` మంత్రి బూడి ముత్యాలనాయుడికి ఇంటిపోరు
`తండ్రి, చెల్లి ఓటమికి పంతం పట్టిన రవికుమార్
`తనకు కాకుండా అసెంబ్లీ సీటు సవతి సోదరికి ఇవ్వడంపై కినుక
`మాడుగుల అసెంబ్లీ, అనకాపల్లి ఎంపీ స్థానాల్లో వైకాపాకు చేటు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. అన్నది నానుడి. అందుకు తగినట్లే రాజకీయాల్లో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు పరస్పరం పోటీ పడటం, ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడటం ప్రతి ఎన్నికల్లోనూ చూస్తున్నదే. విజయవాడ ఎంపీ బరిలో ప్రస్తుత ఎన్నికల్లో అన్నదమ్ములైన కేశినేని నాని, కేశినేని చిన్ని రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఢీకొంటుండటం, కడప లోక్‌సభ బరిలో పెద్దనాన్న చిన్నాన్న పిల్లలైన వైఎస్ అవినాష్‌రెడ్డి, షర్మిల పరస్పరం తలపడుతుండటం దీనికి తాజా ఉదాహరణ. అదే సమయంలో తండ్రుల తరఫున కుమారులు, కుమార్తెలు, భార్యలు ప్రచారం చేయడం, పోల్ మేనేజ్‌మెంట్ నిర్వహించడం సహజమే. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం వీటికి భిన్నమైన, ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. అక్కడ తండ్రి రాజకీయ వారసత్వం కోసం అన్నాచెల్లెళ్లే పోటీ పడుతుండటం విశేషం. చిత్రమేమిటంటే ఆ తండ్రి ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుండగానే, ఎన్నికల్లో పోటీ చేస్తుండగానే కొడుకు, కూతురి మధ్య రేగిన రాజకీయ వివాదం ఆయనకే ఎసరు తెచ్చే ప్రమాదం దాపురించింది. స్వయంగా కొడుకే ‘మా నాన్నను ఓడిరచండి’ అంటూ ప్రచారం చేస్తుండటంతో ప్రస్తుత ఎన్నికల్లో ఆ నియోజకవర్గమే ట్రెండిరగులో నిలిచి హాట్ టాపిక్‌గా మారింది. ఆ తండ్రి మరెవరో కాదు.. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే.. కుమార్తె ఈర్లె అనురాధ ప్రస్తుతం తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరినీ సవాల్ చేస్తూ ముత్యాలనాయుడు కుమారుడు రవి మాడుగుల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే.. ఎంపీగా పోటీ చేస్తున్న తన తండ్రిని ఓడిరచమని ఓటర్లను కోరుతూ ప్రచారం చేస్తున్నారు.
ఇంటిపోరుతోనే వివాదం
మాడుగుల ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుడు రవికుమార్ కాగా రెండో భార్య కుమార్తె ఈర్లె అనురాధ. తండ్రి ముత్యాలనాయుడు మొదటి నుంచీ రాజకీయాల్లో కొనసాగుతూ వైకాపా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మాడుగుల నియోజకవర్గంలో మంచి పేరుప్రతిష్టలు ఉన్నాయి. ఆయన ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుండగానే ఆయన వారసత్వాన్ని దక్కించుకునే విషయంలో సవతి అన్నాచెల్లెళ్ల మధ్య పోరు మొదలైంది. దీనికి ముత్యాలనాయుడు వైఖరి కూడా కొంత కారణం అని చెప్పాలి. కొడుకును కాకుండా ఆయన కుమార్తెనే రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దాంతో గతంలో కూడా ఇటువంటి వివాదం తలెత్తింది. మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్తె ఈర్లె అనురాధను ముత్యాలనాయుడు జెడ్పీటీసీ బరిలో నిలిపి గెలిపించుకున్నారు. అప్పుడు కూడా తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బూడి రవికుమార్ జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసినా తర్వాత జరిగిని బుజ్జగింపుల పర్వంతో పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో ఈర్లె అనురాధ జెడ్పీటీసీ కాగలిగారు. ఇంటిపోరు అప్పటికి చల్లబడినా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తెరపైకి వచ్చింది. దీన్ని పరిష్కరించడంలో ముత్యాలనాయుడు విఫలం కావడం ఆయన కుటుంబ పరువును దెబ్బతీయడమే కాకుండా ఎన్నికల్లో వైకాపా విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడిరది.
మారిన సమీకరణాలు
ప్రస్తుత ఎన్నికల్లో మారిన సమీకరణాలే ఇంటిపోరును మళ్లీ బయటకు తెచ్చాయంటున్నారు. తొలినుంచి మాడుగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముత్యాలనాయుడు సిటింగ్ ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. పార్టీ కూడా ఆయన్నే అభ్యర్థిగా కొనసాగిస్తూ తొలుత నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిపక్ష కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడం, ఆ పార్టీ తన అభ్యర్థిగా స్థానికేతరుడైనప్పటికీ, సంపన్నుడైన సీఎం రమేష్‌ను నిలబెట్టింది. దాంతో అధికార వైకాపా తన నిర్ణయాన్ని మార్చుకుంది. స్థానికుడు, వివాదరహితుడు, సామాజికవర్గ బలం ఉన్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అయితే సీఎం రమేష్‌ను బలంగా ఢీకొట్టగలరని భావించింది. అప్పటికే మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయన్ను మార్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అయితే మాడుగుల అసెంబ్లీకి తన కుమార్తె అనురాధకు టికెట్ ఇవ్వాలని ముత్యాలనాయుడు షరతు పెట్టగా.. జగన్ దానికి అంగీకరించడంతో ఆయన ఎంపీ బరిలోకి దిగారు. అయితే ముత్యాలనాయుడు వారసుడిగా మొదటి భార్య కుమారుడు రవికుమార్ తనకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే తండ్రితో పాటు పార్టీ అధినేత జగన్ సైతం దీనికి అంగీకరించలేదు.
ఇండిపెండెంట్‌గా తెరపైకి
తండ్రి స్థానంలో మాడుగుల నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేయడానికి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రవికుమార్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి ఇక్కడ సోదరి అనురాధకు, ఎంపీ స్థానంలో తండ్రి ముత్యాలనాయుడుకు కంట్లో నలుసులా మారారు. వారిద్దరి ఓటమే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారు. ప్రచార పర్యటనల్లోనూ, సోషల్ మీడియా ద్వారా ఆయన చేస్తున్న ప్రకటనలు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న తన తండ్రి ముత్యాలనాయుడు ఓడిరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ‘కన్న కొడుక్కే న్యాయం చేయలేని వారు.. ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడును ఓడిరచండి’ అని పిలుపునిచ్చారు. ‘మా నాన్న తులసి మొక్కే. 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయి. జగన్‌ను నమ్ముకుని ఆయన వెంట తొమ్మిదేళ్లు తిరిగాను. పార్టీలో ఏనాడు బూడి ముత్యాలనాయుడి కుమారుడిగా చెప్పుకోలేదు. ఏమైందో ఏమో కానీ ఐదేళ్లుగా నన్ను రాజకీయంగా తొక్కడం ప్రారంభించారు’ అని రవికుమార్ పార్టీపైనా విరుచుకుపడుతున్నారు.
ఇంటిపోరు వైకాపాకు చేటు
బూడివారి ఇంటి పోరు ఇప్పుడు పార్టీకి చేటు చేసేలా తయారైంది. ఈ పరిణామాలు ముత్యాలనాయుడితోపాటు వైకాపాకు మింగుడు పడటంలేదు. వాస్తవానికి మాడుగులలో బూడికి మంచి పేరే ఉంది. అసెంబ్లీకి ఆయనే పోటీ చేస్తే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని స్థానికంగా బలమైన ప్రచారం ఉండేది. కానీ అనూహ్యంగా ఆయన్ను అనకాపల్లి ఎంపీ స్థానానికి పంపడం, ఆయన కుమార్తెను మాడుగుల అసెంబ్లీ బరిలో నిలబెట్టడం.. దీన్ని వ్యతిరేకిస్తూ ఆ ఇంటి సభ్యుడైన రవికుమార్ స్వతంత్రంగా బరిలోకి దిగి తండ్రిని, సోదరిని సవాల్ చేస్తుండటంతో ఇటు లోక్‌సభ, అటు అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల చీలికకు దారితీసేలా ఉందని వైకాపా కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు ఓటర్లలోనూ అయోమయం నెలకొంది. ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఓట్ల చీలకకు దారి తీసి విజయావకాశాలకు గండికొడుతుందేమోనన్న ఆందోళన వైకాపా వర్గాల్లో పెరుగుతోంది.
Comments