సెలైన్లు పెట్టుకునే స్టాండ్లూ కరువు
60 గ్రామాలకు ఒకటే ఆసుపత్రి

పాతపట్నం నియోజకవర్గంలో అనేక గిరిజన గ్రామాల ప్రజలకు కొత్తూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటరే పెద్దాసుపత్రి. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతంలోని ఏకైక ఆసుపత్రికి కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో ఇక్కడకు వచ్చిన రోగులు మరింత అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. కొత్తూరు, భామిని, సీతంపేట మండలంలో కొన్ని గ్రామాలను కలుపుకొంటే దాదాపు 60 ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు నిత్యం ఆరోగ్య సేవల కోసం వస్తుంటారు. అందుకే ఈ ఆసుపత్రిలో ఎప్పుడూ 200 పైబడి ఔట్ పేషెంట్లు ఉంటారు. 30 పడకల ఈ ఆసుపత్రిలో ఎప్పుడూ మంచాలు ఖాళీగా ఉండవు. రోజుకు 120 మందికి రక్తపరీక్షలు అవుతున్నాయంటే ఈ ఆసుపత్రికి రోగుల తాకిడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో ఆమాత్రం ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్నవారు కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న 12 చిన్న చిన్న ఆసుపత్రులకు వెళ్తున్నారు. విచిత్రంగా వీటన్నింటినీ ఆర్‌ఎంపీలు, పీఎంపీలే నడుపుతున్నారు. కొత్తూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నా సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు చూస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సెలైన్ ఎక్కించుకోవాలంటే దాన్ని ఎత్తులో పట్టుకొని నిలబడటానికి మరో మనిషి అవసరం. అలాగే ఆసుపత్రిలో చేరిన తర్వాత రోగులే టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకోవాలి. ఇక్కడ మొత్తం 56 మంది సిబ్బంది ఉన్నా కనీస వసతులు మాత్రం ఏ ప్రభుత్వాలూ కల్పించలేకపోతున్నాయి. జనరల్ సర్జన్, గైనిక్ సర్జన్, పిడియాట్రిక్ వంటి నాలుగు విభాగాలు ఇక్కడ చురుగ్గా పని చేస్తుండటంతో నిత్యం రోగులు కిటకిటలాడుతున్నారు. ఒకటే ఎక్స్‌రే ప్లాంట్ ఉండటం వల్ల ఎముకలు విరిగి ఆసుపత్రిలో చేరితే ఆ రిపోర్టు రావడానికి రెండు రోజులు పడుతుంది. ఈలోగా నొప్పిని భరించలేక రోగులు జిల్లా కేంద్రానికి పయనమవుతున్నారు.

Comments