కౌన్సిలింగ్ అబద్ధం.. అన్యాయం నిజం!
- NVS PRASAD

- Jul 4, 2025
- 2 min read
జీవో నెంబరు 6ను ఫాలో కాని డీఎంహెచ్‌వో
రోస్టర్‌లో మొదటి వరుసకు మొండిచెయ్యి
ఆధారాలు సమర్పించిన సాయిరాం
రీకౌన్సిలింగ్ కోసం కలెక్టర్‌కు విన్నపం
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘జి.ఈశ్వరం, బి.ఉషారాణి, సీహెచ్ ప్రమీల, జి.అమ్ములు, జె.ఆదిలక్ష్మి, రుప్ప తులసికుమారి, ఆర్.స్వాతి, ఎస్.పార్వతి, జి.కుమారి, జి.యమున, జి.రేణుకా లావణ్య, పి.రోజా అను మేము శ్రీకాకుళం వార్డు హెల్త్ సెక్రటరీలుగా గత నెల 29, 30 తేదీల్లో జరిగిన బదిలీ కౌన్సిలింగ్‌లలో పాల్గొన్నాం. మమ్మల్ని వార్డు నుంచి వార్డుకు బదిలీ చేయాల్సివుండగా, దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. దయచేసి రీకౌన్సిలింగ్ జరపాల్సిందిగా కోరుతున్నాం.’’
- ఇది డీఎంహెచ్‌వోకు సచివాలయ గ్రేడ్-3 ఏఎన్‌ఎంలు చేసుకున్న విన్నపం.
‘‘బొంపాడ ఉషారాణి అను నేను శ్రీకాకుళం నగరంలో వార్డు హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నాను. ఇటీవల జరిగిన బదిలీలో నన్ను పొందూరు మండలం రాపాక గ్రామానికి పంపించారు. బదిలీ కౌన్సిలింగ్‌లో నా సీరియల్ నెంబరు 532. జీవోఎంఎస్ నెంబరు 6 ప్రకారం నా బదిలీ అర్బన్‌లో వార్డు నుంచి వార్డుకు మాత్రమే జరగాలి. అలా కాకుండా పొందూరు మండలం పంపారు. మీరు న్యాయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.’’
- ఇదీ మరో గ్రేడ్-3 ఏఎన్‌ఎం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు చేసుకున్న దరఖాస్తు.

సమగ్రంగా పరిశీలిస్తే వార్డు సచివాలయాల్లో పని చేసిన గ్రేడ్-3 ఏఎన్‌ఎంల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలిపోయింది. మొత్తం 605 మంది ఏఎన్‌ఎంలలో మూడొంతులకు పైగా అన్యాయం జరిగిందని ఎన్జీవో సంఘ నాయకుడు హనుమంతు సాయిరాం గ్రేడ్-3 ఏఎన్‌ఎంలతో పాటు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలవడం ఇందుకు నిదర్శనం. అర్బన్‌లో పనిచేసే గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు అర్బన్‌లోనే మరో సచివాలయానికి బదిలీ చేయాలి. అలాగే రూరల్‌లో పని చేస్తుంటే.. సొంత మండలం కాకుండా మరో చోటకు బదిలీ చేయొచ్చు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం అర్బన్‌లో ఉండే ఖాళీలను కూడా రూరల్‌లో పని చేసిన గ్రేడ్`3 ఏఎన్‌ఎంలతో భర్తీ చేశారు. దీనిపై కౌన్సిలింగ్ చివరిలో దుమారం రేగడం వల్ల ఆ సమయం నుంచి అర్బన్ నుంచి అర్బన్‌కు, రూరల్ నుంచి రూరల్‌కు బదిలీ చేశారు. బదిలీ రోస్టర్‌లో మొదటి స్థానంలో ఉన్నవారెవరికీ అర్బన్‌లో కోరుకున్న చోటుకు పోస్టింగ్ లేకపోవడంతో రూరల్ వెళ్లిపోయారు. కానీ చివరిలో కొందరు నిలదీయడంతో వారికి మాత్రం అర్బన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. దీనివల్ల ముందువరుసలో ఉండాల్సినవారు నష్టపోయారని, కౌన్సిలింగ్ చివరలో ఉన్నవారు లబ్ధిపొందారని ‘సత్యం’ ‘ఏఎన్‌ఎంల కౌన్సిలింగ్ పెంట పెంట’ శీర్షికన ఇటీవల ఓ కథనం ప్రచురించింది. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ను కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. మళ్లీ రీకౌన్సిలింగ్ చేయాలని కోరారు. అందుకు జీవోలు, తమకు బదిలీ అయిన ప్రాంతానికి సంబంధించిన ఆర్డర్లు చూపించారు. నగరంలో దండివీధి సచివాలయ పరిధి 29, 31 వార్డులకు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్-3 ఏఎన్‌ఎం)గా పని చేస్తున్న సిరుగుడి పార్వతికి లావేరు బదిలీ చేశారు. మంగువారితోట సచివాలయంలో పని చేసిన చింతాడ ప్రమీలకు పొందూరు మండలం కనిమెట్ట పంపేశారు. దమ్మలవీధి హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్న శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి విజయకుమారికి కిల్లిపాలెం`2కు బదిలీ చేశారు. తుమ్మిడి మీనాక్షి బాకర్‌సాహెబ్‌పేట సచివాలయంలో పని చేస్తుండగా, ఈమెకూ అర్బన్‌లో స్థానం కల్పించలేదు. జమ్మాన ఆదిలక్ష్మి కలెక్టర్ బంగ్లా రోడ్డులో హెల్త్ సెక్రటరీగా పని చేస్తుండగా, ఆమెకు ఎచ్చెర్ల మండలం ధర్మవరం బదిలీ చేశారు. చంపాగల్లివీధి సచివాలయంలో పని చేస్తున్న రుప్ప తులసికుమారిని పొందూరు మండలం దళ్లవలసకు పోస్టింగ్ ఇచ్చారు. గురుగు కుమారి అర్బన్‌లో 26వ వార్డులో పని చేస్తుండగా, ఆమె శ్రీకూర్మం`1 కోరుకున్నారు. ఆ మేరకు ఆమెకు బదిలీ చేశారు. కానీ అదే శ్రీకూర్మం`1కు వేరేవారికి కూడా బదిలీ చేసినట్టు ఆర్డరిచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు శ్రీకూర్మంలో ఉంటారో తెలియదు. కౌన్సిలింగ్ రోస్టర్‌లో డేటాఫ్ జాయినింగ్, వయసు వంటివాటి ఆధారంగా ముందువరుసలో ఉన్నవారికి సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వమని, అర్బన్‌లో పనిచేసినవారు మళ్లీ అర్బన్‌లో కోరుకోకూడదని జూమ్ కౌన్సిలింగ్‌లో చెప్పిన డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలోని కౌన్సిలింగ్ బోర్డు పోనీ ఆ మాటమీదైనా నిలబడి అందరికీ ఒకేలా చేసిందా.. అంటే అదీ లేదు. సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన జీవోఎంఎస్`6 తమకు అర్థం కాలేదని, అందుకే ఈ విధంగా చేశామని చెప్పుకోవచ్చు. కానీ కొందరికి సొంత మండలాలు ఇవ్వక, ఇంకొందరికి అర్బన్‌లో స్థానం కల్పించక ఇష్టారీతిన బదిలీలు చేపట్టడం వల్ల ఇక్కడ కచ్చితంగా పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారివుంటాయన్న అభిప్రాయం బలపడుతోంది. అందుకే రీకౌన్సిలింగ్ చేయాలని వీరు పట్టుపడుతున్నారు.










Comments