top of page

కేరళ కురుక్షేత్రం

  • Guest Writer
  • Apr 16
  • 1 min read

రాహుల్ గాంధీ నాయకత్వానికి అగ్నిపరీక్ష!


కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. మే 4న వెలువడనున్న ఫలితాలు కేవలం రాష్ట్ర భవిష్యత్తునే కాదు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ దార్శనికతను, పట్టును కూడా తేల్చనున్నాయి. వరుసగా రెండు ఓటముల తర్వాత యూడీఎఫ్ ఈసారి కూడా అధికారాన్ని అందుకోలేకపోతే, అది రాహుల్ గాంధీ నాయకత్వంపై కోలుకోలేని దెబ్బ అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేరుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. వామపక్షాలు ఈ ఎన్నికలను విజయన్ ఇమేజ్ చుట్టూ తిప్పడాన్ని రాహుల్ ‘అహంకారానికి పరాకాష్ఠ’గా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో విఫలమైతే రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై పార్టీ లోపల, బయట తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. 45% పైగా మైనారిటీ జనాభా ఉన్న కేరళలో వారిని ఆకర్షించలేకపోతే, అది గాంధీ రాజకీయ వ్యూహ వైఫల్యంగానే పరిగణించబడుతుంది. వామపక్షాలు తమ సైద్ధాంతిక స్వచ్ఛతను కోల్పోయి, అధికారం కోసం బీజేపీతో జట్టు కట్టాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఈ ఎన్నికలను ‘సిద్ధాంతాల పోరాటం’గా మార్చాయి.

కేరళ విజయం కాంగ్రెస్‌కు కేవలం ఒక రాష్ట్ర అధికారం మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమికి నాయకత్వం వహించే అర్హతను నిర్ణయించే గీటురాయి. కాంగ్రెస్ పునరుజ్జీవం దక్షిణ భారతదేశం నుంచే, అందునా కేరళ నుంచే ప్రారంభం కావాలి. ఇక్కడ ఓడిపోతే దక్షిణాన పార్టీ పతనం మొదలైనట్లే. యూడీఎఫ్ ఓటమి బీజేపీకి బలపడటానికి మార్గం సుగమం చేస్తుంది, ఇది కాంగ్రెస్ జాతీయ ఎజెండాను దెబ్బతీస్తుంది. ప్రస్తుతం ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు యూడీఎఫ్‌కు కలిసొచ్చే అంశాలు. అయితే, ఓబీసీ ఓట్లపై బీజేపీ వేసిన కన్ను ఎవరికి నష్టం కలిగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ యూడీఎఫ్ గెలిస్తే, వి.డి.సతీశన్ వంటి నేతలను రాహుల్ గాంధీ ఎలా సమన్వయం చేస్తారనేది తర్వాతి సవాలు. మే 4 ఫలితాలు రాహుల్ గాంధీని ‘విజేత’గా నిలబెడతాయా లేక ఆయన నాయకత్వంపై మరోసారి ‘మథనం’ మొదలయ్యేలా చేస్తాయా అనేది వేచి చూడాలి.

- టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page