top of page

కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారు..!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 10, 2024
  • 2 min read

దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టించిన రెండు భాగాల తెలుగు సినిమా ‘బాహుబలి’ - ఆ తర్వాత ఘనవిజయం సాధించిన ఏ తెలుగు సినిమా ఎంత వసూలు చేసినా అది ‘నాన్‌ బాహుబలి రికార్డ్‌’ గానే పరిగణించబడుతోంది. ‘బాహుబలి 2’ సినిమాకు టికెట్‌ ధరలు అధికపక్షం 30 శాతం మేర పెంచుకునేందుకు (రూ.70 - రూ.100, 90-150, 200-300) రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాయి. రోజూ వేసే నాలుగాటలు కాకుండా అదనంగా ఒక ఆట వేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండాటలు వేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాయి. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైన రోజు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో వచ్చిన రివ్యూలతో సంబంధం లేకుండా సినిమా థియేటర్లు తిరునాళ్లను తలపించాయి. ‘బాహుబలి 2’కి పెంచిన టికెట్ల ధరలు కూడా ఇంటిల్లిపాది సినిమాకు వెళ్లగలిగే స్థాయిలో ఉన్నాయి కనుక ఆ సినిమా మొదటి వారం రోజులకు ముందస్తుగానే టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌ అయిపోయాయి. ఆ తర్కాన్ని మరిచిన తెలుగు సినిమా పరిశ్రమ - టికెట్ల ధరల పెంపు ప్రేక్షకులకు ఆమోదయోగ్యమనే తప్పుడు అభిప్రాయా నికొచ్చింది - ‘భారీ బడ్జెట్‌’ బ్యానర్‌ మీద ‘సినిమా టికెట్ల ప్రైస్‌ హైక్‌’ అనే చిత్రానికి పెద్ద నిర్మాతలు ‘క్లాప్‌’ కొట్టారు. ఎంత క్రేజీ ప్రాజెక్ట్‌ అయినా కూడా ప్రేక్షకులకు అందుబాటులో లేని ధరల్లో టికెట్లు విక్రయించాలని చూడటం కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం లాంటిదని ‘పుష్ప 2’ సినిమాకు వస్తున్న వసూళ్లను చూసైనా అర్ధం చేసుకోవాల్సిన అవసరముంది. అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ ఉత్తర భారతదేశంలో పెద్ద విజయం సాధించడంతో ‘పుష్ప’ రెండో భాగం సంచలన విజయం సాధించబో తోందనే అంచనాలు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయి. దాంతో గతంలో ఎన్నడూ లేని విధంగా టికెట్ల ధరలు నాలుగైదింతలు పెంచారు. బాహుబలి 1, 2 భాగాల కన్నా ఈ సినిమా విడుదలైన థియేటర్ల సంఖ్య, వేసిన షోల సంఖ్య, టికెట్ల ధరలు ప్రతీది హీనపక్షం మూడిరతలు ఎక్కువ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మాత్రం ఆ స్థాయిలో ఎందుకు లేవు? సినిమా ప్రేక్షకుల్లో విశ్వసనీయత ఉన్న వెబ్‌సైట్ల నుంచి మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లు - అధిక శాతం మాధ్యమాల్లో సినిమా బాగుందనే మాటే వినిపిస్తున్నా పెంచిన ధరల నిష్పత్తిలో వసూళ్లు ఎందుకు లేవు? డిసెంబర్‌ 9 నుంచి 16వ తేదీ వరకు సింగిల్‌ స్క్రీన్స్‌లో టికెట్‌ ధర మీద అదనంగా 105 రూపాయల మేర విక్రయించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని కూడా సాధారణ ధరలకు (సింగిల్‌ స్క్రీన్స్‌లో ఈ రోజు టికెట్‌ ధర 200 రూపాయలు ఉంది) ఎందుకు దిగారు? ఈ లెక్కలన్నీ సరిగ్గా వేసుకోగలిగేవాళ్లకు స్పష్టంగా అర్ధమయ్యేదేంటంటే.. సినిమా టికెట్లు సాధారణ ధరలకే విక్రయిస్తే - సినిమా మొదటి మూడు రోజులూ తాము చూడటానికి, ఇంట్లో అందరికీ చూపించడానికి హీరోల అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు... పదో, పరకో పెంచితే అయ్యే ఖర్చులో ఇంకొంత అనుకుని ఇంటిల్లిపాదీ సినిమా చూడటానికి వెనకాడకపోవచ్చు... కానీ ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచితే మాత్రం నాలుగు రోజులు పోయాక ఇంట్లో కూర్చుని హాయిగా టీవీలో చూద్దామనుకుంటారు తప్ప సినిమా థియేటర్‌కి వెళ్ళాలనే ఆలోచనను కూడా ఎవరూ దరిచేయనీయరు. దేశ సంపద ఎర్రచందనం ఒకవైపు దోపిడీ చేస్తూనే వంద రూపాయల సినిమా టికెట్‌ను మూడు వేలు పెట్టి బీదాబిక్కి, మధ్యతరగతి జేబులు కొడుతున్న పుష్పరాజ్‌ ఆయన సృష్టికర్త సుకుమార్‌కి జేజేలు. నీ వ్యాపార నీతి ప్రపంచ వాణిజ్య శాస్త్రాలలో పార్యాంశం చేసేలా ఉన్నావ్‌. సినిమా నీ సృజన కావొచ్చు.. నీ భావోద్వేగ పెట్టుబడి కావొచ్చు.. నీ సినిమాకు టికెట్‌ రేటు నిర్ణయించుకునే హక్కు నీకు ఉన్నట్టే ఒక మేదరి వాడు ఒక బుట్ట చేస్తాడు. ఒక సాలె బట్టను నేస్తాడు. రైతు బురదను బువ్వగా మారుస్తున్నాడు. ఒక కమ్మరి, కుమ్మరి, నేత, ఇంకో సృజనకారుడు తోలు నూని చెప్పులు చేస్తాడు. తన సృజనకు నచ్చిన రేటు నిర్ణయించుకునే హక్కు, అధికారం, స్వేచ్ఛ కింది కులాలకు కూడా ఉంది కదా సుకుమారు గారూ.. ఒక దొంగ చెట్లను కొట్టి దొంగలకు నాయకుడు అవుతాడు. వాడు అడివి దాటి నగరానికి వస్తాడు నగరం వదిలి పట్టణం దాన్ని వదిలి ఐక్యరాజ్య సమితి మీద జెండా వేస్తాడు. అక్కడ ఆయుధాలు అమ్ముకునే వాడికీ, ఇక్కడ టిక్కెట్లు అమ్ముకునే నీకూ పెద్ద తేడా లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page