top of page

‘కాంట్రాక్ట్‌’ నిబంధనలు.. నీళ్లొదులుతున్న ప్రిన్సిపాళ్లు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 25
  • 3 min read
  • కాంట్రాక్ట్‌ లెక్చరర్ల రెన్యూవల్‌, బదిలీల్లో ఇష్టారాజ్యం

  • తమకు కావలసిన రీతిలో మార్పులు చేర్పులు

  • 20 ఏళ్లకుపైగా ఇక్కడే ఉన్న వ్యక్తి బదిలీని ఆపే యత్నం

  • అందుకోసం అతను బోధించే సబ్జెక్టునే మార్చేసిన వైనం

  • జాబితాను తిరస్కరించి.. మొహాన కొట్టిన జాయింట్‌ కలెక్టర్‌

ree

జిల్లాలో సుమారు పది డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్ల రెన్యూవల్‌, బదిలీల ప్రక్రియలో ఐడీ కాలేజ్‌గా వ్యవహరిస్తున్న శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల యంత్రాంగం చేసిన నిర్వాకం జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. పద్ధతీపాడూ లేకుండా ఒక జాబితా తీసుకొచ్చి రెన్యూవల్‌ చేయమంటూ జేసీ ముందు పెట్టారు. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయ్‌? ఎవరిని బదిలీ చేయాలి? వర్క్‌ లోడ్‌ ఎక్కడుంది? ఎక్కడ ఎంతమంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు ఉన్నారు? వంటి వివరాలు లేకుండా.. 19 మందితో కూడిన జాబితాను జేసీ ముందుంచి రెన్యూవల్‌ చేయాలని ఐడీ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ కోరారు. సుదీర్ఘ కాలంగా ఒకేచోట పని చేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లను ఎందుకు బదిలీ చేయలేదని, ఏ సబ్జెక్టుకు ఎంత లోడ్‌ ఉందన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలడంతో తన ముందుంచిన ప్రతిపాదనల కాగితాలను జేసీ విసిరేసినట్లు భోగట్టా.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో పది డిగ్రీ కాలేజీల్లో 19 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు ఒకేచోట పని చేసినవారిని బదిలీ చేయాలి. ఇందుకోసం జిల్లాలో ఏ డిగ్రీ కాలేజీలో ఏ సబ్జెక్టుకు లెక్చరర్‌ పోస్ట్‌ ఖాళీగా ఉందో.. ఏ విభాగంలో వర్క్‌లోడ్‌ ఉందో తెలుసుకుని ఆ మేరకు బదిలీల ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్‌కు పంపాలి. ఆ తర్వాత ఈ పనిని కలెక్టర్‌ ఎవరికి అప్పగిస్తే వారు దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలి. ఆ విధంగా కలెక్టర్‌ దినకర్‌ పుండ్కర్‌ జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే రొటీన్‌గా కాలేజీ ప్రిన్సిపాల్స్‌ అందరూ డీఆర్‌సీ వద్ద హాజరై 19 పోస్టులను రెన్యూవల్‌ చేస్తున్నట్లు రాసుకొచ్చి జేసీ ముందు పెట్టారు. ఇందులో ఎక్కడా ఐదేళ్లు దాటినవారికి బదిలీ చూపించలేదు. పోనీ బదిలీలు ఎందుకు అవసరం లేదో కూడా చెప్పలేదు. ఎక్కడివారక్కడే కూర్చుని పబ్బం గడిపే విధంగా జాబితా తయారైందని భావించిన జేసీ ఆగ్రహించి ఈ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు తెలిసింది. జేసీకి ఆగ్రహానికి అనేక కారణాలు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ నుంచి ఫిజిక్స్‌కు జంప్‌

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో శ్రీనివాస్‌ యాదవ్‌ అనే కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడే పని చేస్తున్నారు. శ్రీకాకుళం జోన్‌లోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడా ఈ పోస్టు లేదు. రాష్ట్రం మొత్తం మీద అనంతపురం, రాజమండ్రి, శ్రీకాకుళంలలో మాత్రమే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ కోర్సు ఉంది. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను జోన్‌ దిటించి బదిలీ చేసే అవకాశం లేనందున ఆర్ట్స్‌ కళాశాలలోనే శ్రీనివాస్‌ 20 ఏళ్లుగా ఉండిపోయారు. 2021లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎయిడెడ్‌ కళాశాలలను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అక్కడ లెక్చరర్లుగా పనిచేస్తున్న సిబ్బంది వివిధ కాలేజీల్లో విధుల్లో చేరారు. దీంతో శ్రీకాకుళం పురుషుల కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌కు స్థానచలనం తప్పలేదు. ఆయన్ను అనంతపురం పంపారు. అప్పట్నుంచి శ్రీకాకుళం తిరిగి వచ్చేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తన పోస్టు కన్వర్షన్‌ కోసం రాజకీయంగా అనేక ఒత్తిళ్లు తీసుకువచ్చారు. ఒక సందర్భంలో పురుషుల కాలేజీలో ఉన్న ఒడియా విభాగానికి తనకు కన్వర్షన్‌ ఇమ్మంటూ దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే అది కమిషనరేట్‌లోనే ఆగిపోయింది. ఎయిడెడ్‌ కళాశాల నుంచి శ్రీకాకుళం మెన్స్‌ కాలేజీకి వచ్చిన ఎలక్ట్రానిక్స్‌ లెక్చరర్‌ రవికుమార్‌ ఇంతలోనే ఆంధ్రా యూనివర్సిటీకి ఓడీ(ఆన్‌ డ్యూటీ) మీద వెళ్లిపోయారు. దీంతో అనంతపురం వెళ్లిపోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ 2023లో ఇక్కడికి వచ్చేశారు. అయితే రవికుమార్‌ ఇటీవలే ఏయూ నుంచి వెనక్కు వచ్చారు. దాంతో ఇక్కడి ఎలక్ట్రానిక్స్‌ లెక్చరర్‌ పోస్ట్‌ రెగ్యులర్‌ ఫ్యాకల్టీతో భర్తీ అయినట్టయింది. నిబంధనల మేరకు ఇక్కడ పని చేస్తున్న కంట్రాక్ట్‌ లెక్చరర్‌ శ్రీనివాస్‌ను ఆర్‌జేడీ కార్యాలయానికి అప్పగించాలి. కానీ స్థానిక కళాశాల ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్లు ఆ పని చేయకుండా శ్రీనివాస్‌ యాదవ్‌ను ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో లెక్చరర్‌గా చూపిస్తూ రెన్యూవల్‌కు జేసీ ముందు ఫైల్‌ ఉంచారు. నిజంగా శ్రీనివాస్‌ ఫిజిక్స్‌ చెప్పే లెక్చరరే అయితే 20 ఏళ్లుగా ఈ కళాశాలలో నాలుగు ఫిజిక్స్‌ లెక్చరర్‌ పోస్టులకు గానూ మూడే ఉన్నప్పుడు నాలుగో అధ్యాపకుడిగా ఆయనతో ఎందుకు పాఠాలు చెప్పించలేదు? అలాగే టీచింగ్‌ లెర్నింగ్‌ ప్రాసెస్‌ రికార్డుల్లో శ్రీనివాస్‌ యాదవ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాత్రమే చెబుతారని రికార్డు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన్ను అకస్మాత్తుగా ఫిజిక్స్‌ లెక్చరర్‌ను చేయడం వెనుక ఆంతర్యమేమిటో ఐడీ కాలేజీ ప్రిన్సిపాల్‌ చెప్పలేకపోతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

ఇన్నాళ్లూ పట్టించుకోని సబ్జెక్టుపై మోజు

ఇన్నాళ్లూ ఫిజిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ వంటి గ్రూపులకు విద్యార్థులే లేకపోవడంతో హాయ్‌.. హాయ్‌.. గారడీ చేస్తూ రూ.60 వేల వరకు జీతం తీసుకున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు అనంతపురం లాంటి ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టపడటంలేదు. 40 సీట్లు చొప్పున ఉండే ఎలక్ట్రానిక్స్‌, ఫిజిక్స్‌, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ గ్రూపుల్లో చేరేందుకు ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. అంటే ఐదుగురు విద్యార్థులకు ఒక లెక్చరర్‌ అన్నమాట. ఇందులో వారు కాలేజీకి వచ్చేదెప్పుడు? వీరు క్లాస్‌ రూములకు వెళ్లేదెప్పుడో అర్థం చేసుకోవచ్చు. పోనీ శ్రీనివాస్‌ యాదవ్‌ ఫిజిక్స్‌ లెక్చరర్‌ అవతరామెత్తారు కాబట్టి అక్కడైనా ఎక్కువ మంది పిల్లలున్నారా... అంటే గత ఏడాది 15 మంది మాత్రమే చేరారు. ఎలక్ట్రానిక్స్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌ను ఇప్పుడు ఫిజిక్స్‌ లెక్చరర్‌గా మార్చాలంటే పోస్ట్‌ కన్వర్షన్‌ కింద విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు ఉండాలి. కానీ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నా ఆయన అంగీకరించలేదని తెలిసింది. అటువంటప్పుడు ప్రిన్సిపల్‌ హోదాలో ఉన్నవారు మాత్రం శ్రీనివాస్‌ను ఎలా కన్వర్ట్‌ చేశారన్నదే తేలాల్సిన ప్రశ్న. ఫిజిక్స్‌కు వర్క్‌లోడ్‌ ఉంది కాబట్టి అక్కడ పాఠాలు చెప్పించుకుంటామంటే ఇన్నాళ్లూ ఒక లెక్చరర్‌ కొరత ఉన్నా పాఠాలు చెప్పని వ్యక్తి ఇప్పుడు ఫిజిక్స్‌ మేజర్‌ సబ్జెక్ట్‌గా ఉన్న గ్రూపునకు వర్క్‌లోడ్‌ లేకపోయినా ఎలా పాఠాలు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ గ్రూపులు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాలలోనే ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఉన్న ఈ గ్రూపులకు సంబంధించిన పరీక్షా పత్రాలు వీరే దిద్దుతుంటారు. ఈ గ్రూపుల్లో ఎప్పుడూ రికార్డుస్థాయి రిజల్ట్‌ నమోదవుతుంటుంది. అందుకే పాఠాలు చెప్పకపోయినా ఇక్కడి నుంచి కదలడానికి మాత్రం ఇటువంటివారు ఇష్టపడటంలేదు. ఇవన్నీ జాయింట్‌ కలెక్టర్‌ దృష్టిలో ముందే ఉండటం వల్ల ఆయన రెన్యూవల్‌ ప్రతిపాదనలను తెచ్చినవారి మొహాన కొట్టారు. అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు ముందే మాట్లాడుకొని ఎవరికి ఏ సబ్జెక్ట్‌లో లెక్చరర్లు కావాలో ప్రతిపాదించుకొని, ఆ మేరకు కాంట్రాక్ట్‌ లెక్చరర్లను తెచ్చుకోవాలి. అలా కాకుండా ఏళ్లతరబడి ఒకేచోట పాతుకుపోయినవారు రాజకీయాలు తప్ప తరగతి గదుల మీద దృష్టి పెట్టడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page