top of page

కెనరాబ్యాంక్‌కో రూల్‌.. ఎస్బీఐకి మరో రూల్‌

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Feb 17
  • 4 min read
  • తేటగుంటలో తాకట్టు బంగారం మాయం

  • గార ఎస్బీఐ మాదిరి కుంభకోణం

  • శాఖాపరమైన చర్యలు చేపట్టిన కెనరా బ్యాంకు

  • ఇక్కడ నిండుప్రాణం తీసేసిన ఆర్‌ఎం

  • పోలీసు అధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు!

  • తన పైఅధికారులను ఇరికిస్తానంటూ రాజు బ్లాక్‌మెయిల్‌?

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఈ పక్కన కనిపిస్తున్న పేపర్‌ క్లిప్పింగ్‌ ఆదివారం ఈనాడు పత్రిక ప్రధాన సంచికలోనిది. కాకినాడ జిల్లాలోని ఓ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారానికి రెక్కలొచ్చాయి. అప్పు తీర్చేసి తమ పసిడిని తీసుకువెళ్దామని వచ్చినవారు అక్కడ తమ వస్తువులు లేకపోవడంతో చూసి లబోదిబోమన్నారు. ఇది తుని నియోజకవర్గం తేటగుంట కెనరాబ్యాంకులో చోటుచేసుకుంది. పలువురు ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు కోటికి పైగా విలువైన బంగారు నగలు మాయమైనట్లు అధికారులు వెల్లడిరచారు.

ఇది చదువుతుంటే శ్రీకాకుళం గార ఎస్బీఐ బ్రాంచిలో తాకట్టు బంగారం మాయమైన కేసు గుర్తొస్తే అది మా తప్పు కాదు. ఎందుకంటే.. బ్యాంకులను నమ్మకపోతే ఎవర్ని నమ్ముతామని వాటిని జాతీయీకరణ చేసినప్పుడే ప్రజల్లో ఒక ముద్ర ఏర్పడిరది. కానీ ఇక్కడ బ్యాంకుల కంటే అందులో పని చేస్తున్న ఉద్యోగులు దీన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారని, మన సొమ్ము, మన బంగారంతో రియల్‌ ఎస్టేట్‌, వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారని, దీనికి సంబంధిత బ్యాంకుల్లో పైఅధికారి నుంచి అకౌంటెంట్‌ వరకు అందరూ బాధ్యులేనని ‘సత్యం’ గత కొన్నాళ్లుగా మొత్తుకుంటోంది. శ్రీకాకుళం గార బ్రాంచిలో బంగారు నగలు ఏ విధంగా మాయమయ్యాయో తేటగుంట కెనరా బ్యాంకులో కూడా అదేవిధంగా బంగారు నగలు మాయమయ్యాయి. ఇక్కడ బ్యాంకు అధికారులు పోయిన బంగారానికి తమది పూచీ అని ఎలా మాటిచ్చారో, తేటగుంటలో కూడా అలానే చెప్పినట్టు ఈనాడుతో పాటు మరికొన్ని పత్రికల కథనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపించిన తేడా అంతా ఒక్కటే. తుని నియోజకవర్గం తేటగుంటలో రూ.కోటి విలువైన బంగారు నగలు మాయమైనప్పుడు ముందుగా సంబంధిత బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ను, అసిస్టెంట్‌ మేనేజర్‌ను, అప్రయిజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే బ్యాంకు మేనేజర్‌ కంటే పెద్దస్థాయి ఉన్న అధికారి తన పరిధిలో ఉన్న బ్రాంచిలో బంగారు నగలు మాయమయ్యాయని శాఖాపరంగా గుర్తించారన్నమాట. ఆ మేరకే బాధ్యత వహించాల్సిన మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్ల మీద ఫిర్యాదు ఇచ్చినట్టు అర్థమవుతుంది. కానీ గార బ్రాంచిలో ఏం జరిగింది? ఒక్కసారి గతంలోకి వెళితే.. గార బ్రాంచిలో తాకట్టు పెట్టిన బంగారు నగలు మాయమయ్యాయని, దీనికి అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉన్న స్వప్నప్రియే కారణమని అప్పటి ఎస్బీఐ రీజనల్‌ మేనేజర్‌ ముందుగా పత్రికలకు, సోషల్‌మీడియాకు లీకులిచ్చి, ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను ప్రధాన ముద్దాయిగా చేర్చి గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి బ్యాంకు లాకరులో ఉండాల్సిన బంగారం ఎప్పటికప్పుడు ఉందా, లేదా అని చెక్‌ చేసి రిజిస్టర్‌ మీద సంతకం చేయాల్సింది బ్రాంచి మేనేజరు. ఎప్పటికప్పుడు చెక్‌ చేసినట్టు, బంగారు నిల్వలు సరిగానే ఉన్నట్టు మేనేజర్‌ సంతకంతో కూడిన రిజిస్టర్‌ చెబుతుంది. అలాగే నెలనెలా జరిగే ఆడిట్‌తో పాటు మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి జరిగే ఆడిట్‌లో కూడా బంగారు నగలు క్షేమంగా ఉన్నాయన్న రిపోర్టు స్వయంగా బ్యాంకు ఉన్నతాధికారుల వద్దే ఉంది. కానీ తమ తాకట్టు నగలు విడిపించడానికి గార ప్రజలు బ్యాంకుకు వచ్చినప్పుడు సంబంధిత బ్యాగులు కనిపించడంలేదని ఎప్పుడైతే తేలిందో ముందుగా అప్పటి ఆర్‌ఎం రాజు అటువంటిదేమీ లేదని ఖండిరచారు. బ్యాంకు రెపిటేషన్‌ చెడిపోకుండా ఉండటం కోసం ఆయన ఆ మాట చెప్పివుండొచ్చు. కానీ పోయిన బంగారం మొత్తం స్వప్నప్రియే దొంగిలించిందని, ఆమె కుటుంబం నుంచి ఈ మొత్తాన్ని వసూలుచేసే ప్రక్రియలో తన పథకం పారక ఫెయిలైన ఆర్‌ఎం ఆ తర్వాత స్వప్నప్రియను ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి బ్యాంకు లాకరు ఓపెన్‌ చేయాలంటే ఇద్దరి వద్ద తాళాలుంటాయి. గార ఎస్బీఐ అంశంలో ఆ సమయానికి ఒక తాళం స్వప్నప్రియ వద్ద ఉండగా, మరో తాళంచెవి క్యాషియర్‌ ముంజి సురేష్‌ అనే వ్యక్తివద్ద ఉంది. కానీ అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా ముంజి సురేష్‌ పేరే రాయలేదు. స్వప్నప్రియే మొత్తం బంగారం పట్టుకుపోయిందని ఫిర్యాదు చేశారు. రెండు తాళంచెవులు ఉన్నప్పుడు ఒకదానితో తెరిచి స్వప్నప్రియ ఎలా పట్టుకుపోతుందని ‘సత్యం’ కథనం రాసిన తర్వాత పోలీసులు తేరుకొని ముంజి సురేష్‌ పేరును కూడా చేర్చారు. ఎ`1గానో, ఎ`2గానో ఉండాల్సిన ముంజి సురేష్‌ను ఎ`6గా చేర్చారు. కానీ తేటగుంట కెనరాబ్యాంకు విషయంలో మాత్రం ఎక్కడా ఇటువంటి తప్పులు చేయనట్లు కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం ఒక బ్రాంచిలో డబ్బో, బంగారమో మాయమైతే ఎవరి మీద చర్యలు తీసుకోవాలో వారి మీద మాత్రమే పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. ఆ తర్వాత పోలీసు విచారణలో ఎంతమంది బయటపడతారనేది వేరే విషయం. గార ఎస్బీఐ విషయంలో పోలీసులు చేయాల్సిన పనిని బ్యాంకు అధికారి టీఆర్‌ఎం రాజు చేసేశారు. ఆయన కోసం, ఆయన వల్ల, ఆయన కొరకు, ఆయన ఏ విధంగా ఫిర్యాదు ఇచ్చారో, అదేవిధంగా అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు చూపించేశారు. గార బ్రాంచిలో తాకట్టు బంగారం మాయమైందని వెలుగుచూసిన కొద్ది రోజుల ముందే అక్కడ బంగారు బ్యాగులు ప్రైవేటు బ్యాంకులకు తరలిపోయాయని పోలీసులు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వాస్తవానికి గార బ్రాంచిలో ఉండాల్సిన తాకట్టు నగలు శ్రీకాకుళం నగరంలోని కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో నకిలీ పేర్లతో రెండేళ్ల క్రితం నుంచి తాకట్టులో ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. ఆర్‌ఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొలోమని కేసు కట్టేసి, స్వప్నప్రియ సోదరుడ్ని రిమాండ్‌కు పంపేసి కేసును ఛేదించేశామంటూ పతకాలు అందుకున్న పోలీసులు ఓ పథకం ప్రకారమే గార కేసును ఉద్దేశపూర్వకంగా ఒక కుటుంబం మీదకు నెట్టేశారనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. బ్యాంకు అధికారులు, పోలీసులు ఒక్కటైపోయి మైనార్టీ సామాజికవర్గానికి చెందినవారిని జైలుకు పంపారు. ఎక్కడైనా బ్యాంకు బ్రాంచిలో అవకతవకలు జరిగితే, ముందుగా బాధ్యత వహించాల్సింది మేనేజర్‌. ఆ మేనేజర్‌ మీద చర్యలు తీసుకోవాలంటే ముందుగా జరగాల్సింది శాఖాపరమైన విచారణ. ఇక్కడ ఆ రెండూ లేకుండా తాకట్టులో ఉన్న బంగారం విడిపిస్తే కేసు లేకుండా చేస్తామని భయపెట్టి టీఆర్‌ఎం రాజు చేతులు దులుపుకొన్నారు. ఇందుకోసం మొదట్నుంచి అప్పటి పోలీసులను మేనేజ్‌ చేసుకొచ్చారు. స్వప్నప్రియ బ్యాంకు నుంచి తీసుకెళ్లిన బంగారు నగలను కుదువపెట్టి తన సోదరుడికి సొమ్ములిచ్చిందని పోలీసులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఛార్జిషీటు వేయడానికి దాన్ని ఎక్కడా ఎస్టాబ్లిష్‌ చేయలేకపోతున్నారు. స్వప్నప్రియ సోదరుడికి రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఇందులోనే స్వప్నప్రియ డబ్బులు వేసేదని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో రాశారు. వాస్తవానికి అందులో ఒక బ్యాంకు అకౌంట్‌ నెంబరు పూర్తిగా తప్పు కాగా, మరో బ్యాంకు అకౌంట్‌ నెంబరు స్టేట్‌మెంట్‌ తీస్తే ఎక్కడా గ్యాస్‌ సిలెండర్‌ సబ్సిడీ డబ్బులు తప్ప పెద్ద మొత్తంలో లావాదేవీలు కనిపించలేదు. ఇక స్వప్నప్రియ సోదరుడు ఈ సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశాడని, కాబట్టి ఆయనకు రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు కోర్టుకు నివేదించారు. ఇప్పుడు తీరా ఛార్జిషీటు వేయడానికి వారి వద్ద ఉన్న ఆస్తులు ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారని ఆరా తీస్తే ఏ రెండిరటికీ పొంతన కుదరడంలేదు. ఉన్న ఆస్తులకు, బ్యాంకులో లోన్లకు, కొనుగోలు చేసిన కాలానికి, స్వప్నప్రియ బంగారు నగలు తాకట్టు పెట్టారని చెబుతున్న కాలానికి పొంతన కుదరడంలేదు. దీంతో 2023లో మొదలైన ఈ కథకు ఇంతవరకు ముగింపు దొరకడంలేదు. అలా కాకుండా తేటగుంట కెనరాబ్యాంకు మాదిరిగా బంగారం ఆభరణాలు కనపడటంలేదనగానే శాఖాపరమైన విచారణ జరిపించి బ్రాంచి మేనేజర్‌ను బాధ్యుడ్ని చేసి, ఆ తర్వాత రికవరీ కోసం పోలీసు కేసు పెట్టుంటే ఇక్కడొక ప్రాణం పోయుండేదికాదు.. మరో కుటుంబానికి మగదిక్కయిన వ్యక్తి జైలుపాలయివుండేవాడు కాదు. సాధారణంగా బ్యాంకు, లేదా ప్రైవేటు ఆర్గనైజేషన్‌లో లోపాలు తలెత్తినప్పుడు శాఖాపరమైన విచారణే ముందు జరుగుతుంది. కానీ కేవలం ఇక్కడ ఒక కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, వారి మీదకు మీడియాను ఉసిగొలిపి ఆత్మహత్యకు కారణమైన వ్యవస్థలో అందరిదీ సమాన పాత్రే. అన్నింటికంటే విచిత్రమేమింటే.. రీజనల్‌ మేనేజర్‌ హోదాలో టీఆర్‌ఎం రాజు గార బ్రాంచిని సందర్శించినప్పుడు తాను అన్నీ వెరిఫై చేశానని, సక్రమంగానే ఉన్నాయంటూ బంగారం మాయమైందని చెప్పడానికి కొన్ని రోజుల ముందే రిజిస్టర్‌ మీద సంతకం చేశారు. ఒకవైపు బ్రాంచి మేనేజర్‌, మరోవైపు ఆడిటర్లు, ఇంకోవైపు ఆర్‌ఎంలు బ్రాంచి నిర్వహణ సరిగ్గా ఉందని సర్టిఫై చేసిన తర్వాత బంగారు నగలు మాయమయ్యాయంటే అందుకు బాధ్యులెవరు. సాధారణంగా ఒక బ్యాంకులో ఇటువంటి అంశం తలెత్తినప్పుడు బ్యాంకు లీగల్‌ ఆఫీసర్‌ ద్వారా బ్యాంకు చట్టం ఏం చెబుతుందో ఉటంకిస్తూ పోలీసులకు ఫిర్యాదు వెళ్తుంది. గార ఎస్బీఐ అంశంలో కూడా సంబంధిత లీగల్‌ ఆఫీసర్‌ అటువంటి ఫిర్యాదే చేశారు. కానీ దాన్ని స్థానికంగా ఇక్కడ న్యాయవాదితో మార్పించేసి టీఆర్‌ఎం రాజు స్వప్నప్రియ కుటుంబం మీదే ఏకపక్షంగా ఫిర్యాదు చేశారు. అలాగే ఈ కేసును అప్పుడు ఇన్వెస్టిగేట్‌ చేసిన డీఎస్పీ విజయ్‌కుమార్‌ కూడా ఇందులో లీగాలిటీని ఏమాత్రం పట్టించుకోలేదు. అప్పటి గార ఎస్‌ఐ కమ్‌ సీఐగా ఉన్న కామేశ్వరరావు చెప్పిన మేరకు అరెస్టులు చూపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ స్వప్నప్రియ తల్లి ఉరిట సరళ 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి తమ కేసును పునర్విచారించాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్వయంగా హోంమంత్రి అనితను పిలిచి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు ప్రస్తుత ఎస్పీ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో డీఎస్పీ వివేకానంద విచారణ చేపట్టగా, ఇందులో బ్యాంకు అధికారులు, మరీ ముఖ్యంగా అప్పటి పోలీసు అధికారుల తప్పిదం సుస్పష్టమైనట్టు భోగట్టా. దీంతో ఒక మహిళ మృతికి, ఆ కుటుంబంలో మరో వ్యక్తి జైలుపాలు కావడానికి కారణమైన పోలీసులను బయటపడేసేందుకు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టు భోగట్టా. మరోవైపు అప్పటి రీజనల్‌ మేనేజర్‌ రాజు కూడా తనను ఈ కేసులో ఇరికిస్తే తన పై అధికారుల పేర్లు కూడా చెబుతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అనేక బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని మాయం చేయడం, తక్కువ వడ్డీకి వచ్చే ఎంఎస్‌ఎంఈ రుణాలను బినామీ పేర్లతో సొంతానికి వాడుకోవడం, ఆ సొమ్ములు తీసుకొచ్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టడం పరిపాటిగా మారింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 20 ఏళ్ల వరకు రాని ధరలకు భూములను 2014`19 మధ్య విక్రయించేశారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ భూమ్‌ పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు మంది సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన బ్యాంకు అధికారులు అవి చెల్లక ప్రైవేటు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపించలేక ఇలా ఎవర్నో ఒకర్ని బలి తీసుకుంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page