క్రికెట్ ఎంపికకు ‘తాళాలు’ ..
- BAGADI NARAYANARAO

- Jun 26
- 1 min read
ఏసీఏ సెలక్షన్లకు అడ్డంకులు
గంటలపాటు గేట్ బయటే క్రీడాకారులు
కూన రవికుమార్ జోక్యంతో తెరచుకున్న గేట్లు
ఏసీఏకు ఫిర్యాదు చేసిన సమన్వయ కమిటీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా క్రికెట్ సంఘంలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి క్రీడాకారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అండర్-19 మహిళల, పురుషుల మల్టీడేస్ జట్ల సర్టిఫికెట్ పరిశీలనతో పాటు జట్టు ఎంపికలు నిర్వహించాల్సి ఉండగా,క్రికెట్ సంఘం భవనం గేటుకు అదనంగా తాళాలు వేయడంతో అసహన పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 7 గంటలకే ఆర్ట్స్ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీఏ నియమించిన సెలక్టర్లు, తాత్కాలిక సమన్వయ కమిటీ సభ్యులు కూడా సమయానికి హాజరయ్యారు. అయితే, కార్యాలయ గేటుకు ముందే తాళాలు ఉండగా, వాటికి మరోసారి డబుల్ లాక్ వేయడంతో సెలక్షన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
సుమారు మూడు గంటల పాటు సెలక్టర్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు గేట్ బయటే వేచిచూసినా తాళాలు తీయకపోవడంతో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లగా, ఆయన వెంటనే గేట్లు తెరవాలని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం ఉదయం 10 గంటల తర్వాత గేట్లు తెరుచుకోవడంతో సర్టిఫికెట్ పరిశీలన, నెట్ ప్రాక్టీస్ ద్వారా జట్టు ఎంపికలు సజావుగా జరిగాయి.
ఈ ఘటనపై ఏసీఏ తాత్కాలిక సమన్వయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం జరిగిందని పేర్కొంటూ ఏసీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
జిల్లా క్రికెట్ సంఘం వ్యవహరించిన తీరుపై క్రీడాకారుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల జిల్లా క్రికెట్‌కు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు, ఏసీఏ పోటీల్లో జిల్లా ప్రాతినిధ్యమే కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏసీఏ గుర్తింపు ప్రక్రియకు ఆటంకాలు కొనసాగితే, ఏడాది పొడవునా జిల్లా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
సంఘంలో కొందరి నిర్ణయాల వల్ల మొత్తం జిల్లా క్రికెట్ వ్యవస్థ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే, వాస్తవ పరిస్థితులను జిల్లా సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు పూర్తిగా తెలియనివ్వకుండా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే జోక్యం తర్వాతే గేట్లు తెరుచుకోవడం, ఎంపికలు ప్రారంభం కావడం ప్రస్తుతం జిల్లా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఏసీఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






Comments