top of page

కొత్త ప్రభుత్వం మరీ ‘స్మార్ట్‌’

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • జిల్లాకు వచ్చిన 500 మీటర్లు

  • తొలిదశలో ప్రభుత్వ కార్యాలయాలకు బిగింపు

  • వచ్చే ఏడాది గృహ వినియోగదారులకు వాయింపు

  • వేలల్లో ఉద్యోగాలు గల్లంతు

  • ప్రీపెయిడ్‌ విధానాన్ని అవలంభిస్తున్న కూటమి

గత ప్రభుత్వంలో విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం మీద నేరుగా అసెంబ్లీలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం ఎవరూ మర్చిపోరు. అప్పట్లో ప్రతిపక్షం దీన్ని వ్యతిరేకించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్మార్ట్‌ మీటర్ల బిగింపు ఆగడంలేదు. ప్రస్తుతం జిల్లాకు 500 మీటర్లు రావడంతో వాటిని అమరుస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ కార్యాలయాలే. ఆ తర్వాత వాణిజ్య వినియోగదారులకు ఇస్తారు. వారి సంఖ్య 70వేలకు పైగా ఉంది. ఈ రెండు కేటగిరీలు పూర్తయ్యాక గృహ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లను అందిస్తారు. వారిలో కూడా అత్యధికంగా విద్యుత్‌ను ఉపయోగించే వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. రాయితీ విద్యుత్‌ వినియోగించుకునే వారికి, తక్కువ మొత్తంలో విద్యుత్‌ బిల్లు వచ్చేవారికి స్మార్ట్‌మీటర్లు ఇవ్వరు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మొబైల్‌ ఫోన్‌కు ప్రీపెయిడ్‌ కనెక్షన్‌ తీసుకున్నట్టే విద్యుత్‌ వినియోగానికి కూడా ముందుగానే చెల్లించి అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను వాడుకోవడమనే విధానం ఏ మేరకు మనలాంటి రాష్ట్రాల్లో సత్ఫలితాలిస్తుందో పక్కన పెడితే ఇది రాష్ట్రంలోనే పైలట్‌ ప్రాజెక్టు. గత ప్రభుత్వం ముందుగా రైతులకు ఈ మీటర్లు అందించింది. అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన ఎదురవడంతో ఆ బిల్లులు తామే చెల్లిస్తామని పేర్కొంది. అయితే ఇది ఎంతమేరకు, ఎంతమందికి వర్కవుట్‌ అయిందో తెలియదు. ఇటీవల కొత్త ప్రభుత్వం విద్యుత్‌ పాలసీ మీద శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించలేదు. కాబట్టి ఇది మంచిదా, చెడుదా అనే విషయాలు పక్కన పెడితే స్మార్ట్‌ మీటర్ల వల్ల ఉన్న ఫలంగా ఎఫెక్ట్‌ అయ్యేది సంస్థలో పని చేస్తున్న ఒక స్థాయి ఉద్యోగులే. మీటరు రీడిరగ్‌ దగ్గర్నుంచి బిల్లులు చెల్లింపుల వరకు విద్యుత్‌ సంస్థలో ఒక వ్యవస్థ పని చేస్తుంది. ఇప్పుడు అటువంటి ఉద్యోగులందరికీ భద్రత లేకుండాపోతుంది. టెక్నాలజీ పెరిగినప్పుడు సంప్రదాయ ఉద్యోగాలు ఎగిరిపోవడం సాధారణం. అయితే పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే.

ట్విమ్స్‌ మిషన్ల అమలు తర్వాత ఆర్టీసీలో కండక్టర్‌ ఉద్యోగాలు కుదించబడి సర్‌ప్లస్‌ సిబ్బంది డ్రైవర్లుగా మారిపోయారు. అలాగే ఆర్టీసీలో నియామక ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్‌ రంగంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటువల్ల ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో పాలిటెక్నిక్‌, ఐటీఐ వంటి అర్హతలతో పనిచేస్తున్న స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ ఉద్యోగాలు గల్లంతవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ విద్యుత్‌ వినియోగానికి స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు 2022లో వైకాపా ప్రభుత్వం ప్రకటించడమే తడువు అప్పటి ప్రతిపక్ష, విపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. యువగళం యాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఒక్క అడుగు ముందుకేసి వ్యవసాయ వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటుచేసే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుకు రైతులు అంగీకార పత్రాలు ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్మార్ట్‌ మీటర్లను తొలగిస్తామని ప్రకటించారు. అయినా అప్పటి ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లను వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు బిగించింది. ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధిలో 29,638 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించి 29,122 మందికి ఉచిత విద్యుత్‌ అందిస్తుంది. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం పూర్తయిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్‌మీటర్లు బింగించే ప్రక్రియను జిల్లాలో ప్రారంభించారు. స్మార్ట్‌ మీటరింగ్‌ కోసం జిల్లాకు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ.71.17 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో 200 యూనిట్లు కన్నా అధిక వినియోగం కలిగిన ప్రభుత్వ, పరిశ్రమ, కమర్షియల్‌ గృహ విద్యుత్‌ సర్వీసులు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఫీడర్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

జిల్లాలో స్మార్ట్‌ మీటర్లు

స్మార్ట్‌ మీటర్‌ను గృహ సర్వీసులకు దశలవారీగా అమర్చేందుకు అనువైన మార్గాన్ని సులువు చేసుకునేందుకు తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు అమరుస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఆటంకాలు లేకుండా అప్పుల కోసం లాబీయింగ్‌ చేసిన వైకాపా ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో ప్రైవేటు సంస్కరణల అమలుకు 2021 నుంచే పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో విద్యుత్‌ రంగంలో ప్రస్తుతం అమలువుతున్న సంస్కరణలను యథాతధంగా ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. అందులో భాగంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ విశాఖపట్నం నగరం నుంచి మొదలుపెట్టారు. తొలి మీటరును సీతమ్మధారలోని ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో సచివాలయాలు, ప్రజారోగ్య కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాలకు బిగించనున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 8.68 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగదారులు అత్యధికంగా 7.5 లక్షలు వరకు ఉన్నారు. గృహేతర (కమర్షియల్‌) సర్వీసులు 70వేలు ఉన్నాయి. 3,800 పరిశ్రమలు, 20 వేలు కుటీర పరిశ్రమల సర్వీసులు, 500 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా 29,638 వ్యవసాయ పంపుసెట్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీరందరికీ విద్యుత్‌ ఉద్యోగులు మాన్యువల్‌ లేదా స్కానర్‌ ద్వారా బిల్లులు తీసి అందజేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉద్యోగాలు గల్లంతవడం ఖాయం.

ప్రీపెయిడ్‌ విధానం అమల్లోకి

స్మార్ట్‌మీటర్లు పూర్తిగా అమర్చాక సెల్‌ఫోన్ల రీఛార్జి మాదిరిగా ప్రీపెయిడ్‌ విధానం అమల్లోకి రానుంది. అది అమల్లోకి వచ్చిన తర్వాత నిర్ధేశించిన విద్యుత్‌ యూనిట్ల వినియోగం తర్వాత ఆటోమేటిక్‌గా విద్యుత్‌ సరఫరా ఆగిపోతుంది. ఈ విధానం క్రమంగా అన్ని కేటగిరీ సర్వీసుల్లోనూ అమలుకానుంది. విద్యుత్‌ శాఖ అధికారులు మాత్రం 200 యూనిట్లు మించి వినియోగదారులు సర్వీసులకు మాత్రమే స్మార్ట్‌ మీటర్‌ అమర్చనున్నట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం విద్యుత్‌ వినియోగించిన తర్వాత ప్రతి నెలా 10 నుంచి 15 రోజుల వ్యవధిలో బిల్లులు కట్టించుకుంటున్నారు. స్మార్ట్‌ మీటర్లు వచ్చాక అలా కుదరదు. నెలకు ఎంత విద్యుత్‌ బిల్లు వస్తుందో సగటున అంచనా వేసి, ఆ మొత్తం ముందుగానే చెల్లించి మీటరును రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తం ఎంతనేది వినియోగం బట్టి మారుతుంది.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page