షాపుల కోసం కల్వర్టు దిశ మార్పు
స్థానికులు అభ్యంతరాన్ని పట్టించుకోని నిర్మాణదారుడు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం రూరల్)

శ్రీకాకుళం` ఆమదాలవలస రోడ్డు పనులు నిర్వహించే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు వాకలవలస గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రోడ్డు విస్తరణలో భాగంగా వాకలవలస వద్ద ఉన్న కల్వర్టు నిర్మాణం ఆస్తవ్యస్థంగా మారిపోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నుంచి వరద, వాడుక నీరుతో పాటు మధురానగర్ లే`అవుట్, సమీపంలోని 15 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే కాలువ దిశను మార్చి నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణలో కల్వర్టును కూడా విస్తరించాల్సి ఉండగా దీన్ని నిర్మించకుండా సిమెంట్ పైప్‌వేసి పూర్తి చేయాలన్న ఆలోచనతో పనులు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుకు ఆనించి ఉన్న ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా నిర్మించిన షాపుల యజమానులతో చేతులు కలిపిన రోడ్డు కాంట్రాక్ట్ యాజమాన్య సిబ్బంది కల్వర్టు విస్తరణలో షాపులు తొలగించకుండా కాలువ దిశను మార్చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ఒక సిమెంట్ పైప్‌ను ఏర్పాటుచేసి అక్రమంగా ఏర్పాటుచేసిన షాపులకు నష్టం జరగకుండా దిశను మార్చి కాలువ నిర్మిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై సదరు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, అందుకే తాము కల్వర్టును సిమెంట్ పైప్‌తో నిర్మిస్తున్నట్టు చెబుతున్నారని గ్రామస్తులు తెలిపారు. దీనిపై ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని హెచ్చరించే ధోరణితో సిబ్బంది మాట్లాడుతున్నారని, షాపులను తొలగించకుండా కాలువ దిశ మార్చడంతో పాటు, సిమెంట్ పైప్‌తో నిర్మించడం వల్ల గ్రామం నుంచి వరద నీరు, పొలాలకు సాగునీరు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న నిర్మాణం వల్ల గ్రామం మీదుగా వెళ్లే మార్గం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విస్తరించే అవకాశం కోల్పోతామని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామం వద్ద రోడ్డు దాటడానికి డివైడర్ తొలగించడానికి నిబంధనలు అడ్డువస్తామని చెబుతున్న కాంట్రాక్ట్ యాజమాన్య సిబ్బంది సమీపంలోని ఒక దాబాకు వెళ్లేందుకు డివైడర్‌ను తొలగించారని, అత్యంత రద్దీగా ఉండే రోడ్డులో కాంట్రాక్ట్ యాజమాన్య సిబ్బంది నిబంధనలు పక్కన పెట్టి డివైడర్‌ను తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారుల స్పందించి రోడ్డు కాంట్రాక్ట్‌ర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments