పేడాడ పరమేశ్వరరావుపై ఫిర్యాదు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమని మరోసారి రుజువైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైన అంబటి కృష్ణ పాత అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు మీద రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం దీనికి తాజా ఉదాహరణ. ఈ నెల 10న ఉదయం 8 గంటలకు పరమేశ్వరరావు బాధ్యతలు అంబటి కృష్ణకు అప్పగించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో ఫర్నిచర్, ఏసీలు, టీవీ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయి. అయితే అక్కడికి రెండు రోజుల తర్వాత డీసీసీ కార్యాలయాన్ని పేడాడ పరమేశ్వరరావు తగులబెట్టేశారంటూ కొత్త అధ్యక్షుడు కృష్ణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పోలీసుల ద్వారా సమాచారమందుకున్న కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఫిర్యాదు విషయమై కొత్త అధ్యక్షుడు కృష్ణతో మాట్లాడారు. దీంతో చేసేదిలేక షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్న విషయం తనకూ తెలుసని, కాకపోతే అధిష్టానం నుంచి పరమేశ్వరరావు మీద ఫిర్యాదు చేయాలని ఆదేశాలు రావడంతోనే ఆ మేరకు పంపిన ఫిర్యాదు ప్రతిని ఇక్కడి పోలీసులకు అందించానని అంబటి కృష్ణ ఒప్పుకున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు రికార్డ్ చేశారు. అంబటి కృష్ణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులెవరూ హాజరు కాకపోవడానికి కారణం పరమేశ్వరరావేనని పీసీసీకి తెలపడంతో వారు ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. శుక్రవారం సమావేశంలో ఫిర్యాదు ఇవ్వడం తప్పని, గతంలో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న విషయం తనకు తెలియక ఇలా చేశానని ఒప్పుకున్న అంబటి కృష్ణ ఫిర్యాదును మాత్రం అధిష్టానం ఆదేశం లేకుండా వెనక్కు తీసుకోలేనన్నారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు 8 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సీఐ పైడపునాయుడును కలిసి తప్పుడు ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు.

Comments