కాంపౌండ్ వాల్ కట్టడానికి కాలువ కప్పేశారు..!
- ADMIN
- Feb 15
- 2 min read
రోడ్లపై పారుతున్న మురుగునీరు
లాంగ్‌లీవ్‌లో శానిటేషన్ సెక్రటరీ
అసలు విషయం తెలియక ప్రజల గగ్గోలు
కప్పేసిన కాలువకు, సచివాలయానికి మధ్య దూరం 50 అడుగులే
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కాలువలు సరిగా తీయడంలేదురా బాబూ.. కంపుతో ఉండలేకపోతున్నాం.. దోమల దాడి పెరిగిపోయింది.. విషజ్వరాలతో ఆసుపత్రులపాలవుతున్నామని గగ్గోలు పెడుతున్న ప్రజలకు సైనిక్ పార్క్ కాంపౌండ్‌వాల్ పుణ్యమాని మరింత సమస్య ఎదురైంది.

ఇందిరానగర్ కాలనీలో మిర్తిబట్టికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఎప్పుడో కట్టబోయే సైనిక్ పార్క్‌కు కాంపౌండ్ వాల్ కోసం కాంట్రాక్టర్ కాలువనే ఇసుక బస్తాలతో ఏకంగా కప్పేశారు. దీంతో వెనుక ప్రాంతాల రోడ్లపై కాలువ నీరు పొంగి పొర్లుతోంది. ఎందుకు కాలువలు నిండిపోయాయో అసలు విషయం ఎవరికీ తెలియదు. పార్క్ కాంపౌండ్‌వాల్ కట్టే కాంట్రాక్టర్ మాత్రం కాలువ మూయకపోతే గోడ కట్టడం ఎలా సాధ్యమవుతుందని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
మిర్తిబట్టి.. ఇది ఒకప్పుడు పంటపొలాలకు నీరందించే పిల్లకాలువ. కాలనీవాసుల ఆక్రమణల పుణ్యమాని చిన్నదిగా మారిపోయింది. ఎప్పుడైతే నగరంలో పొలాల్లో ఇళ్లు లేచాయో పంటకాలువ కాస్త మురికికాలువగా మారిపోయింది. నగరంలో రెండొంతుల ప్రాంతంలో ఉన్న కాలువల నుంచి మురుగునీటిని నదిలోనో, లేదా మరోచోటో కలిపే ప్రధాన మార్గం మిర్తిబట్టే. అంటే మిర్తిబట్టిలో ఎక్కడ అడ్డంకులున్నా నగరంలో రెండొంతుల భాగం జలమయమైపోవడం స్థానికులకు తెలుసు. ఇప్పుడు ఇదే మిర్తిబట్టికి ఆనుకొని ఇందిరానగర్ కాలనీలో సైనిక్ పార్క్ ఒకటి నిర్మిస్తారట. దీనికోసం ముందుగా ప్రహరీ కడుతున్నారు. సుందరీకరణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదుగానీ మిర్తిబట్టికి ఆనుకొని ప్రహరీ కడుతుండటం వల్ల మురికినీటి ప్రవాహానికి కాలువలో ఓ దగ్గర పూర్తిగా మూసేశారు. దీంతో దిగువ ప్రాంతంలో ఉన్న తుమ్మావీధి, కొన్నవీధి మెయిన్ రోడ్డు, పీఎస్‌ఎన్‌ఎం హైస్కూల్ వెనుకభాగం, జంగాలవీధిలు పూర్తిగా మురుగుతో మునిగిపోయాయి. ప్రవాహం ఉన్నచోట ప్రహరీలు నిర్మించాలంటే నీటి ప్రవాహాన్ని ఆపక తప్పదు. కానీ దీన్ని యుద్ధప్రాతిపదిక మీద చేయాలి. రోజుల తరబడి మురుగునీరు నిల్వ ఉంచడంతో పార్క్ కట్టడం వల్ల వచ్చే ఆహ్లాదం కంటే రోగాలబారిన పడిన ప్రజల బాధలు ఎక్కువవుతాయి. దీనిపై ప్రశ్నిస్తే రెండు రోజులు ప్రజలకు ఆమాత్రం ఇబ్బంది తప్పదని నగరపాలక అధికారులు అంటున్నారు. కాలువ కప్పిన గంటకే.. అదీ కుళాయిలు ఆగిపోయిన తర్వాత మురుగునీరు రోడ్డెక్కితే రెండు రోజుల మాట దేవుడెరుగు.. రెండో పూటకే రోడ్లపై ముడుకులకు పైన ఎత్తులో కాలువనీరు ప్రవహించడం ఖాయం. రోగాలు, దోమలు ప్రజలకు ఎలాగూ అలవాటైపోయాయి. డీసీసీబీ కాలనీ సచివాలయ శానిటేషన్ సెక్రటరీ లాంగ్‌లీవ్ పెట్టి సెలవులో ఉన్నారు. కాలువల విషయం ఎవర్ని సంప్రదించాలో తెలియక టీడీపీ వార్డు ఇన్‌ఛార్జిల వద్దకు వెళ్లి చెబితే, వారు కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి కాలువ పూర్తిగా మూసేస్తే ఎలా అని ప్రశ్నించారు. కనీసం నీరు ఎదురుగా ఉండే గెడ్డలోకి వెళ్లే మార్గం వదలాలని కోరారు. అయినా సదరు కాంట్రాక్టర్ దీనిపై స్పందించకపోవడం విచారకరం. ఇంకో విషయమేమంటే.. ఈ కాలువలో ఇసుక బస్తాలు వేసి కప్పెట్టిన 50 అడుగుల దూరంలో ఈ ఏరియా సచివాలయం ఉన్నప్పటికీ వారసలు పట్టించుకోలేదు.


ఇబ్బందే.. అయినా తప్పదు
ఖాళీ స్థలంలో పార్క్ నిర్మాణానికి ప్రతిపాదన చేశాం. దానిలో భాగంగా నగరపాలక సంస్థ రూ.40 లక్షలు సాధారణ నిధులు వెచ్చించి చుట్టూ ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేయనున్నాం. ప్రహరీ నిర్మాణంలో భాగంగా పునాదులు వేయడానికి కాలువలో నీరు చేరకుండా అడ్డు పెట్టాం. ఇది కొంత ఇబ్బందికర పరిస్థితే అయినా తప్పదు. గతంలో ఇది పంటకాలువగా ఉండేది. ప్రస్తుతం మురికికాలువగా మారిపోయింది. దీనివల్లనే సమస్య ఉత్పన్నమైంది.
దక్షిణామూర్తి, ఎంఈ
Comments