రాష్ట్రంలో 30 జిల్లాలకు ప్రభుత్వం ప్రతిపాదన
2026లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందస్తు ఏర్పాట్లు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు ఎచ్చెర్ల వరకు ఒకే జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో ఇప్పుడు పలాస కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల భోగట్టా. నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం 2026లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ఇందులో భాగంగానే ముందుగా 26 జిల్లాలను 30 జిల్లాలుగా మార్పు చేస్తున్నట్టు వినికిడి. నవ్యాంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలు ఉండగా, వైకాపా ప్రభుత్వం దాన్ని 26 జిల్లాలుగా మార్చింది. అయితే ఇందులో శాస్త్రీయత లేదని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొన్ని ప్రాంతాలు సుదూరంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వెళ్తాయని భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా 30 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో పలాస ఒక జిల్లాగా ఉండబోతుంది. 2326.31 చదరపు కిలోమీటర్ల పరిధిలో 11,48,024 జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక జిల్లాగా గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నాగావళి జిల్లాగా మిగిలిన ప్రాంతానికి నామకరణం చేయనున్నారు. దీనికి జిల్లా కేంద్రంగా శ్రీకాకుళం ఉండబోతోంది. 2214.60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 12,49,015 జనాభాకు ఈ జిల్లా ఏర్పడబోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాల విభజన చేస్తున్నట్టు ఓ అంచనా. ఇవి కాకుండా పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు ఉంటున్నాయి. నూజివీడు, ఎన్టీఆర్ మచిలీపట్నం, కృష్ణ, గుంటూరు, తెనాలి, అమరావతి టెంపుల్ టౌన్ కేంద్రంగా అమరరామ జిల్లా కొత్తగా ఏర్పడనుంది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం ఒంగోలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, ఆదోని జిల్లాలు ఉండగా, కర్నూలులో తుంగభద్రను, నంద్యాలను వేర్వేరు జిల్లాలుగా చేస్తున్నారు. కనిష్ఠ జనాభా 11.50 లక్షల లోపు నుంచి గరిష్టంగా 24.16 లక్షలు జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో తక్కువ పాపులేషన్ ఉన్న జిల్లా పలాస కాగా, అత్యధిక జనాభా ఉన్న జిల్లా పొట్టిశ్రీరాములు నెల్లూరు. ఇప్పుడు దీని ప్రాతిపదిక గానే నియోజకవర్గాల పునర్విభజన కానుందని తెలుస్తుంది.
Comentarios