top of page

కింగ్‌ స్టన్‌.. నో ఫన్‌

Writer: ADMINADMIN

‘కింగ్‌ స్టన్‌’ మూవీ రివ్యూ


ఓవైపు స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా వెలుగొందుతూ.. ఇంకోవైపు నటుడిగానూ గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జి.వి.ప్రకాష్‌ కుమార్‌. అతను నటించిన కొత్త చిత్రం ‘కింగ్‌ స్టన్‌’ ఈ రోజే తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం.

కథ:

కింగ్‌ స్టన్‌ (జి.వి.ప్రకాష్‌ కుమార్‌) ఒక స్మగ్లింగ్‌ గ్యాంగులో పని చేసే కుర్రాడు. తప్పుడు మార్గంలో అయినా సరే.. డబ్బులు సంపాదించి ఒక బోటు కొనుక్కోవాలన్నది అతడి లక్ష్యం. ఐతే ఆ స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ ను నడిపించే థామస్‌ తో ఒక సందర్భంలో కింగ్‌ గొడవ పడతాడు. దీంతో తనతో పాటు ఊరి మొత్తానికి పని పోతుంది. ఐతే ఆ ఊరి వాళ్లకు ఉపాధి ఉండదు. ఆ ఊరి నుంచి ఎవరైనా చేపలు పట్టడం కోసం సముద్రంలోకి వెళ్తే శవమై తిరిగొస్తారనే శాపం ఉంటుంది. ఈ శాపం వెనుక రహస్యాన్ని ఛేదించి ఊరికి ఉపాధి కల్పించాలని కింగ్‌ పంతం పడతాడు. ఓ మిత్ర బృందాన్ని వెంటేసుకుని బోటులో సముద్రంలోకి బయల్దేరతాడు. మరి కింగ్‌-తన మిత్రులు సముద్రంలోకి వెళ్లి క్షేమంగా బయటికి రాగలిగారా.. ఇంతకీ ఆ శాపం వెనుక కథేంటి.. కింగ్‌ అనుకున్నది సాధించాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

సరికొత్త కథలు.. పకడ్బందీ కథనాలు.. ఆశ్చర్యపరిచే సన్నివేశాలతో ఒకప్పుడు తమిళ సినిమా ఒక స్థాయిలో ఉండేది. వాటిని చూసి మన వాళ్లు ఇలాంటి సినిమాలు తీయరేంటి అనుకునేవాళ్లు మన ప్రేక్షకులు. కానీ ఇప్పుడు రొడ్డకొట్టుడు కథలతో నిండిపోతోంది తమిళ సినిమా. ఏదైనా కొత్తగా ప్రయత్నించినా.. దాన్ని నేర్పుగా చెప్పే నైపుణ్యం కొరవడుతోంది తమిళ ఫిలిం మేకర్లలో. తమిళంలో ఇటీవల వస్తున్న రొటీన్‌ మాస్‌ మసాలా సినిమాలతో పోలిస్తే ‘కింగ్‌ స్టన్‌’ కొంచెం భిన్నమైన సినిమానే. సముద్ర నేపథ్యంలో ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించాలని అనుకున్నాడు దర్శకుడు కమల్‌ ప్రకాష్‌. కానీ ఆ ప్రయత్నంలో అతను రాసిన కథ గురించి హీరోకు.. నిర్మాతకు ఏం చెప్పి ఒప్పించాడన్నది ప్రశ్నార్థకం. అసలిది హార్రర్‌ సినిమా అని చెప్పాడా.. థ్రిల్లర్‌ అన్నాడా.. లేక దీనికి ఇంకేదైనా పేరు పెట్టి వాళ్లకు స్క్రిప్టు చెప్పాడా.. వాళ్లు ఈ కథ మొత్తం విని అసలీ సినిమాతో ఏం చెప్పదలుచుకున్నావని అడిగే ప్రయత్నం చేయలేదా.. కథలో లాజిక్కుల గురించి.. సన్నివేశాల గురించి అసలు సందేహాలే వ్యక్తం చేయలేదా అన్నది ప్రశ్నార్థకం. సినిమా చూసిన వాళ్లను ఈ కథేంటో చెప్పమని అడిగితే.. ఒక్క ప్రేక్షకుడైనా ఉన్నదున్నట్లు వివరించగలిగితే.. ఆ వ్యక్తికి పెద్ద సన్మానం చేయాల్సిందే. ఎందుకంటే అంతటి గందరగోళంతో ‘కింగ్‌ స్టన్‌’ సినిమాను నింపేశాడు దర్శకుడు.

అసలు హీరో పాత్ర చిత్రణలోనే దర్శకుడికి సరైన క్లారిటీ లేకపోయింది. ఎలాంటి తప్పయినా చేసి డబ్బు సంపాదించాలన్నది అతడి ప్రాథమిక లక్ష్యం. అతను చేసేది స్మగ్లింగ్‌. మళ్లీ అందులో మోసాలు చేస్తుంటాడు. అలాంటోడు తన యజమానికి తప్పు చేస్తున్నాడని అతణ్ని ఎదిరించి బయటికి వచ్చి.. ఊరికి సాయం చేయడానికి బయల్దేరతాడు. ప్రతినాయక ఛాయలున్న హీరో పాత్రల్లో తర్వాత పరివర్తన రావడం చాలా సినిమాల్లో చూసి ఉంటాం కానీ.. ఇక్కడ హీరోలో అలాంటి మార్పు రావడానికి బలమైన కారణం కనిపించదు. హీరో అండ్‌ గ్యాంగ్‌ చేసే స్మగ్లింగ్‌ చుట్టూ నడిచే సన్నివేశాల్లో కనీస ఆసక్తి కనిపించదు. ఆ తర్వాత ఊరి కష్టాల చుట్టూ తిరిగే సన్నివేశాలు కూడా తలపోటు తెప్పిస్తాయి. ఐతే ‘కింగ్‌ స్టన్‌’ ట్రైలర్లో ఆసక్తి రేకెత్తించిన సముద్రం నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌ కోసం ఎదురు చూడడమే మిగుల్తుంది. తొలి గంటలో చాలా భారంగా సాగే ‘కింగ్‌ స్టన్‌’.. సముద్రం ఎపిసోడ్‌ ఆరంభంలో కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఊరి వాళ్ల చావుల వెనుక మిస్టరీ ఏంటో చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తాం. పైకి శాపం అని చెబుతూ.. తెర వెనుక ఇంకేదో కారణం చూపిస్తారని.. సైంటిఫిక్‌ అప్రోచ్‌ ఉంటుందని అనుకుంటాం. కానీ ఒక లో లెవెల్‌ హార్రర్‌ పాయింట్‌ తో దీన్ని తేల్చి పడేశారు. ఇక్కడ ‘లో లెవల్‌’ అనడానికి కారణం లేకపోలేదు. హీరో అండ్‌ గ్యాంగ్‌ మీద దాడి చేసే దయ్యాల అవతారాలు.. వాటి వ్యవహారం చూస్తే ఈ రోజుల్లో ఇలాంటి సెటప్‌ ఏంట్రా బాబూ అని తలలు పట్టుకోవడమే మిగుల్తుంది. జుగుప్స కలిగించేలా ఉన్న ఆ సీన్లు చూసి తట్టుకోవడం చాలా కష్టం.

హీరో తాతకు సంబంధించిన ఫ్లాష్‌ బ్యాక్‌.. అందులో ట్విస్టుల చుట్టూ చాలా కథనే నడిపించారు కానీ.. అది అత్యంత పేలవంగా అనిపిస్తుంది. మినిమం ఇంట్రెస్ట్‌ కలిగించని విధంగా.. చాలా బోరింగ్‌ గా ఆ కథ నడుస్తుంది. ఓవైపు అర్థం కాని నరేషన్‌.. ఇంకోవైపు గుప్పుమనే తమిళ వాసనలు.. ఏమాత్రం పేలని ట్విస్టులతో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ పూర్తిగా తేలిపోయింది. వర్తమానంలోకి వచ్చాక కూడా ‘కింగ్‌ స్టన్‌’లో ఏ మార్పూ ఉండదు. హీరో ఎవరో.. విలన్‌ ఎవరో.. ఏ పాత్ర ఏంటో తెలియని అయోమయంతో ‘కింగ్‌ స్టన్‌’ భారంగా సాగుతుంది. సినిమాలో హీరో సహా ఏ పాత్రకూ సరైన ఎలివేషన్‌ లేదు. ఎలాగోలా సినిమా ముగిసిపోతే చాలనే పరిస్థితి వస్తాం. పతాక సన్నివేశాల్లో కూడా మెరుపులు లేకపోయాయి. సముద్ర నేపథ్యంలో ఒక పెద్ద సినిమాకు అవసరమైన సెటప్‌ అయితే చేశారు కానీ.. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించని కథాకథనాల వల్ల అదంతా వృథా ప్రయాసగా మారింది. రకరకాల జానర్లను మిక్స్‌ చేసి కథను అల్లిన దర్శకుడు ఏ జానర్‌ కూ న్యాయం చేయలేకపోయాడు. ఆరంభమైన దగ్గర్నుంచి చివరి వరకు ఒక అలజడితో.. గందరగోళంతో సాగే ‘కింగ్‌ స్టన్‌’ ప్రేక్షకులకు శిరోభారాన్నే మిగులుస్తుంది.

నటీనటులు:

జి.వి.ప్రకాష్‌ కుమార్‌-దివ్యభారతి-చేతన్‌-అళగం పెరుమాళ్‌-అళగం పెరుమాళ్‌-ఆంటోనీ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌

ఛాయాగ్రహణం: గోకుల్‌ బినోయ్‌

నిర్మాతలు: జి.వి.ప్రకాష్‌ కుమార్‌-భవాని శ్రీ-ఉమేష్‌ బన్సల్‌

రచన-దర్శకత్వం: కమల్‌ ప్రకాష్‌

జి.వి.ప్రకాష్‌ కుమార్‌ నటుడిగా బాగానే తన ముచ్చట తీర్చుకుంటున్నాడు కానీ.. కథల ఎంపికలో చాలా సార్లు తప్పటడుగులే వేస్తున్నాడు. అసలేం అర్థమై అతనీ కథను ఎంచుకున్నాడన్నది అర్థం కాని విషయం. హీరో పాత్ర ఉందంటే ఉంది అనిపిస్తుంది తప్ప దానికి ఏ ప్రత్యేకతా లేదు. నటుడిగా చాలా లిమిటేషన్స్‌ ఉండడం వల్ల జి.వి. సైతం దాన్ని ప్రత్యేకంగా మార్చలేకపోయాడు. గ్లామర్‌ గర్ల్‌ గా పేరున్న దివ్య భారతిని ఇలాంటి డీగ్లామర్‌ పాత్రకు ఎంచుకోవడం రాంగ్‌ ఛాయిస్‌. ఇటు ఆమె స్టయిల్లో గ్లామర్‌ కోణం చూపించలేకపోయింది. అటు నటిగానూ మెప్పించలేకపోయింది. చేతన్‌.. అళగం పెరుమాళ్‌ లాంటి సీనియర్‌ నటులు కొంతమేర ఆకట్టుకున్నారు. హీరో స్నేహితుల పాత్రల్లో చేసిన నటులు పర్వాలేదు. సినిమాలో ఉన్న హడావుడి.. గందరగోళమే.. నటీనటుల హావభావాల్లోనూ కనిపిస్తుంది. అందరూ అవసరానికి మించి నటించారు.

సాంకేతిక వర్గం:

సాంకేతికంగా ‘కింగ్‌ స్టన్‌’లో చెప్పుకోదగ్గ విశేషం.. పరిమిత బడ్జెట్లోనే సముద్ర నేపథ్యంలో సన్నివేశాలను బాగా తీయగలగడం. ఆర్ట్‌ వర్క్‌.. సినిమాటోగ్రఫీ.. అన్నీ బాగా కుదిరి సమద్రంలో వచ్చే సన్నివేశాలన్నీ విజువల్‌ గా బాగా అనిపిస్తాయి. ఈ కథ నిజంగా సముద్రంలోనే జరుగుతున్న ఫీలింగ్‌ కలిగించగలిగారు. జి.వి.ప్రకాష్‌ కుమార్‌ పాటల్లో విశేషమేమీ లేదు. నేపథ్య సంగీతం ఓకే. నిర్మాణ విలువలు బడ్జెట్‌ స్థాయికి చాలా మెరుగ్గానే కనిపిస్తాయి. కమల్‌ ప్రకాష్‌ రచయితగా-దర్శకుడిగా.. రెండు రకాలుగా నిరాశపరిచాడు. స్క్రిప్టులో ఉన్న గందరగోళాన్ని టేకింగ్‌ తోనూ కవర్‌ చేయలేకపోయాడు. ఆరంభం నుంచి చివరి వరకు సినిమా గోల గోలగా అనిపిస్తుంది. కథను అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు.

తుపాకీ సౌజన్యంతో..

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page