`డ్రైవర్ అడ్డుకోవడంతో తప్పిన ముప్పు
`అతని చేతికి బలమైన గాయం
`నిందితుడు అధికార కార్యకర్తేనని గుర్తింపు
`ప్రచారం తుది అంకంలో జిల్లాలో కలకలం
`2014 ఎన్నికల్లో కూన రవిపైనా దాడి

సార్వత్రిక ఎన్నికలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. ప్రచారపర్వం మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఇంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఒక్కసారి భారీ కుదుపు చోటు చేసుకుంది. ఒక అభ్యర్థి సతీమణిపై హత్యాయత్నం ఘటనతో జిల్లా అంతా ఉలిక్కిపడిరది. ఆందోళనకు గురైంది. ఎన్నికల్లో పరస్పరం పోటీ పడటం, ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే గానీ.. ఇలా భౌతిక దాడులకు, అదీ మహిళా నేతపై హత్యాయత్నం చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. ఆమదాలవలస తెలుగుదేశం అభ్యర్థి, మాజీ విప్ కూన రవికుమార్ భార్య కూన ప్రమీలపై దుండగులు హత్యాయత్నానికి తెగబడ్డారు. సోమవారం రాత్రి పొందూరు మండలం కోటిపల్లి పంచాయతీ మజ్జిలపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న సమయంలో మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీటీసీ కూన ప్రమీలపై పూటుగా మద్యం సేవించిన వైకాపా కార్యకర్త గురుగుబెల్లి రమణ చాకుతో దాడికి పాల్పడ్డాడు. దాన్ని గమనించిన ప్రమీల కారు డ్రైవర్ కసవయ్య అడ్డుకోవడంతో ఆయన అరచేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం దాడికి ప్రయత్నించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పొందూరు మండలం కోటిపల్లి పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో కూన ప్రమీల సాయంత్రం ప్రచారం చేపట్టారు. రాత్రి కావడం, సమయం మించిపోతుందని భావించడంతో తమతో పాటు ఉన్న కూన రవి సోదరుడు సత్యారావును మరో గ్రామం పంపించిన ప్రమీల తాను, మిగతా అనుచరులతో కలిసి మజ్జిలపేటలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి టీడీపీ నాయకులు సమీపించిన సమయానికి కరెంటు సరఫరా నిలిపివేశారు. వర్షం కురుస్తున్నందున ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేసి ఉంటారని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత వరుసగా రెండుసార్లు విద్యుత్‌ను సుదీర్ఘ సమయం నిలిపివేయగా, అక్కడే రచ్చబండ మీద కూర్చుని టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నవారిని ఒక వర్గంవారు వెటకారం చేస్తుండగా ఆ గ్రూపు నుంచి గురుగుబెల్లి రమణ అనే వ్యక్తి చాకుతో ప్రమీలపై దాడికి దిగాడు. అంతకుముందే తమ ప్రచారాన్ని ముగించుకొని కూన సత్యారావు బృందం రచ్చబండ వద్దకు చేరుకోవడంతో ముందుగా ఆయనపై దాడి చేయడానికి నిందితుడు ప్రయత్నించాడు. అయితే టీడీపీ శ్రేణులు అప్రమత్తమవడంతో ప్లాన్ మార్చి కూన ప్రమీలపై ఎటాక్ చేసినట్లు చెబుతున్నారు. అయితే అప్రమత్తమైన డ్రైవర్ కసవయ్య నిందితుడి చేతిలో ఉన్న చాకును తన చేతితో పట్టుకొని ప్రమీలను పక్కకు తొలగించగలిగారు. దాంతో కసవయ్య అరచేతికి పెద్ద గాయమే అయింది. అయితే పోలీసులకు మాత్రం డ్రైవర్ మీద దాడి జరిగినట్లు టీడీపీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. కూన ప్రమీల మీద హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేస్తే, మరో ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ప్రచారానికి ఇబ్బందులు ఎదురవుతాయని భావించడం వల్లే డ్రైవర్ కసవయ్యపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ వేశారు.
ఆ కుటుంబంపై రెండో దాడి
కూన కుటుంబంపై దాడి ఇదే తొలిసారి కాదు. 2014 ఎన్నికల్లో కూన రవిపైనే దాడి జరిగింది. ఈ ఎన్నికల సమయంలో ఇదే పొందూరు మండలం కంచరాం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కూన రవిపై అప్పటి వైకాపా నాయకులు దాడి చేశారు. ఆ ఘటనలో రవికుమార్ ఎడమచెయ్యి విరిగింది. ఆ సమయంలో తాత్కాలికంగా ఓ సిమెంట్ కట్టు వేసుకొని ప్రచారాన్ని, ఎన్నికలను పూర్తిచేసిన కూన రవికి ఆ తర్వాత మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆయన ఎడమ చేతిలో ఎముకలు కొన్నిచోట్ల నుజ్జయిపోవడంతో చేతిలో ప్లేట్‌లు వేసి చికిత్స చేశారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల్లో కూన రవికుమార్ గెలిచి ప్రభుత్వ విప్‌గా ఐదేళ్ల పాటు పని చేశారు. ప్రస్తుతం దళ్లవలస ఎంపీటీసీగా ఉన్న ప్రమీల అంతకు క్రితం ఇదే పొందూరు మండలానికి ఎంపీపీగా కూడా పని చేశారు. స్వయంగా అభ్యర్థి సతీమణిపైనే దాడి చేయడం, గతంలో అభ్యర్థిపై దాడికి దిగడం వంటి చర్యలు శ్రీకాకుళంలో రాజకీయ సంప్రదాయాన్ని మార్చేస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇరుపార్టీలకు సంబంధించిన గ్రూపులు ఉండటం సహజం. కానీ కత్తితో ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడటమనేది పూర్తిగా అనైతికం. కూన ప్రమీల ఘటనపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Comentários