top of page

క్రికెట్ VS క్రికెటర్స్!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • May 29
  • 3 min read
  • జిల్లా పొలిటికల్ క్రికెట్ లీగ్‌లో ఆసక్తికర మ్యాచ్

  • కొత్తగా తెరపైకి క్రికెటర్ల పేరెంట్స్ అసోసియేషన్

  • జిల్లా క్రికెట్ సంఘానికి ఇది పోటీ అన్న ప్రచారం

  • వీటికి చెరో రాజకీయ కుటుంబం మద్దతు ఉందన్న వాదన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా క్రికెట్ సంఘంపై ఆధిపత్యం సాధించడానికి అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య పోటీ మొదలైంది. కూన రవికుమార్‌ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం యాదృచ్ఛికం కాదని, ఎత్తుకు పైఎత్తులో భాగంగా ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని అర్థమవుతుంది. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు పక్షుల్లో గరుత్మంతుడిని నేనే, నక్షత్రాల్లో చంద్రుడ్ని నేనే, వేదాల్లో సామవేదం నేనే, దేవతల్లో ఇంద్రుడ్ని నేనే, పర్వతాల్లో మేరువుని నేనే, రుద్రుల్లో శంకరుడ్ని నేనే .. అన్నట్టు ఆటలంటే క్రికెట్టే అన్నంతగా పేరుపడింది. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ రాజ్యమేలిన నేతలే జిల్లా క్రికెట్ సంఘంలో కూడా చక్రం తిప్పాలని ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు కూడా. కొందరు ఈ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నికైతే, మరికొందరు దీన్ని చీల్చి, పోటీ సంఘం పెట్టి అధికారంలో ఉన్నన్నాళ్లూ హÃదా వెలగబెట్టారు. అయితే కోర్టు ప్రస్తుతం ఉన్న జిల్లా సంఘాన్నే గుర్తించడంతో మరో దారిలేక ఈ ఒక్క సంఘంలో కీలక పాత్ర కోసం ఒకే పార్టీలో రెండు వర్గాలు గుద్దులాడుతున్నాయి. జిల్లా క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ఎన్నుకుంటే, జిల్లా క్రికెటర్స్ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడిగా నిమ్మాడకు చెందిన కొర్ను గిరిబాబును ఎన్నుకున్నారు. అంటే.. ఏ వర్గాల మధ్య ఈ పోరు జరుగుతున్నదో వేరేగా చెప్పనక్కర్లేదు. అలాగే పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా టెక్కలికి చెందిన కీర్తిని నియమించారు.

వైకాపా హయాంలోనే బీజం

ఇంతవరకు లేని జిల్లా క్రికెటర్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఇప్ప్పుడు కొత్తగా పుట్టుకురావడం వెనుక కారణాలను పెద్దగా విశ్లేషించనక్కర్లేదు. జిల్లా క్రికెట్ సంఘంలో ఎవరున్నా సహకరిస్తామని ఈ కమిటీ తీర్మానించినా, దీని వెనుక మర్మం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరెంట్స్ కమిటీ గురువారం స్థానికంగా సమావేశమై ప్రకటించిన తీర్మానాలు సహేతుకమైనవే. అయితే ఇప్ప్పుడే ఎందుకు తెర మీదకు వచ్చాయన్నదే చర్చనీయాంశం. జిల్లా క్రికెట్ సంఘాన్ని జిల్లా బయట ఉన్న పెద్దలు ఏలుతున్న మాట వాస్తవం. అలా అని తమ్మినేని సీతారాం తనయుడు బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్‌గా సంఘాన్ని చీల్చి కొత్త సంఘం ఏర్పాటుచేసి, దానికి అధ్యక్షుడిగా కొనసాగినప్ప్పుడు కూడా జిల్లాకు ఎటువంటి మేలు జరగలేదు. 2023లో జిల్లా క్రికెట్ సంఘాన్ని మాత్రమే గుర్తించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ సంఘం మీద ఆరోపణలు లేకపోలేదు. కానీ తమ పిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఏకంగా తల్లిదండ్రులే అసోసియేషన్‌ను నెలకొల్పే ప్రయత్నం మాత్రం చేయలేదు. కానీ ఇప్ప్పుడు వారి పేరుతో ఒక కొత్త సంఘం ఏర్పడింది. వాస్తవానికి జిల్లాయేతర క్రీడాకారులను జిల్లా కోటాలో ఆడించడం, అలాగే ఆధార్ కార్డులో వయసును మార్చి వేరేవారిని అకామిడేట్ చేయడం వంటి ఆరోపణలు జిల్లా సంఘం మీద ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎప్ప్పుడైతే జిల్లా ఎస్పీ ఆ జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు కాకుండాపోయారో అప్ప్పుడే క్రికెట్‌లోకి రాజకీయాలు ప్రవేశించాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్పీలు అధ్యక్షులుగా ఉన్నన్నాళ్లూ ప్రతిదానికీ ఒక లెక్కాపత్రం ఉండేది. కానీ రాజకీయ ప్రమేయంతో కమిటీలు కొలువుతీరినప్పటినుంచి పరిస్థితి చెయ్యి దాటిపోయింది. గతంలో ఆమదాలవలస నియోజకవర్గంలోనే బాలురు, బాలికల క్రికెట్ అసోసియేషన్ అంటూ తమ్మినేని చిరంజీవి నాగ్ ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహించినప్ప్పుడే దాన్ని వ్యతిరేకించిన కూన రవి జిల్లా క్రికెట్ సంఘానికి మద్దతిస్తూ వచ్చారు. దాంతో ఇదే సంఘంలో కొందరు కింజరాపు కుటుంబాన్ని ఆశ్రయించి అభయం పొందారు. ఎందుకంటే.. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడు ఈ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఫలితంగా క్రికెట్ సంఘంలో ఇప్ప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. వాస్తవానికి రామ్మోహన్ నాయుడుకో, అచ్చెన్నాయుడుకో క్రికెట్ సంఘాన్ని పర్యవేక్షించే తీరుబాటు లేదు. కాకపోతే ఈ సంఘం కూన రవి చేతిలోకి వెళ్లిపోయిందన్న ఇంజక్షన్ గట్టిగానే పని చేస్తున్నట్టు కనిపిస్తున్నది. సంఘంలో గతంలో జరిగిన అవినీతిలో ఇటు కూన రవికైనా, అటు కింజరాపు కుటుంబానికైనా ఎటువంటి ప్రమేయం లేదు. ఇప్ప్పుడు దీనికి అధ్యక్షులుగా ఏ గ్రూపువారున్నా ప్రక్షాళన చేయడమొక్కడే తక్షణ కర్తవ్యం. తెలుగుదేశం హయాంలో ఆమదాలవలస నియోజకవర్గంలో స్టేడియం నిర్మిస్తే 2019-23 మధ్యకాలంలో తమ్మినేని చిరంజీవి నాగ్ అది వైకాపా ప్రభుత్వ గొప్పతనమేనని ప్రకటించడం వల్లే క్రికెట్ అసోసియేషన్ మీద కూనరవి దృష్టి పడింది. అదే సమయంలో టెక్కలి నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు ప్రాక్టీస్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తుండటం, ఎంపికలో అన్యాయానికి గురయ్యామని అచ్చెన్నాయుడికి ఫిర్యాదులు చేయడంతో ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్ప్పుడు క్రికెట్ సంఘం పని పట్టాలనే భావనలో ఉండేవారు. తీరా ఇప్ప్పుడు సంఘానికి ఎన్నికలు జరిగేసరికి కూన రవిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో అధ్యక్షుడిగా ఉన్న పుల్లెల వైఎన్ శాస్త్రిని అవమానకరంగా బయటకు పంపారు. దీంతో ఇంతవరకు క్రికెట్ సంఘానికి రెండు ప్రధాన అంగాల్లో ఒకరిగా భావిస్తున్న పుల్లెల శర్మకు కింజరాపు మద్దతు, రెండో అంగమైన ఇలియాస్‌కు కూన రవికుమార్ మద్దతు లభించినట్లయింది. వాస్తవానికి జిల్లా క్రికెట్ సంఘంలో జరిగిన అవినీతి, ఎంపికల్లో పారదర్శకత లేకపోవడం వంటివాటిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఎప్ప్పుడో జ్యుడీషియల్ విచారణ జరిపించాలి. ఎందుకంటే వీటిపై పత్రికల్లో అనేక కథనాలు ఆధారాలతో సహా వచ్చాయి. ఎప్ప్పుడూ ఆ వైపు కన్నెత్తి చూడని ఏసీఏ ఈసారి జ్యుడీషియల్ త్రిసభ్య కమిటీ వేసిందంటే.. రాజకీయంగా వాతావరణం వేడెక్కడమేనని వేరేగా చెప్పనక్కర్లేదు. ఇటీవల జరిగిన జిల్లా క్రికెట్ సంఘం ఎన్నిక చెల్లదని ఈ త్రిసభ్య కమిటీ ఒకవేళ తేలిస్తే కచ్చితంగా కింజరాపు కోట నుంచే కొత్త అధ్యక్షుడు పడతాడనడంలో సందేహం లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page