కంచె లెక్కకు ఏడు నెలలు..
- NVS PRASAD
- Apr 16
- 1 min read
రాజకీయమే అడ్డంకి
పనంతా కలిపితే రూ.1.50 లక్షల లోపే

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం రూరల్ మండలం భైరిలో ఉన్న 25 సెంట్ల పంచాయతీ స్థలం చుట్టూ రూ.1.40 లక్షలతో ఇనుప ముళ్లకంచె తిప్పడానికి రాజకీయం అడ్డు తగులుతుందంటే నమ్మశక్యం కాదు. కోట్లాది రూపాయల పనులైతే పంచాయతీ సర్పంచ్‌గా ఉన్న వైకాపా నేతలు గానీ, ఎంపీపీగా ఉన్న వైకాపా ప్రతినిధి గానీ డబ్బులు తినేస్తారన్న భావనతో పనులను అడ్డుకొనివుంటే ఒక లెక్క. కేవలం రూ.1.40 లక్షలు ఖర్చు చేసి ఆక్రమణలకు గురి కాకుండా ఇనుప కంచె తిప్పాలంటూ పంచాయతీ తీర్మానిస్తే, దాని ఎస్టిమేషన్ వేయడానికి సంబంధిత జేఈ ఏడు నెలల నుంచి స్థలం వద్దకు రావడంలేదు. కారణం.. ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నేతలు వెళ్లొద్దని అధికారుల మీద ఒత్తిడి తేవడమేనని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..
భైరిలో 25 సెంట్ల స్థలంలో ఓ గుమ్మి ఉండేది. గ్రామంలో వాడుక నీరును ఇందులోకి మళ్లించేవారు. అయితే ఆ తర్వాత కాలంలో కాలువలు నిర్మించి, దాని ఔట్‌లెట్‌ను దగ్గర్లో ఉన్న నదిలోకి ఇవ్వడం వల్ల గుమ్మి ఖాళీగా మిగిలిపోయింది. దీన్ని కప్పించి, దీనిలో రూ.5 లక్షల ఖర్చుతో రచ్చబండ, పార్కు నిర్మించాలని మండలపరిషత్ పాలకులు భావించారు. అయితే అంతకంటే ముందు ఈ స్థలం ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఇనుప కంచె తిప్పాలని, అందుకు రూ.1.40 లక్షలు ఖర్చవుతుందని భావించారు. ఇందుకు సంబంధించి ఈవోపీఆర్‌డీ, పంచాయతీరాజ్ జేఈ పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా స్థానిక టీడీపీ నేత అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
Comentários