top of page

కోర్టును బురిడీ కొట్టించడమే ‘గీతా’సారం

Writer: NVS PRASADNVS PRASAD
  • 22ఎలో ఉన్న డి-పట్టాను కొన్నారట

  • నకిలీ బాధితుల్ని కోర్టులో చూపెట్టి రాజీ చేశారు

  • రూరల్‌ స్టేషన్‌ పక్కనే కోట్లు విలువైన ఆస్తికి ఎసరు

  • హక్కుదారులు దళితులు కావడమే కారణం

  • వీఆర్వో, లాయర్‌, ప్రజాసంఘ నాయకుడు కుమ్మక్కు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

భగవద్గీత మీదో, భగవంతుడి మీదో ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని కోర్టులో చెప్పించడం ఒక నిబంధన. ఇందులో బోనెక్కినవారంతా ప్రమాణం చేసి చెప్పేది నిజమే అవుతుందన్న గ్యారెంటీ లేదు. అందుకే కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. ఈ మేరకే తీర్పులు వెలువడతాయి. రాజీ మార్గం రాజమార్గమన్నారు కదా అని లోక్‌ అదాలత్‌లో బాధితుల స్థానంలో వేరొకర్ని నిలబెట్టి రాజీ అయినట్టు చూపెట్టి కోట్ల ఆస్తులు కొట్టేయడానికి పన్నాగం రచించింది ఎవరైనా స్వయంగా కోర్టుతో గేమ్స్‌ ఆడటమే. అందుకు ఒకటికి మించిన గుండెలైనా ఉండాలి.. లేదా గుండెలు తీసిన బంటైనా అయివుండాలి. తనకు వ్యతిరేకంగా ఉన్నవారు దళితులు కాబట్టి ఏదో ఒక రూపంలో కోర్టులో కేసు పోతే తృణమో, ఫణమో ఇవ్వమని తన కాళ్ల ముందు మోకరిల్లుతారని భావించిన అహంకారం ఆమె కళ్లు కప్పేసింది. అందుకే కోర్టును సైతం తప్పుదోవ పట్టించింది.

సంఘసేవకురాలు పేరుతో ఎంతోమందికి సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్న ఆమె ఇప్పుడు అదే సంఘంలో దళితుల భూమిని అక్రమంగా దఖలుపర్చుకున్నారు. పేదల తలరాతలు మార్చడానికి ఆమె డాక్టరేట్‌ చేశారని భక్తబృందం ప్రకటిస్తే, ఆమె లేకుండా ఒక స్థాయి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరగడం మానేసి చాలా ఏళ్లయింది. నీటిలో తేలియాడే విద్యలో ఆరితేరిపోయిన ఆమె ముంచడంలో స్పెషలిస్ట్‌ అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇన్నాళ్లూ ‘అట కదా..’ అన్న నోళ్లే అవి ఆరోపణలు కావు, వాస్తవాలని చెప్పడానికి ముందుకొస్తున్నాయి. కాకపోతే ఆ గొంతులు వినే వ్యవస్థ ఇక్కడ కరువైపోయింది. దళిత గిరిజన మహిళలను ఉద్ధరిస్తానంటూ ఎప్పటికప్పుడు ఫొటో కార్యక్రమాలు, పద్మశ్రీల కోసం పాకులాటలు జరిపే ఈమె ఇప్పుడు ఏకంగా కోట్లు విలువ చేసే స్థలానికి తన సామాజికవర్గం బలం చూసుకొని కబ్జాకు పాల్పడుతున్న కథనమే ఇది. వకాల్తా పుచ్చుకున్న న్యాయవాదిని, పోరాడతామని ముందుకు వచ్చిన ప్రజాసంఘాల నాయకుడ్ని, పక్కనే ఉన్న రెవెన్యూ యంత్రాంగాన్ని హోల్‌సేల్‌గా కొనేయడంతో న్యాయం కోసం తమ సొంత స్థలంలోనే గత కొన్నాళ్లుగా ఒక కుటుంబం వంటా`వార్పు చేసుకుంటోంది. కోర్టు నిబంధనలకు కొత్త సారం చెప్పిన ఈ కథనంలోకి వెళ్లాలంటే ముందు ఈ కథేమిటో తెలుసుకోవాలి.

తండ్రి నుంచి వారసత్వంగా దఖలుపడాల్సిన ఆ ఆస్తి కోసం ఒక పేద దళిత కుటుంబం గత కొన్నాళ్లుగా రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ గోడకు ఆనుకొని నిరసన చేపడుతోంది. ఈ విషయం అటు పోలీసులకు, ఇటు పత్రికలకు (ఆదిత్య మినహా) ఏమాత్రం పట్టలేదు. చివరకు అక్కడెక్కడో దళిత డీజీని సస్పెండ్‌ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న దళిత సంఘాలు సైతం ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలవడానికి ముందుకు రాలేదు. తెల్లారి లేస్తే అంబేద్కర్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొనే సంఘాలు కూడా పార్టీల ముసుగులో అక్రమార్కులకు వంతపాడటమే ఇక్కడ కొసమెరుపు.

జాతీయ రహదారికి ఆనుకొని శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు పక్కనే ఉన్న భూమి ధర బహిరంగ మార్కెట్‌లో రూ. కోట్లలో ఉంటుంది. దీన్ని స్వచ్ఛంద సేవకురాలుగా, సామాజిక కార్యకర్తగా చెప్పుకొని తిరుగుతున్న గీతాశ్రీకాంత్‌ ఆక్రమించి, దాని చుట్టూ ప్రహరీ కట్టి అక్కడకు ఎవర్నీ రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారు. ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం`1973 అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బీసీలకు 1976లో పంపిణీ చేసింది. అందులో భాగంగా పెద్దపాడు పంచాయతీ తంగివానిపేట దళిత కుటుంబానికి చెందిన లోపింటి రామయ్యకు సర్వే నెంబర్‌ 68/2డీలో 27 సెంట్ల భూమిని డి`పట్టా రూపంలో అందజేశారు. ఈ భూమి 2018 వరకు లోపింటి రామయ్య స్వాధీన అనుభవంలోనే ఉంది. గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో అడంగల్‌లో ఎల్పీ నెంబర్‌ 294గా మార్చారు. భూమి వర్గీకరణ, స్వభావం చూస్తే ప్రభుత్వ, సెటిల్మెంట్‌ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో చూపిస్తుంది. ఈ భూమి 22`ఏ(1డీ)గా 2017 సెప్టెంబర్‌ 19న నోటిఫై చేసినట్టు చూపిస్తుంది. రీసర్వే తర్వాత కూడా ఈ భూమి 22ఏగా ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తుంది. దీనికి హక్కుదారుగా లోపింటి రామయ్య పేరు రికార్డుల్లో నమోదై ఉంది.

కానీ ఈ భూమి చుట్టూ గీతా శ్రీకాంత్‌ ప్రహరీ కడితే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. పోనీ లోపింటి రామయ్య నుంచి గీతా శ్రీకాంత్‌ కొనుగోలు చేసుకున్నారని భావించినా ఒక డి`పట్టా భూమి, అది కూడా 22ఎలో ఉన్న భూమికి ఆమె హక్కుదారు ఎలా అయ్యారో రెవెన్యూ యంత్రాంగం చెప్పడంలేదు. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్నా, దాన్ని సేల్‌డీడ్‌ ద్వారా కొనుగోలు చేసినట్టు గీతా శ్రీకాంత్‌ చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి ప్రహరీ కట్టారని బాధితులు గత 15 రోజులుగా ఆ స్థలం వద్ద వంటావార్పు చేస్తూ బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆక్రమించి సొంతం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఒక న్యాయవాది, ప్రజాసంఘాల నాయకుడు, పెద్దపాడు వీఆర్‌వో ఈమెకు పూర్తిస్థాయిలో సహకరించారని లోపింటి రామయ్య వారసులు లోపింటి అప్పమ్మ, సవలాపురపు అప్పన్న, ఎచ్చెర్ల తవిటమ్మ, పుట్టా ఇందుమతి చెబుతున్నారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ

1976లో డి`పట్టా రూపంలో సంక్రమించిన 27 సెంట్ల భూమి రామయ్య అనుభవ స్వాధీనంలో ఉంటుండగా ఆయన మృతి చెందాడు. రామయ్యతో పాటు మరికొందరు దళితులు, బీసీలకు ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని డి`పట్టా రూపంలో పంపిణీ చేశారు. రామయ్య అనుభవంలో ఉన్న సర్వే నంబర్‌ 68/2డీని ఆయన మరణాంతరం పెద్దపాడు వీఆర్‌వో అప్పారావు సహకారంతో గీతా శ్రీకాంత్‌ సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడంతో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన వారసులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులను పోలీసులు పిలిపించి మందలించి పంపించేశారు. దీంతో గీతా శ్రీకాంత్‌ రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ సమయంలో కొందరు ప్రజాసంఘాల నాయకులు డి`పట్టా భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆందోళన చేశారు కూడా. ఆ తర్వాత డి`పట్టా పత్రాలు కలిగిన లోపింటి రామయ్య వారసులు 2018లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్‌ దావా వేశారు. సేల్‌ డీడ్‌ ద్వారా పెద్దపాడు సర్వే నెంబర్‌ 68/2సీ, 68/2డీలో 54 సెంట్లు కొనుగోలు చేసినట్టు రామయ్య వారసులకు వ్యతిరేకంగా గీతా శ్రీకాంత్‌ రెండు దావాలు వేశారని బాధితులు వెల్లడిరచారు. దావాలపై విచారణ సాగుతుండగా రామయ్య వారుసుల కేసు వాదిస్తున్న న్యాయవాది ఉషా మృతి చెందగా, మరో న్యాయవాది ఈ కేసును వకాల్తా తీసుకున్నారు. ఈ దావాపై న్యాయస్థానంలో విచారణ సాగుతుండగా కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పి రామయ్య వారసులను న్యాయవాది ఇంటికి పిలిపించి వారితో సంతకాలు చేయించారు. ఆ తర్వాత 2022 నవంబర్‌ 12న లోక్‌ అదాలత్‌లో రాజీ చేయించి అవార్డు పాస్‌ చేయించారు. లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చినట్లు, నాట్‌ ప్రెస్‌ మెమోలో రామయ్య వారసులకు ఎటువంటి హక్కు లేదని, భవిష్యత్తులో ఎలాంటి వివాదానికి అవకాశం ఉండదని, ఎవరి ఖర్చులు వారే భరించుకున్నట్టు రాయించారు.

కోర్టునే తప్పుదోవ పట్టించారు

లోక్‌ అదాలత్‌లో రాజీ అయిన విషయం తెలియని రామయ్య వారసులు కేసు వకాల్తా తీసుకున్న న్యాయవాదిని కలిసిన ప్రతిసారీ విచారణ జరుగుతుందని చెప్పి పంపిస్తుండేవారని బాధితులు చెబుతున్నారు. దీంతో వేరొకరితో కేసు ఓఎస్‌ నెంబర్‌ ఇచ్చి ఆరాతీయగా లోక్‌ అదాలత్‌లో రాజీ చేసినట్టు న్యాయస్థానం రికార్డులో చూపించడంతో బాధితులు న్యాయవాదిని ప్రశ్నించారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇచ్చి సదరు లాయరు తప్పుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయవాదిని నమ్మి మోసపోయామని గుర్తించి వేరే న్యాయవాదిని సంప్రదించి న్యాయస్థానంలో కేసు పూర్వపరాలను పరిశీలించగా వకాల్తా తీసుకున్న న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేయాలని సంతకాలు చేయించి లోక్‌ అదాలత్‌ నాట్‌ప్రెస్‌ మెమోలో మాత్రం నిసాని పెట్టించారని తేలింది. అప్పటి వరకు జరిగిన దావాలన్నింటిలోనూ లోపింటి రామయ్య వారసురాలు అప్పమ్మ సంతకాలు చేయగా, లోక్‌ అదాలత్‌లో మాత్రం అప్పమ్మ నిసాని పెట్టినట్టు చూపించారు. అంటే లోక్‌ అదాలత్‌కు లోపింటి రామయ్య వారసులకు బదులు వేరొకరిని తీసుకువెళ్లారన్నమాట. ఇది పూర్తిగా కోర్టును తప్పుదోవ పట్టించడమే. డి`పట్టా భూమిని ఆక్రమించుకుంటున్నారని మొదట్లో ఆందోళన చేసిన ప్రజాసంఘాల నాయకులను గీతా శ్రీకాంత్‌ కొనేసిన తర్వాతనే బాధితులకు తెలియకుండా లోక్‌ అదాలత్‌లో రాజీ చేసినట్టు రామయ్య వారసులు ఆరోపిస్తున్నారు.

బైఠాయించి బాధితులు నిరసన

లోపింటి వారసులుగా ప్రజాసంఘాల నాయకుడు సూచించిన వ్యక్తులను లోక్‌ అదాలత్‌లో చూపించి పని కానిచ్చేశారని రామయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యంగా ఆక్రమించి ప్రహరీ నిర్మించిన చోట భూమిపై సర్వహక్కులు కలిగిన రామయ్య వారసులు బైఠాయించి నిరసన తెలిపితే, పెద్దమనుషులకు డబ్బులిచ్చేశామని, ఇంకా ఎందుకు గొడవ చేస్తున్నారని బెదిరిస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. పెద్దమనుషులుగా వ్యవహరించిన వీఆర్‌వో అప్పారావు రూ.27 లక్షలు తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఆయనతో పాటు న్యాయవాది, ప్రజాసంఘాల నాయకుడికి కలిపి రూ.50 లక్షలు ముట్టజెప్పారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు మరోమారు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారని తెలిసింది. న్యాయస్థానంలో బాధితులకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని వివరిస్తూ డి`పట్టా భూమిపై రామయ్య వారసులు డిక్లరేషన్‌ దావా వేశారు. దీంతో పాటు లోక్‌ అదాలత్‌కు, హైకోర్టు సీజేకు, రిజిస్ట్రార్‌కు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులు పెద్దపాడు సర్వే నెంబర్‌ 68/2సీ, 68/2డీలో 54 సెంట్లు కొనుగోలు చేసినట్టు చెబుతున్నా లోపింటి రామయ్యకు ల్యాండ్‌ సీలింగ్‌ భూమికి ఇచ్చిన 27 సెంట్లు డి`పట్టా భూమి మేరకే ప్రహరీ కట్టారు. మిగతా 27 సెంట్లు ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రామయ్యకు చెందిన 27 సెంట్లలో రెండు సెంట్లు జాతీయ రహదారి విస్తరణలో పోయింది. ప్రస్తుతం 25 సెంట్లు భూమి మాత్రమే మిగిలింది. దీన్ని ఆక్రమించి కొనుగోలుగా చూపించి గీతాశ్రీకాంత్‌ రాజకీయ నాయకులు సహకారంతో ప్రహరీ కట్టించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page