top of page

కొండచిలువతో మసాజ్‌.. జిల్లా మీదుగా ట్రాన్స్‌పోర్ట్‌

Writer: NVS PRASADNVS PRASAD
  • పైథాన్‌ పిల్ల రూ.25వేలు

  • ఆఫ్రికా పిల్లి రూ.45వేలు

  • బెంగళూరులో బ్రీడిరగ్‌ సెంటర్‌

  • ఒడిశాతో లావాదేవీలు

  • బేరం కుదరక వెనక్కు వెళ్తూ పట్టుబడిన వన్యప్రాణులు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కొండచిలువ, అడవి తాబేలు, సేవక పిల్లి.. ఇవన్నీ పెంపుడు జంతువులే అంటే మీరు నమ్ముతారా? అదేంటి.. పిల్లి, కుక్క, మేక, ఆవు కదా పెంపుడు జంతువులు! మనిషినే మింగేసే కొండచిలువ పెంపుడు జంతువేంటి అనుకుంటున్నారా? థాయ్‌లాండ్‌, మలేషియాల్లో పైథాన్‌ మసాజ్‌ అని ఒకటుంటుంది. బాగా బలిసిన కొండచిలువలను వంటిమీద మెత్తగా పాకించి మసాజ్‌ చేయించడమే అక్కడ స్పాల ప్రత్యేకత. సరిగ్గా కర్ణాటక నుంచి ఒడిశా మీదుగా తరలిపోతున్న ఈ విదేశీ వన్యప్రాణులను ఫారెస్ట్‌ అధికారులు ఇచ్ఛాపురం చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్న కేసులో ఇప్పుడు కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సోమవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఇచ్ఛాపురం చెక్‌పోస్ట్‌ మీదుగా విదేశీ వన్యప్రాణులు తరలిపోతున్నాయని సమాచారం రావడంతో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మురళీకృష్ణంనాయుడు నేతృత్వంలో ఆ శాఖ అధికారులు 21 వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 17 కొండచిలువ పిల్లలు, 3 తాబేళ్లు, ఒక అడవి పిల్లి ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ పెంపుడు జంతువులేనని చట్టాలు చెబుతున్నాయి. కానీ వీటిని ఎగుమతి, దిగుమతి చేయడానికి ట్రాన్స్‌పోర్ట్‌ పర్మిట్‌ ఉండాలి. ఇది లేకపోవడంతో ఒడిశా నుంచి బెంగళూరు వెళ్తున్న వాహనంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి బెంగళూరులో ఇటువంటి విదేశీ వన్యప్రాణులను పెంచి, వాటిని విదేశాలకు ఎగుమతి చేసే సంస్థ ఒకటి ఉంది. దీనికి కర్ణాటకలో ఫారన్‌ బ్రీడిరగ్‌ సెంటరని పిలుస్తారు. ఇది నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్న వైల్డ్‌లైఫ్‌ చట్టం ప్రకారం ఆ శాఖ అనుమతులు మాత్రం లేవు. ఒడిశాలో ఒక వ్యాపారి వీటి కోసం బెంగళూరులో అడ్వాన్స్‌ ఇచ్చి తెప్పించుకున్నారు. తీరా వీటిని అక్కడకు తీసుకువెళ్లిన తర్వాత మొత్తం సొమ్ము చెల్లించకపోవడంతో మళ్లీ వెనక్కు బెంగళూరు తీసుకువెళ్తుండగా ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు. టూరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల్లో వీటి ధర ఎలా ఉందో తెలియదు గానీ, ఇండియాలో మాత్రం సర్వల్‌ కేట్‌ ధర రూ.45వేలు ఉండగా, తెల్ల కొండచిలువ పిల్ల ధర రూ.25వేలు ఉంది. ఇందుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో బెంగళూరుకు చెందిన సయ్యద్‌ లియాఖతుల్లా, విజయ్‌కుమార్‌, ముజాహిద్‌ అహమ్మద్‌ ఖాన్‌లను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం సెక్షన్లు నమోదు చేశారు.



 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page