతాలూ లేకపోవడంతో ఆమె మళ్లీ తన సొంత గూటికే వెళ్లిపోడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆమె పెద్ద కుమారుడు కిల్లి విక్రాంత్‌ను టెక్కలి బరిలో నిలపడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆమె అనుచరులు వైకాపాలో జరిగిన అవమానాలు ఇక చాలని, పార్టీ మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు శ్రీకాకుళంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ టిక్కెట్లు ప్రకటించి, టెక్కలిని మాత్రం హోల్డ్‌లో పెట్టడం చూస్తుంటే ఆమె పార్టీ మారడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూరింది.
కాంగ్రెస్ జాబితా విడుదల
కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్ధుల తొలి జాబితాను మంగళవారం ఢల్లీిలో ప్రకటించింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అసెంబ్లీని మినహాయించి మిగతా తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇచ్ఛాపురం మాసుపత్రి చక్రవర్తిరెడ్డి పేరును ప్రకటించారు. పలాస నుంచి మజ్జి త్రినాధబాబు, పాతపట్నం నుంచి కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం నుంచి పైడి నాగభూషణరావు, ఆమదాలవలస నుంచి సనపల అన్నాజీరావు, ఎచ్చెర్ల నుంచి కరిమజ్జి మల్లేశ్వరరావు, నరసన్నపేట నుంచి మంత్రి నరసింహమూర్తి, రాజాం(ఎస్సీ), పాలకొండ(ఎస్టీ) సవర చంటిబాబు పేర్లను ప్రకటించారు. మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్ధిగా పేరాడ పరమేశ్వరావును ఇప్పటికే ఖరారు చేసింది. పలాస అభ్యర్థిగా ప్రకటించిన మజ్జి త్రినాథరావు వైకాపా ఎంపీ టికెట్‌ను ఆశించి భంగపడి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఇటీవల చేరారు. మిగతా వారంతా కాంగ్రెస్‌వాదులుగా మొదటి నుంచి జిల్లాలో కొనసాగుతున్నారు.
Comments