top of page

‘కొంప’లు ముంచడంలో అలుపెరుగని ‘మన్నం’ వీరుడు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • 23 మంది మహిళల నుంచి రూ.50లక్షలు వసూలు

  • హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరయ్యాయంటూ తాళాల అప్పగింత

  • రాష్ట్ర సచివాలయంలో తిప్పి సొమ్ములు మింగేసిన ఘనుడు

  • డబ్బులు వెనక్కి అడిగితే అట్రాసిటీ బెదిరింపులు




(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఆమధ్య గుజరాత్‌లో ఒకడు బంగారం షాప్‌కి వెళ్లి రెండు కిలోలు బంగారం కొన్నాడు. కోటి అరవై లక్షల నోట్ల కట్టలు ఇచ్చాడు. షాపోడు కౌంటింగ్‌ మెషీన్లలో పెట్టి కౌంట్‌ చేసుకుని ఓకే చెప్పాడు, వీడు బంగారంతో వెళ్లిపోయాడు. తర్వాత షాపతనికి తెలిసిందేటంటే.. ఆ నోట్లకట్టల్లో పైన, కింద ఒరిజినల్‌ నోట్లు, లోపల మాత్రం నకిలీ నోట్లు ఉన్నాయి. నకిలీ అంటే ఎలా? కలర్‌ తేడానో, ప్రింటింగ్‌ తేడానో కాదు.. వాటిలో గాంధీ బొమ్మ స్థానంలో అనుపమ్‌ ఖేర్‌ ఓ సినిమాలో గాంధీ వేషం వేసిన బొమ్మ ప్రింట్‌ అయ్యింది.

గాంధీనగర్‌లో మోరిస్‌ స్యామ్యూల్‌ అనేవాడు నకిలీ న్యాయస్థానం స్టార్ట్‌ చేసేశాడు. ‘షెషన్స్‌ కోర్ట్‌’ అని బోర్డ్‌ పెట్టి జడ్జ్‌ కోట్‌ వేసుకుని, జడ్జ్‌ సీట్‌లో కూర్చుని ‘ముద్దాయిని ప్రవేశపెట్టండి’ అనగానే, పోలీసులు, లాయర్లు, బాధితులు అందరూ ‘మాకు న్యాయం చేయండి’, ‘మాకు న్యాయం చేయండి’ అంటూ ఇతని చుట్టూ మూగారు. ఇతను విచ్చలవిడిగా న్యాయం చేస్తూ పోయాడు. ఈ తతంగం ఐదేళ్లు అప్రతిహతంగా సాగింది. ఈ ప్రాసెస్‌లో మనోడు బాగానే ఆస్తులు, స్థలాలు, పొలాలు వెనకేసుకున్నాడు.

గుజరాత్‌లోని బికనీర్‌-మోర్బీ హైవేపై ఓ టోల్‌ప్లాజా ఉంది. ఆ టోల్‌ప్లాజా వాహనదారుల నుంచి అధిక టోల్‌ వసూల్‌ చేయడాన్ని చూసి, ఆ పక్క గ్రామంలోని ధర్మేంద్ర సింగ్‌ జాలా అనే వ్యక్తి ‘ఆపండి ఈ అన్యాయం’ అని నినదించాడు. ఎవరూ ఆపకపోవడంతో, ఆ టోల్‌ప్లాజాకి సమాంతరంగా 600 మీటర్ల దూరంలో మరో టోల్‌ప్లాజా నిర్మించి, బారికేడ్స్‌లో వెహికల్స్‌ వెళ్లేంత ఓపెనింగ్‌ తెరిచి, మట్టి రోడ్డు వేసి, ఒరిజినల్‌ టోల్‌రేట్‌లో 80 శాతం డిస్కౌంట్‌ ఇచ్చాడు. ఇంకేముంది, వాహనాలన్నీ అటు వెళ్లడం మొదలైంది. ఈ తతంగం రెండేళ్లు గడిచాక గానీ టోల్‌ కంపెనీకి అసలు విషయం తెలీలేదు.

సందీప్‌ రాజ్‌పుత్‌ అనే మరో ట్యాలెంటెడ్‌ ఫెలో గుజరాత్‌లోని చోటా ఉదయ్‌పూర్‌ జిల్లా మోడేలీ తాలుకాలో, ఓ ప్రభుత్వ కార్యాలయం స్టార్ట్‌ చేసేశాడు. ఆదివాసీ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం ఖర్చు చేస్తున్న రూ.5 కోట్ల నిధుల్ని నొక్కేశాడు.

కిరణ్‌ భాయ్‌ పటేల్‌ అనే మరో ప్రముఖుడు కాశ్మీర్‌ డీజీపీ ఆఫీస్‌కి వెళ్లి, తాను ప్రధానమంత్రి ఆఫీస్‌ నుంచి ఓ స్పెషల్‌ ఆపరేషన్‌ కోసం కాశ్మీర్‌ వచ్చానని, తనకు ఫెసిలిటీస్‌ ఏర్పాటు చేయమని చెప్పాడు. అంతే, ఆ తర్వాత నాలుగు నెలలు అక్కడి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో బస, జెడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ, ఫుడ్డూ, బెడ్డూ మొత్తం ప్రభుత్వ లాంఛనాలతో ఎంజాయ్‌ చేశాడు.

రాజ్‌కోట్‌ జిల్లా పిపాలియా గ్రామంలో కొందరు నిరుద్యోగ యువకులు ఓ ఫేక్‌ స్కూల్‌ స్టార్ట్‌ చేసి, ఆరేళ్ల పాటు మధ్యాహ్న భోజన నిధులు చక్కగా ఆరగించారు.

ఇవన్నీ గుజరాత్‌లో జరిగితే చెప్పుకుంటారా.. తాను చేసింది మాత్రం చెప్పుకోరా? అనుకున్నాడో ఏమో? నగరంలో మంగువారితోటకు చెందిన పంచాయతీ కార్యదర్శి మన్నం సతీష్‌ హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరు చేయిస్తానంటూ సొమ్ములు తీసుకొన్ని కొన్నాళ్ల తర్వాత వారి చేతిలో ప్లాట్‌ నెంబరుతో కూడిన కాగితం, తాళాల గుత్తి పెట్టాడు. తీరా అక్కడకు వెళ్లి చూస్తే అప్పటికే ఆ ఇళ్లు వేరేవారికి ప్రభుత్వం ఇచ్చేసింది. ఈ తాళాలు ఎక్కడివని ఆరాతీస్తే స్థానికంగా ఓ హార్డ్‌వేర్‌ షాపునకు వెళ్లి హోల్‌సేల్‌గా తాళాలు కొని వారి చేతిలో పెట్టేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ ఫిర్యాదు చేశారు. విచిత్రమేమిటంటే.. సొమ్ములు తీసుకున్న మాట వాస్తవమేనని సతీష్‌ విచారణ జరిగిన ప్రతీచోట అంగీకరించడం. ఎందుకంటే.. కొందరు నేరుగా నగదు ఇస్తే, జేబులో అంత మొత్తం లేకపోతే ఫోన్‌ పే, అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా అప్పటికప్పుడు సొమ్ములు తీసుకోవడంతో సతీష్‌ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోతున్నాడు. అయినా కూడా ఆయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోడానికి పంచాయతీ, జిల్లాపరిషత్‌ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

ఉద్యోగాలు వేయిస్తానని ఒక ప్రభుత్వ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలుచేసినా జిల్లా అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటే.. సదరు ఉద్యోగి ఏ స్థాయిలో వ్యవహారం నడుపుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. పంచాయతీ కార్యదర్శిగా మన్నం సతీష్‌పై నమోదైన అభియోగాలపై ఇప్పటివరకు అధికారులు, పోలీసులు జరిపిన డజనుకు పైగా విచారణల్లో డబ్బులు తీసుకున్నమాట వాస్తవమేనని, తీసుకున్న డబ్బుల్లో కొంత తిరిగి చెల్లించానని లిఖిత పూర్వకంగా, మౌఖికంగా అంగీకరించినట్టు విచారణ చేసిన అధికారులు చెబుతున్నారు. అయితే చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీనికి కారణం సతీష్‌ మోచేతి నీళ్లు తాగే అధికారులు జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా పరిషత్‌లో ఉండడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచారణలో బాధితులు ఇచ్చిన వాంగ్మూలం, నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసిన ఆధారాలు అధికారులకు సమర్పించినా సతీష్‌ను కాపాడే ప్రయత్నాలు చేస్తునేవున్నారు. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉందని చెప్పి సతీష్‌పై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.

శ్రీకాకుళం నగరం కంపోస్టు కాలనీలో నిర్మించిన 192 ఇళ్లల్లో 23 హుద్‌హుద్‌ ఇళ్లను 23 మంది మహిళలకు రాసిచ్చేశాడు. అంతేకాదు.. వాటి తాళాలను చూపించి వారి నుంచి తలా రూ.2 లక్షలు వసూలు చేశాడు. 23 మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి రూ.50 లక్షలు సతీష్‌ చేతిలో పెట్టారు. బాధితుల్లో నగరానికి చెంది ఢల్లీి, ముంబాయిలో నివాసముంటున్న మహిళలు ఉండడం విశేషం. వీరందరికీ ప్రాంశరీ నోట్లు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. 23 మంది మోసపోయినట్టు గుర్తించి సతీష్‌ను నిలదీయడంతో వీరి నుంచి వసూలు చేసిన రూ.50 లక్షల్లో రూ.25 లక్షలు రెండేళ్ల క్రితం వెనక్కి ఇచ్చేశాడు. మిగతా రూ.25లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. సతీష్‌ బాధితుల్లో ఎక్కువ మంది ఆయన సామాజికవర్గానికి చెందిన వారితో పాటు సన్నిహితులు, బంధువులే కావడం విశేషం. బాధితుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ వేదికగా మోసాలకు పాల్పడితే, విభజన అనంతరం అమరావతికి మకాం మార్చుకున్నాడు. అమరావతిలో అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి పేరు చెప్పి జిల్లాలో నిరుద్యోగులను ముంచేశాడు. తాను కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉన్నానని, దీనిలో తన ప్రమేయం లేదని సతీష్‌ వాదన వినిపిస్తున్నారు.

బెదిరింపులు

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మకం కలిగించేందుకు డబ్బులు తీసుకొని కలెక్టరేట్‌, అమరావతిలోని సచివాలయం చుట్టూ తిప్పాడు. నిరుద్యోగుల నుంచి తీసుకున్న డబ్బులతో స్టార్‌ హోటల్స్‌లో బస చేసి జల్సాలు చేస్తుంటాడని బాధితులు చెబుతున్నారు. ఉద్యోగం రాలేదు కదా.. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేస్తే చెక్కులు రాసి ఇస్తుంటాడు. బాధితులు బ్యాంకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగడమే. చెక్కను బ్యాంకులో డ్రాప్‌ చేస్తే ఖాతాలో డబ్బులు లేవని తిప్పి పంపిన ఘటనలు లెక్కకు మించి ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఫోన్‌ చేసి చెక్‌ బౌన్స్‌ అయిందని చెబితే గంట తర్వాత వెళ్లాలని, లేదంటే రెండురోజులు ఆగి వెళితే నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతుంటాడని బాధితులు వాపోతున్నారు. ఎవరైనా నిలదీస్తే అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని బెదిరించడంతో పాటు నోటీసులు కూడా ఇచ్చినట్టు కొందరు చెబుతున్నారు. కేసులు పెట్టినంత మాత్రాన డబ్బులు వస్తాయా అంటూ బాధితులతో పరాచకాలు ఆడడం, కోర్టులు, తీర్పులు వచ్చే నాటికి అంతా అయిపోతుందని చెప్పి సతీష్‌ హెచ్చరిస్తుంటాడని బాధితులు చెబుతున్నారు.

అమరావతిలో పరిచయాలతో..

ఇరవై ఏళ్లుగా నిరుద్యోగులను ప్రైవేట్‌, ప్రభుత్వ ఉద్యోగం, లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఇప్పిస్తానని మోసం చేసి దోచుకున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా, సస్పెండ్‌ చేసినా ఆయన వ్యవహారంలో మార్పు రాలేదు. కేసు పెడితే పోలీసులను, సస్పెండ్‌ చేస్తే అధికారులను మేనేజ్‌ చేస్తూ రెండు మూడు నెలల్లోనే విధుల్లో చేరిపోతాడు. పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో ఉండకుండా ఆన్‌డ్యూటీ పేరుతో అందుబాటులో ఉండడని స్థానికులు చెబుతున్నారు. ఫేస్‌ రికగ్నైజ్డ్‌ యాప్‌లో హాజరు వేయకుండా జిల్లా పంచాయతీ కార్యాలయంలో మేనేజ్‌ చేసుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అమరావతిలోని సచివాలయంలో అనిల్‌కుమార్‌తో పాటు మరికొందరితో ఉన్న పరిచయాలతో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సచివాలయానికి నిరుద్యోగులను తీసుకువెళ్లి అక్కడ పరిచయం ఉన్న ఉద్యోగులతో వీరిని మాట్లాడిరచి బురిడీ కొట్టించి డబ్బులు తీసుకుంటున్నట్టు బాధితులు చెబుతున్నారు. నిరుద్యోగులతో సంతకాలు పెట్టించడం, సర్టిఫికేట్‌లు తీసుకోవడం లాంటి చిల్లర పనులు చేసి వారికి నమ్మకం కలిగించేలా వ్యవహరించి నిండా ముంచేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page