`కొన్నిచోట్ల సద్దుమణిగినా.. ఇంకా 30 సెగ్మెంట్లలో భగభగలు
`తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగేందుకు పలువురి సన్నాహాలు
`స్వయంగా అధినేతలు జోక్యం చేసుకున్నా దిగిరాని నేతలు
`దాంతో కొన్ని చోట్ల సీట్లు మార్చుకునే దిశగా మంతనాలు
`పొత్తుతో నష్టపోతున్నామని టీడీపీ శ్రేణుల ఆవేదన
ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో ఎన్నికల ముహూర్తం సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. ఒకపక్క అధికార వైకాపా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థులను చాలాముందే ప్రకటించేసి యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. మరోవైపు అధికారం కోసం కూటమి కట్టిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుకు ముందు వరకు ఉన్న సహృద్భావ పరిస్థితి ఆ తర్వాత కనిపించడం లేదు. నియోజకవర్గాల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరగలేదన్న ఆరోపణలు కూటమి మూడు పార్టీలను గందరగోళంలోకి నెట్టేశాయి. దాంతో పొత్తు ఫలితం దక్కడంలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తమకు బలంగా ఉన్న సీట్లను మిత్రపక్షాలకు కేటాయించారని టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అసమ్మతి రాజేశారు. మరోవైపు తాము పోటీ చేయాలనుకున్న సీట్లను టీడీపీ లాక్కోవడాన్ని బీజేపీ, జనసేన శ్రేణులు తప్పుపడుతూ రోడ్డెక్కుతున్నాయి. అదే సమయంలో ఒకరికి హామీ ఇచ్చి, తర్వాత చెప్పాపెట్టకుండా మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం వంటి పరిణామాలు కూటమిలో కల్లోలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో 50కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొనగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కల్పించుకుని కొందరు నాయకులు పార్టీ అధికారంలోకి వస్తే పదవులు ఇస్తామని హామీ ఇచ్చి బుజ్జగించడంతో కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి చాలావరకు చల్లారింది. తెనాలి, నందిగామ, పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన ఆలపాటి రాజేంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎస్‌వీవీఎస్ వర్మ వంటి నేతలు చంద్రబాబు బుజ్జగింపులతో శాంతించి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక రాజమండ్రి రూరల్‌లో టీడీపీ నేత గోరంట బుచ్చయ్యచౌదరికి టికెట్ ఇచ్చి.. అక్కడ జనసేన ఆశావహుడు కందుల దుర్గేష్‌కు పక్కనే ఉన్న నిడదవోలు సీటు ఇచ్చి సర్దుబాబు చేశారు. అయితే మూడు పార్టీల నేతలు ఎంత ప్రయత్నించినా ఇంకా గాడిన పడకుండా, అసమ్మతితో భగభగలాడుతున్న నియోజకవర్గాలు ముప్పైకిపైగానే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే..
`శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో టీడీపీ అభ్యర్థిత్వం గొండు శంకర్‌కు దక్కడాన్ని కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి పార్టీలో పెత్తనం చెలాయించిన గుండ కుటుంబానికి మింగుడు పడలేదు. ఆ కుటుంబానికి చెందిన గుండ లక్ష్మీదేవికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆ వర్గం రచ్చ చేస్తోంది. పార్టీ అధినేతను కలిసి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు. దాంతో గుండ వర్గం పార్టీ ప్రచారానికి దూరంగానే ఉంటోంది. పాతపట్నం నియోజకవర్గంలో సిటింగ్ ఇన్‌ఛార్జి కలమట రమణను కాదని మామిడి గోవిందరావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. దాంతో పార్టీపై కలమట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు సహాయంతో చంద్రబాబును కలిసినా ఇంతవరకు ఫలితం కనిపించలేదు. ఆయన ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతారన్న చర్చ జరుగుతోంది. ఎచ్చెర్లలో టీడీపీ బలంగా ఉండి గెలిచే అవకాశం ఉన్నా పొత్తు పేరుతో బీజేపీకి కేటాయించడం , ఇక్కడ టికెట్ ఆశించిన కళా వెంకట్రావుకు చీపురపల్లి, కలిశెట్టి అప్పలనాయుడుకు విజయనగరం ఎంపీ సీటు ఇచ్చినా గెలిచే సీటును బీజేపీ చేతిలో పెట్టి ఓటమి కొనితెచ్చుకుంటున్నామని ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఇక పాలకొండ సీటును జనసేనకు కట్టబెట్టడంతోపాటు టీడీపీకే చెందిన సిటింగ్ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆ పార్టీలోకి పంపి జనసేన అభ్యర్థిగా ప్రకటించడం విస్మయం కలిగించింది. అంతకుముందే టికెట్ ఇస్తామంటూ టీడీపీలోనే ఉన్న పడాల భూదేవిని జనసేనలో చేర్చుకున్నారు. కానీ చివరికి జయకృష్ణకు టికెట్ ఇవ్వడంతో భూదేవి వర్గం మండిపడుతోంది.
`విజయనగరం జిల్లాలో నెల్లిమర్లను పొత్తులో భాగంగా జనసేన నుంచి లోకం మాధవికి టికెట్ ఇచ్చారు. టీడీపీ బలమైన ఈ నియోజకవర్గం నుంచి పోటీకి కర్రోతు బంగార్రాజు చాలా కాలం నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు జనసేనకు ఇవ్వడంతో ఆయనతోపాటు టీడీపీ శ్రేణులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో కొండపల్లి కుటుంబంలో టీడీపీ చిచ్చు రేపింది. ఇక్కడ సిటింగ్ ఇన్‌ఛార్జి కొండపల్లి అప్పలనాయుడును కాదని అతని అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాస్‌కు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడంతో అక్కడ టీడీపీలో విభేదాలు రగిలాయి. ఇక చీపురుపల్లిలో సిటింగ్ ఇన్‌ఛార్జిగా ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు హ్యాండిచ్చి ఆయన పెదనాన్న అయిన కిమిడి కళావెంకట్రావుకు టికెట్ ఇవ్వడంతో అంతకుముందే కుటుంబంలో ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. నాగార్జున పార్టీ పదవులకు రాజీనామా చేసి కొద్దిరోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కూడా. కానీ ఎలాగోలా లోకేష్ ఆయన్ను పిలిపించుకుని బుజ్జగించారు. అయితే ఇప్పటికీ అక్కడ నాగార్జున వర్గం ప్రచారంలోకి దిగలేదు.
`ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పెందుర్తి సీటును పొత్తులో భాగంగా జనసేనకు కట్టబెట్టేశారు. దాంతో అక్కడ సీటు ఆశించిన మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. మాడుగులలో పైలా ప్రసాద్‌కు టికెట్ ఇవ్వడాన్ని అక్కడున్న మిగిలిన రెండు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రసాద్‌కు సహకరించేది లేదంటూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నాయి. అరకులో మంచి పట్టున్న దొన్నుదొరను పార్టీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు స్వయంగా చంద్రబాబే ప్రకటించినా, చివరికి దాన్ని బీజేపీకి ఇచ్చేయడంతో దొన్నుదొర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పక్కనే ఉన్న పాడేరు నియోజకవర్గంలో సిటింగ్ ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇక్కడ ఈశ్వరిని కాదని కిల్లు రమేష్‌నాయుడును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు అంటుకున్నాయి.
`తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటును బీజేపీకి ఇవ్వడంతో అక్కడి టికెట్ ఆశించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబంతో సహా పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా ఆయన వైపే ఉంది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన చంద్రబాబు ఈ సీటును తిరిగి తీసుకుని బీజేపీకి వేరే సీటు ఇచ్చేలా ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు నల్లమిల్లి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. తునిలో సిటింగ్ ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడును కాదని ఆయన సోదరుడైన మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆ కుటుంబంతోపాటు నియోజకవర్గ టీడీపీలోనూ అసమ్మతి రాజుకుంది. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని జనసేనాని పవన్‌కల్యాణ్ నిర్ణయించుకోవడంతో ఆ సీటును జనసేనకు వదిలేశారు. దాంతో అక్కడ పోటీకి సిద్ధమైన టీడీపీ నేత వర్మ అనుచరులు తీవ్ర విధ్వంసం సృష్టించారు. అయితే చంద్రబాబు పిలిపించి బుజ్జగించడంతో వర్మ మెత్తబడి పవన్ వెంట ప్రచారంలో పాల్గొంటున్నా టీడీపీ క్యాడర్ మాత్రం కలిసిరావడంలేదు. పైగా ఇక్కడ జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య ఆవేశకావేశాలు రగులుతున్నాయి.
`పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పోటీ చేస్తుందంటూ ఆ పార్టీ నేత విడివాడ రామచంద్రరావును అభ్యర్థిగా పవన్ గతంలోనే హామీ ఇచ్చినా తర్వాత ఆ సీటును టీడీపీ తీసుకోవడంతో విడివాడ వర్గం నిరసన బాట పట్టింది. టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు సహకరించేది లేదని భీష్మించింది. తమకు అన్యాయం చేశారంటూ వారాహి యాత్రలో భాగంగా వచ్చిన పవన్‌కల్యాణ్ ఎదుటే తీవ్ర నిరసనలు ప్రకటించారు. ఉండిలో ఇప్పటికే సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామారాజుకు టీడీపీ ప్రకటించింది. కానీ ఇటీవలే పార్టీలో చేరిన రఘురామకృష్ణంరాజుకు ఆ సీటు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతుండటంతో రామరాజు వర్గం ఆందోళన బాట పట్టింది. నియోజకవర్గ టీడీపీ కూడా రామరాజుకు మద్దతుగా నిలిచింది. పోలవరం సీటును జనసేనకు వదిలేయడం పట్ల అక్కడి టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
`కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చేసి చంద్రబాబు సన్నిహితుడు సుజనా చౌదరికి టికెట్ ఇవ్వడం అక్కడ పోటీ చేయాలనుకున్న జనసేన శ్రేణులను ఆగ్రహానికి గురి చేసింది. గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన పార్టీ సీనియర్ నేత పోతిన మహేష్ పార్టీపై తిరుగుబాటు లేవదీశారు. చివరికి ఆయన జనసేనను వీడి వైకాపాలో చేరిపోయారు. నూజివీడు టికెట్‌ను వైకాపా నుంచి వచ్చిన కొలుసు పార్థసారధికి ఇవ్వడాన్ని అక్కడ మొదటినుంచీ ఉన్న ముద్దరబోయిన నాగేశ్వరరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన ముద్దరబోయిన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పెడన నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడిన బూరగడ్డ వేదవ్యాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించగా టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్‌ను పార్టీలో చేర్చుకుని మరీ టికెట్ ఇచ్చేశారు. దీన్ని జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుద్ధప్రసాద్‌కు సహకరించేదిలేదని స్పష్టం చేస్తున్నారు.
`నెల్లూరు జిల్లా కావలిలోనూ రెబల్ రాజకీయం హీటెక్కింది. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్ స్వతంత్రంగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. టికెట్ విషయంలో టీడీపీ తనను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
`కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని తానేనంటూ టీడీపీ నేత బాలసుబ్రహ్మణ్యం ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత చెంగల్రాయుడు కూడా ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థిత్వంపై చంద్రబాబు పునరాలోచన చేస్తారని చెబుతున్నారు. దాంతో ఇద్దరు నేతల ప్రచారంతో తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది.
`కర్నూలు జిల్లా అలూరులో విరూపాక్షి గౌడ్‌కు టికెట్ ఇవ్వడంతో భంగపడిన టీడీపీ నేతలు వైకుంఠం శ్రీరాములు, మసాల పద్మజ తదితరులు పార్టీని వీడి వైకాపాలో చేరిపోయారు. డోన్ టికెట్ విషయంలో జిల్లాలో అతి కీలకమైన కేఈ కుటుంబం తిరగబడిరది. ఈ కుటుంబాన్ని కాదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి డోన్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడంతో కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ వైకాపాలో చేరారు.
`అనంతపురం జిల్లాలో గుంతకల్ టికెట్‌ను వైకాపా నుంచి వచ్చిన, పైగా కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూర్ జయరామ్‌కు కట్టబెట్టడాన్ని మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీడీపీ అధిష్టానం బుజ్జగించడంతో కాస్త శాంతించినా, ప్రచారంలో మాత్రం చురుగ్గా పాల్గొనడం లేదు. ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడ టికెట్ ఆశించిన పరిటాల శ్రీరామ్ కొద్దిరోజులు అలిగినా తర్వాత శాంతించారు. అయితే అక్కడ బీజేపీ లేదా టీడీపీ టికెట్ ఆశించిన గొనుగుంట్ల సూర్యనారాయణ(సూరి) ఇప్పుడు రెబల్‌గా మారే అవకాశం ఉంది.
`చిత్తూరు జిల్లా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన కేటాయించడాన్నే వ్యతిరేకించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గం, అక్కడ టికెట్‌ను వైకాపా నుంచి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు కట్టబెట్టాన్ని సహించలేకపోయారు. అదే సమయంలో తిరుపతి టికెట్ ఆశించిన జనసేన నేతలు కిరణ్ రాయల్, డాక్టర్ హరిప్రసాద్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు పవన్ స్వయంగా తిరుపతి వెళ్లి అసమ్మతి నేతలతో మంతనాలు జరిపారు. ఈ జిల్లాలోని పలమనేరు, రాయచోటి నియోజవర్గాల్లోనూ టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. రాయచోటి కీలక నేత రమేష్‌రెడ్డి టీడీపీని వీడి వైకాపాలో చేరిపోయారు.
Comments