(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆ పదవి నుంచి తప్పిస్తే మంచిదినే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతుంది. ఎస్సీ మైనార్టీ దళితుల ఓట్ల వల్ల గతంలో ఆ పార్టీకి కొంత ఓటింగ్ పెరిగిన మాట వాస్తవం. అయితే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీది కాదు. జగన్ బీజేపీ మద్దతుదారుడనే కోణం ఓట్లేశారు తప్ప, కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. మరీ ముఖ్యంగా షర్మిల వల్ల ఓటింగ్ పెరగలేదు. జగన్ మీద కోపంతో టీడీపీకి ఓటు వేయలేనివారు కాంగ్రెస్‌కు ఓటేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఆమె జగన్ మీద ధ్వేషంతో పార్టీని నడుపుతున్నారు తప్ప పార్టీ ప్రయోజనాల కోసం కాదనేది చాలామంది కాంగ్రెస్ నాయకుల భావన. 2029లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉందనే పాజిటివ్ టాక్ వస్తున్నందున రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడటం అత్యావశ్యం. కారణాలేవైనా ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవికి ఒక సమర్ధుడైన రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు కలిగిన నాయకుడే కరువయ్యాడు. ఇదివరకు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే పదవి కోసం వైకాపాలోకి వెళ్లి ఒకసారి ఎమ్మెల్యే కాగలిగారు. రెండోసారి అది కాస్తా జగన్ వ్యతిరేక గాలిలో ఎగిరిపోయింది. చక్కటి వాగ్ధాటి, గొప్ప రీజనింగ్ ఉన్నాయనుకున్న ధర్మాన ప్రసాదరావు కూడా ఈ ఎమ్మెల్యే పదవి కోసం జగన్ కాళ్ల దగ్గర సాగిలపడిపోయి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు. మరింత గొప్ప వాగ్దాటి ఉండి సహేతుకమైన వ్యాఖ్యలత జగన్‌ను ఆకట్టుకోగలిగిన ఉండవిల్లి అరుణ్‌కుమార్ తన వారాంతపు ప్రెస్‌మీట్లతో జగన్ జ్ఞాపకాల్లో అయితే ఉండగలిగారు కానీ, ఆయన దగ్గర రాష్ట్రస్థాయి నాయకత్వాన్ని అందించగలిగిన సాధన సంపత్తి లేదు. పైగా రాష్ట్రస్థాయిలో నాయకత్వం వహించాలనే కసి కూడా అతనికి ఉండదు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టగానే తనను పార్టీ నుంచి వాళ్లే సస్పెండ్ చేశారన్న కారణం చూపించి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తనను రెండుసార్లు ప్రజల మధ్యనుంచి పార్లమెంట్‌కు పంపిన పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపించాల్సిన పద్ధతిలో ఆయన లేరు. అనంతపురం నుంచి వచ్చిన రఘువీరారెడ్డి గానీ, ఆ తర్వాత వచ్చిన శైలజానాథ్ గానీ స్టేట్ లెవల్‌లో జనాన్ని ప్రభావితం చేసే నాయకులు కారు. ఇక రాజమండ్రి నుంచి బయల్దేరి అమలాపురం పార్లమెంట్ సీటు నుంచి రెండుసార్లు ఎన్నికైన జీవీ హర్షకుమార్ తనకు తాను అతిగా ఫీలవడం తప్ప పార్టీ పట్ల, అధినాయకత్వం పట్ల విశ్వాసం కలిగినవారు కాదు. పీసీసీ ప్రెసిడెంట్‌గా తనను కాదని గిడుగు రుద్రరాజుకు ఇచ్చారని రాహుల్ గాంధీనే విమర్శించారు. ఇక పైసా పెట్టుబడి లేకుండా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు కేవలం సోనియా దయ వల్ల మూడేళ్లుగా ముఖ్యమంత్రిగా వెలగబెట్టి, ఆపై నిస్సిగ్గుగా బీజేపీలోకి వెళ్లిపోయి కూటమి ప్రచండ గాలుల్లో కూడా తన సీటును గెలుచుకోలేకపోయిన కిరణ్‌కుమార్ రెడ్డి కోసం అసలు చెప్పుకోనక్కర్లేదు. ఇక తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ పనవ్వక, ఎటూ పోయే దిక్కులేక షర్మిల ఇప్పుడు మిగిలిన కాంగ్రెస్‌కే నాయకత్వం వహిస్తున్నారనుకుంటే అంతకు ముందు కాంగ్రెస్ నాయకత్వం పట్ల ఆడిన టెంపరి మాటలు విన్నాక ఆమెపట్ల సాధారణ కాంగ్రెస్ సానుభూతిపరులకు ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు. పైగా సీబీఐ కేసుల్లో ఇరుక్కుపోయిన అవినీతి సంపద అని చెప్పుకుంటున్నదాన్ని పంచుకోవడంలో అన్నాచెల్లెళ్ల సమస్య రాష్ట్రస్థాయి న్యూసెన్స్‌గా ఉంది. అలాంటి సొంత గొడవల్లో ఇరుక్కుపోయిన మనిషి పీసీసీ అధ్యక్షురాలు కావడం సరికాదేమోనన్న భావన చాలామందిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా పరిచయమున్న నాయకుడు గానీ, జీరో నుంచి మొదలుపెట్టి రాష్ట్రాన్నంతా చుట్టేసి రాగలిగిన వాగ్దాటి కలిగిన వ్యక్తి గాని ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. కానీ అలాంటి నాయకత్వం కనుచూపు మేరలో కనిపించడంలేదు. రాష్ట్రంలో ఇతర పార్టీలకు అలాంటి నాయకత్వం ఉందా అంటే.. నాయకుడిగా ముద్రపడిన తర్వాత వాళ్లకు స్ట్రేచర్ పెరగడం తప్ప నిజానికి వారు కూడా అతి సామాన్య మనుషులే. కాంగ్రెస్ అంటే రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్రప్రదేశ్‌ను చంపేసిన పార్టీ అంటూ ఒక గొప్ప ముద్ర వాళ్లే వేయించుకున్నారు. అలాంటి అపప్రదను ప్రయత్నంకొద్దీ పొందగలిగిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. అదే దాని విశిష్టత. ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిలను పార్టీ స్థానం నుంచి తప్పిస్తే, ఆ పదవిని ఎవరికి ఇవ్వాలో తెలియని అయోమయంలో అధినాయకత్వం ఉంటే, అలాంటి పదవిని తీసుకునే నిబద్ధత కలిగిన నాయకుడు ఒక్కడూ లేకుండాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మౌత్‌పీస్‌గా తిరిగి పార్టీని మార్చగలిగిన ఆ గొప్ప శక్తిమంతుడు ఎవరో కనుచూపుమేరలో కనిపించడంలేదు. ఇతర పార్టీల వైపు చూడనివాడు, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత కలిగినవాడు, నష్టాలు ఎదురైనా తట్టుకోగలిగినవాడు నేడు కాంగ్రెస్‌కు అవసరం.
Comments