క్రికెట్‌లో అతడో సరికొత్త విరాటపర్వం!!
- Guest Writer
- May 13
- 6 min read
అతడి క్రమశిక్షణ, శారీరక, మానసిక దృఢత్వం, గేమ్‌కు ముందు తాను సంసిద్ధమయ్యే తీరు.. క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఆయనలా ఫిట్‌గా ఉండాలనే కోరిక ఇతర క్రికెటర్లలోనూ రగిలించాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్ అవార్డు స్వీకరించే సమయంలో.. కింగ్ కోహ్లీ గురించి వరల్డ్ టాప్ బ్యాట్స్ మ్యాన్ బ్రయాన్ లారా చెప్పిన మాటిది.
మూడు ప్రపంచ కప్పుల్లో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ కప్‌గా నిల్చిన ఘనత మన పరుగుల మిషన్‌ది. 2014, 2016 టీ20 ప్రపంచకప్స్‌తో పాటు.. 2023లో జరిగిన ప్రపంచ కప్‌లోనూ 765 అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కోహ్లీనే కొల్లగొట్టాడు.
భారత్ ప్రపంచకప్ సాధించిన 2011లోనూ విరాట్ జట్టులో కీలక సభ్యుడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ప్రాతనిథ్యం వహించిన కోహ్లీ.. 2024లో ఏకంగా వరుసబెట్టి 17 మ్యాచులు గెల్చిన టీ20 జట్టులోనూ సభ్యుడిగా తన క్రికెట్ కలను నెరవేర్చుకున్నాడు. ఆ ఫైనల్ తర్వాత తాను టీ20ల నుంచి రిటైర్డవుతున్నట్టు ప్రకటించేశాడు. ఇప్పుడు ఏకంగా టెస్ట్ క్రికెట్ నుంచీ విరమణ ప్రకటించేశారు. భౌతికంగా, మానసికంగా తానెంతవరకు క్రీజులో సరిగ్గా ఆడగలడో తనది తనకే తెలిసిన ప్లేయర్. ఇంకెవరో చెబితే, ఆరోపణలు గుప్పిస్తే.. బలవంతంగా తప్పుకునే ఆటగాడిగా కాకుండా కోహ్లీ తీసుకున్న నిర్ణయం ఆయన మైండ్‌సెట్‌ను చెప్పేది.
కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెస్ట్, వన్డే, టీ20ల్లోనూ భారత్ ఎన్నో విజయాలతో దూసుకుపోయింది. భారత్ నుంచి ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్లలో కోహ్లీ కూడా ఒక్కడిగా నిల్చాడు. అయితే, కోహ్లీ తన క్రికెట్ జీవితంలో ఐపీఎల్‌లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. ఒక్కటంటే ఒక్క కప్పును కూడా ఐపీఎల్ ఆ జట్టుకు అందించలేకపోవడం ఒకింత వెలితి.
ఢల్లీి కుర్రాడైన విరాట్ కోహ్లీ.. 1998లో వెస్ట్ ఢల్లీి క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. 2002లో ఢల్లీి అండర్ 15 జట్టుకు ఆడాడు. ఆ తర్వాత అండర్-17 జట్టులో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత పలు మ్యాచులాడినా.. అప్ అండ్ డౌన్స్ చూడాల్సి వచ్చింది. కానీ, 2008లో మలేషియా కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్పులో జట్టును గెలిపించడంతో.. అతడి వైపు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ చూపు పడిరది. ఆర్సీబీ నుంచి 30వేల డాలర్లకు కాంట్రాక్ట్ లభించింది. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగిడిన కోహ్లీ.. 2009లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 405 పరుగులు చేసి జాతీయజట్టు సెలెక్టర్ల మనసు దోచుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్!
ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించకుండా.. ఒకే ఒక్క జట్టు కోసం ఆడిన ఆటగాడిగా కూడా కోహ్లీదే రికార్డ్. అలా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతూ వస్తున్న కోహ్లీ మొదటి రెండు సీజన్లలో గొప్ప ప్రదర్శన కనబర్చలేకపోయాడు. కానీ 2010లో వైస్ కెప్టెన్‌గా పదోన్నతి లభించాక అతడి ఆటతీరు మెరుగైంది. 2011లో ఆర్సీబీని ఫైనల్స్‌కు తీసుకెళ్లగలిగినా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓటమిపాల వ్వడంతో ఆ విజయకాంక్ష ఇప్పటివరకూ ఓ అందని ద్రాక్షగానే మిగిలి పోయింది. కానీ, అదే ఐపీఎల్ 2016 సీజన్‌లో కోహ్లీ అంటే ఓ పరు గులు మిషన్ అనేలా చితకబాదాడు. ఏకంగా 4 సెంచరీలతో 973 పరు గులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 8004 పరుగులు చేసిన ఘనత ఇప్పటికీ కోహ్లీ పేరుపైనే ఉంది.
పాక్‌తో ఆ మ్యాచ్ ఎప్పటికీ చిరస్మరణీయం!
క్రికెట్ అంటే అమితమైన క్రేజ్ చూపించే భారత్ వంటి దేశాల్లో కొన్ని మ్యాచులు చిరస్మరణీయాలుగా మిగిలిపోతాయి. అందులో జస్ట్ 23 ఏళ్ల వయస్సులో.. అదీ ఛేజింగ్.. అందులోనూ దాయాది దేశమైన పాక్‌తో విరాట్ మెరుపుల కథ ఇది. తన టెస్ట్ క్రికెట్‌కి కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన క్రమంలో.. వాట్ ఈజ్ కోహ్లీ అని చెప్పే ఓ వన్డే మ్యాచ్ కథ ఇది.
అది 2012, మార్చ్ 18వ తేదీ.. అంటే సుమారు 13 ఏళ్ల క్రితం కథ. ఆసియాకప్. ఢాకా వన్డేలో విరాట్ తన వ్యక్తిగత అత్యధిక పరుగులు 148 బంతుల్లో 183తో ఒక కళాత్మకమైన ఇన్నింగ్స్ నిర్మించాడు. మొదట బ్యాటింగ్ చేసిన దాయాది దేశమైన పాకిస్థాన్ 329 పరుగులు చేసి, 330 పరుగుల టార్గెట్ పెట్టింది. స్పీడ్ బౌలర్లకు కేరాఫైన పాక్.. అందులోనూ, దాయాది దేశం అవ్వడంతో అభిమానుల నుంచి సహజంగానే ఉండే ఒత్తిడి మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచది. అయితే, ఆ మ్యాచులో మరో 13 బంతులు మిగిలి ఉండగానే పాక్ పెట్టిన 330 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించి విజయాన్ని ముద్దాడిరది. ఆ మ్యాచులో జట్టు విజయంలో సగం పాత్ర విరాట్ కోహ్లీదే. ఎందుకంటే 330 పరుగుల్లో 183 పరుగులు సాధించి సగానికి పైగా పరుగులందించాడు గనుకే కోహ్లీ అప్పట్నుంచీ పరుగుల మిషన్‌గా పర్యాయపదమయ్యాడు. ఆ మ్యాచులో ఓ పెట్టని గోడలా నిల్చున్న విరాట్.. ఏకంగా 22 బౌండరీలు, ఒకే ఒక్క సిక్సర్‌తో నిల్చుని ధాటిగా ఆడుతుంటే పాక్ బౌలర్లు నేలకేసి, ఒకరి ముఖాలకు ఒకరేసి, అప్పుడప్పుడూ ఆకాశానికేసి బిత్తరచూపులు చూడాల్సిన పరిస్థితేర్పడిరది. హఫీజ్ అనే బౌలరైతే.. అసలు, తానెందుకు బౌలర్‌ను అయ్యానా అని మథనపడాల్సి వచ్చేలా చేశాడు. బంతి గాల్లోకి లేవకుండానే బౌండరీలతో చుక్కులు చూపించాడు. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ అంటే ఎలా ఉండాలో ఆరోజు కోహ్లీ ఆట ప్రపంచం మొత్తానికి చూపించింది. ఆశ, శ్వాస అన్నీ ఆటే అన్నట్టుగా క్రికెట్ లో రాణించే ఆస్ట్రేలియన్స్ సైతం అబ్బురపడే ఆట అది. అప్పటి కెప్టెన్ మిస్బా ఉల్ హక్ బౌలర్లను మార్చి మార్చి ఏమార్చినా.. అంతకుమించిన మార్చ్ ఫాస్ట్‌తో బంతు లను బౌండరీకి తరలించి తుత్తునియలు చేశాడు కోహ్లీ. మహ్మద్ హఫీజ్, ఉమర్‌గుల్, ఐజాజ్ చీమా, సయాద్ అజ్మల్, షాహిద్ అఫ్రిది, వహాబ్ రియాజ్.. ఇలా ఐదుగురు బౌలర్లను ఎలా మార్చినా లాభం లేకపోయింది. ఏ బౌలరూ కనీసం 40 పరుగులకు తక్కువ ఇవ్వనంతగా ఉతికి ఆరేశాడు కోహ్లీ. ఇదే విషయాన్ని ఓసారి కోవిడ్-19 సమయంలో కోహ్లీ తన ఇన్‌స్టా గ్రామ్ లైవ్‌లో తాజా మాజీ వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌తో మాట్లాడుతూ పంచుకున్నాడు. ఆ మ్యాచులో సచిన్ 52 పరుగులు చేస్తే.. రోహిత్ శర్మ 68 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా వచ్చిన గౌతమ్ గంభీర్ డక్ ఔట్ అయ్యాడు. ఆ మ్యాచులో తన అనుభూతిని, అనుభ వాన్ని పంచుకున్నాడు. ప్రమాదకరమైన, వైవిధ్యమైన పాక్ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు తనకు ఎదురైన సవాళ్ల గురించీ, కఠినమైన పరిస్థితుల్లో క్రీజులో నిల్చున్న తీరు గురించీ ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమ యంలో రోహిత్-కోహ్లీ జంట పరుగుల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒకరినొకరు ఢీకొన్న ఘటననూ షేర్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ జరిగి 13 ఏళ్లైనప్పటికీ.. ఇప్పటికీ ఓ మరపురాని మ్యాచుగా, భారత అభిమాను లకు ఓ పూర్తిస్థాయి పసందైన విందునందించిన ఆటగా ఎప్పటికీ గుర్తుంచుకునేదిగా నిల్చిపోయింది.

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం!
2009లో శ్రీలంకపై తొలి వన్డే సాధించడంతో కోహ్లీ అంతర్జాతీయ విజయ ప్రస్థానం మొదలైంది. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుతో భాగస్వామైన కోహ్లీ.. బంగ్లాతో మ్యాచులో ఆరంగ్రేటంలోనే సెంచరీ చేశాడు. 28 ఏళ్ల తర్వాత 2011 ప్రపంచ కప్‌ను భారత్ అందుకున్న ఫైనల్ మ్యాచులోనూ కోహ్లీది 35పరుగుల భాగస్వామ్యం.
2011 ప్రపంచకప్ విజయం తర్వాత.. సచిన్ టెండూల్కర్ వంటివాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. కోహ్లీ టెస్ట్ కెరీర్‌కు బీజం పడిరది. 2011లో వెస్ట్ ఇండీస్‌తో టెస్టుతో ఆరంగ్రేటం చేసిన కోహ్లీ.. 2011-12లో ఆస్ట్రేలియా చేతిలో 4-0 తేడాతో ఇండియా వైట్ వాష్ అయిన సీరీస్‌లో తను మాత్రం సెంచరీ చేసి ప్రశంసలు పొందాడు.
రాను రాను మ్యాచ్ ఛేజింగ్‌లో మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. 2012లో శ్రీలంకతో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సీరీస్‌లో విశ్వరూపం చూపించాడు. కేవలం 40 ఓవర్లలో భారత్ 320 పరుగులు చేయాల్సి ఉంటే.. కోహ్లీ 86 బంతుల్లో 133 పరుగులు చేసి 36.4 ఓవర్లలోనే అవసరమైన పరుగులతో విజయాన్ని సాధించడంలో కీలకపాత్రధారయ్యాడు. 2012 ఆసియా కప్‌కు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన కోహ్లీ.. పాక్‌పై ఆ సీరీస్‌లో 183 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న భారతజట్టు.. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడగొట్టగా.. ఆ మ్యాచులో 43 పరుగుల అత్యధిక స్కోరర్ కూడా కోహ్లీనే.
2013లో తానారాధించే క్రికెటర్ సచిన్ క్రికెట్ విరమణతో.. కోహ్లీ టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎదిగాడు. దక్షిణాఫ్రికాతో వాళ్ల సొంతగడ్డ జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 119, 96 పరుగులు చేసి.. టెస్టుల్లో తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరీస్‌లో.. రెండో మ్యాచులో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2023లోనూ అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా కోహ్లీకి స్థానం దక్కింది. ఆస్ట్రేలియా 360 పరుగుల లక్ష్యాన్ని ముందుంచితే.. 39 బాల్స్ మిగిలుండగానే ఇండియా ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఛేదనలో తన దమ్మేంటో చాటింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆరో మ్యాచులోనూ 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. 61 బంతుల్లోనే తన దాహం తీరనిదన్నట్టు కోహ్లీ ఆడిన ఆటతో ఆ మ్యాచూ భారత్‌దే పైచేయి అయింది.
2014 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిల్చిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై భారత్ సెమీఫైనల్ విజయంలోనూ కీలక పాత్రధారి. శ్రీలంకతో భారత్ ఓటమిపాలైన మ్యాచులోనూ కోహ్లీదే హయ్యెస్ట్ స్కోర్. కానీ, అదే ఏడాది మళ్లీ కోహ్లీకి గడ్డుకాలాన్ని ముందుంచింది. ఇంగ్లండ్‌లో భారత పర్యటన నేపథ్యంలో ఫామ్ కోల్పోయి చాలా కష్టపడ్డాడు. అతడి కెరీర్‌నే అందరూ ప్రశ్నించే స్థాయిలో పేలవమైన ఆటతో నిరాశపర్చాడు. 2015లోనూ కోహ్లీ ఆట గొప్పగా లేకపోవడంతో.. ఇక కోహ్లీ పనైపోయిందనుకున్నారంతా. అప్పుడూ పాక్‌పై ఒకే ఒక్క సెంచరీ మినహా.. పనికిరాడనుకున్నారు. కానీ, కోహ్లీలో సహజంగానే ఒక దూకుడు స్వభావం.. ఆ కళ్లల్లో బాల్‌ను ఎంత బలంగా బాదాలన్న ఒక కసి.. గేమ్‌కు తనకు తాను శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యే తీరు కోహ్లీని ఎంత ఒత్తిడెదురైనా ఏమీ చేయలేకపోయాయి.
2016లో మళ్లీ కోహ్లీ శకం మొదలైంది. ఆసియా కప్‌లో తన స్కోరే భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చి, ఏకంగా టైటిల్ గెల్చుకునేందుకు కారణమైంది. అప్పటివరకూ ఆడిపోసుకున్న నోళ్లే ఆహా కోహ్లీ ఓహో కోహ్లీ అంటూ హర్షధ్వానాలు చేశాయి. 2016 టీ20 ప్రపంచ కప్ లోనూ మళ్లీ కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిల్చాడు. ఆ ప్రపంచకప్‌లో భారత్ వెస్ట్‌ఇండీస్ చేతిలో పరాభవమెదుర్కోగా.. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్‌లో ఛేజింగ్‌లోనూ కోహ్లీదే కీలకపాత్ర. తానే టాప్ స్కోరర్.
కెప్టెన్‌గా అంతర్జాతీయ కెరీర్!
2013లో విరాట్ కోహ్లీ వెస్ట్ ఇండీస్‌లో జరిగిన త్రికోణపు సీరీస్‌తో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. ఆ టైంలో కెప్టెన్‌గా ఉన్న ధోనీ గాయాలపాలవ్వడంతో.. ఆ అవకాశం కోహ్లీకి దక్కింది. 2014 ఆసియా కప్‌లోనూ అనివార్య కారణాల వల్ల ధోనీ గైర్హాజరీ కోహ్లీకి కెప్టెన్సీ అవకాశాలను కట్టబెట్టింది. కానీ, ఆ సీరీస్‌లో భారత్ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. 2014లో ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుకు ముందు ధోనీకి మళ్లీ గాయాలు ఇబ్బందులపాలు చేసినప్పుడు.. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా కూడా అవకాశం కోహ్లీ తలుపే తట్టింది. ఆ మ్యాచులోనే నాయకుడంటే ఎలా ఉండాలో చూపించాడు. తనను అంతా అగ్రెసివ్ అని ఎందుకంటారో ఆ టెస్టులో కోహ్లీ ఆటను చూస్తే అర్థం చేసుకోవచ్చు. డ్రా కోసం ఆడలేదు సరికదా.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడు ప్రదర్శించి 141 పరుగులు చేసి 364 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరాడు. ధోనీ రెండో టెస్టుకు అందుబాటులోకొచ్చినా.. తిరిగి గాయం ఇబ్బందులు సృష్టించేసరికి మళ్లీ మూడోటెస్టుకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ మూడో టెస్టులోనూ కోహ్లీ ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో టెస్టును డ్రా చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మళ్లీ నాల్గో టెస్టుకు కూడా కోహ్లీనే కెప్టెన్‌గా ప్రకటించారు సెలక్టర్లు.
2016లో వెస్ట్ ఇండీస్‌పై మొట్టమొదటి టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ.. అదే ఏడాది న్యూజిలాండ్‌పై మరో డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ ఆ రెండు సీరీసులనూ గెల్చుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు సీరీసుల్లోనూ డబుల్ సెంచరీలు బాది.. వరుసగా నాల్గు సీరీసుల్లో డబుల్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్ మ్యాన్‌గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.
2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ ఫైనల్స్‌లో మాత్రం భారత్ పాక్ చేతిలో ఓటమిపాలైంది. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్ట్ సీరీస్‌లోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు మళ్లీ కోహ్లీ. వన్డేల్లో సెంచరీలు చేస్తూనే పోతూ.. పరుగుల మిషన్‌గా కోహ్లీ పేరుకు ఓ సుస్థిరస్థానం ఏర్పడిరది. 2018లో 10 వేల పరుగులు పూర్తి చేసిన కోహ్లీ.. ఆ ఘనత సాధించిన 13వ బ్యాట్స్ మ్యాన్‌గా రికార్డ్ నమోదు చేశాడు. అప్పటికే తనకంటే ముందు 10వేల పరుగులు పూర్తిచేసిన తానారాధించే క్రికెట్ దేవుడు సచిన్ కంటే తక్కువ మ్యాచుల్లో 54 ఇన్నింగ్సుల్లోనే ఆ ఘనత సాధించాడు కోహ్లీ.
2018-19 ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ నేతృత్వంలోని భారతజట్టుకు ఓ మరపురాని మరో అనుభవం. ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్ సీరీస్‌ను కోహ్లీ కెప్టెన్సీలో భారత్ గెల్చుకుంది. ఆ సీరీస్‌లోనే కోహ్లీ తన 25వ టెస్ట్ సెంచరీనీ పూర్తిచేశాడు. 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌కూ భారతజట్టు కెప్టెన్‌గా కోహ్లీనే నియమితుడయ్యాడు. ఆ ప్రపంచకప్ సీరీస్‌లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు కోహ్లీ. కానీ, అప్పుడు సెమీఫైనల్స్‌లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ టోర్నమెంట్‌లోనే కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి తన 20వేల అంతర్జాతీయ పరుగులను పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా పూర్తిచేసిన ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు. ఆ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సీరీస్ లో తన అత్యధిక టెస్ట్ స్కోర్ 254 పరుగులు చేశాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించిన ఘనత కోహ్లీ సాధించాడు. అలా ఒక క్యాలెండర్ ఇయర్‌లో అన్నేసి పరుగులను ఎనిమిది సార్లు చేసి.. అంతకుముందు ఏడుసార్లు సచిన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఏడుసార్లు వెయ్యి పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఘనతను దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో యాదృచ్ఛికంగా తన పుట్టినరోజున నవంబర్ 5నే సమం చేసి.. రికార్డులకెక్కాడు కోహ్లీ. 50 వన్డే సెంచరీలు సాధించిన కోహ్లీ.. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు 673 చేసి సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డునూ బద్ధలు కొట్టి.. 2023 టీ20 ప్రపంచకప్‌లో 765 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిల్చి భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త విరాటపర్వాన్ని లిఖించాడు.
2024 టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ అంత ఫామ్‌లో ఏమీ లేడు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో టోర్నమెంట్‌లో తన మొదటి అర్ధ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన తర్వాత.. కోహ్లీ తన టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
- బాతాఖానీ సౌజన్యంతో..
Comments